సెలక్షన్ పరేషాన్!
విజయాల బాటలో ఉన్నప్పుడు తుది జట్టును మార్చకూడదనేది క్రికెట్‌లో సహజ సూత్రం. భారత కెప్టెన్ ధోని కూడా ఈ విషయంలో పట్టుదలగా ఉంటాడు. ఒక ఆటగాడు పదే పదే విఫలమైనా జట్టు గెలుస్తోంది కాబట్టి మార్పులు అనవసరం అనేది అతని నిశ్చితాభిప్రాయం.
మరి టీమ్ వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నప్పుడు ఏం చేయాలి. ఒకరు కాదు ఇద్దరు కాదు... జట్టు సభ్యులలో ఎక్కువ మంది పేలవ ఫామ్‌లో ఉన్నారు. చేసిన మార్పులేమో కలిసి రావడం లేదు. ఇలాంటి స్థితిలో తుది జట్టు కూర్పు కుదిరేదెలా? ఎవరిని ఎంపిక చేయాలి... ఎవరిని పక్కన పెట్టాలి..! ఓవల్ టెస్టుకు ముందు తుది జట్టు ఎంపికే ఇప్పుడు టీమిండియాకు కొత్త సమస్యగా మారింది.
‘స్థానం కోసం సొంత జట్టులోనే గట్టి పోటీ ఉంది. ఇది మంచి పరిణామం’... భారత్ జోరు మీదున్నప్పుడు జట్టు గురించి ఈ మాట తరచుగా వినిపించేది. మన ‘బెంచ్ బలం’ బాగుందని, అందరూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు కాబట్టి తుది జట్టు ఎంపిక కష్టంగా మారిం దని అనేవారు. అయితే ఇప్పుడు ఈ ‘పోటీ’ అవాంఛనీయ మలుపు తిరిగినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఒకరు విఫలమైతే ఆ స్థానంలో రావాల్సిన ఆటగాడిపై కూడా జట్టు మేనేజ్‌మెంట్‌కు నమ్మకం లేని పరిస్థితి ఉంది. ఈ సమయంలో చివరి టెస్టు తుది జట్టు ఎంపికలో జరిగే పొరపాట్లు సుదీర్ఘ కాలం కెప్టెన్‌ను వెంటాడవచ్చు. సరిగ్గా చెప్పాలంటే ఓవల్ టెస్టులో విఫలమైతే ప్రస్తుత జట్టులో చాలా మం దికి భవిష్యత్తులో మరో టెస్టు ఆడే అవకాశం కూడా దక్కకపోవచ్చు.
ఫలితం ఇవ్వని మార్పులు
లార్డ్స్ టెస్టులో ఘన విజయం తర్వాత సౌతాంప్టన్‌లో ధోని రెండు మార్పులతో బరిలోకి దిగాడు. ఇషాంత్ గాయంతో తప్పుకోగా బిన్నీని పక్కన పెట్టారు. వీరి స్థానాల్లో పంకజ్ సింగ్, రోహిత్ శర్మ జట్టులోకి వచ్చాడు. పంకజ్ ఒక్క వికెట్ తీయకపోగా...రోహిత్ 28, 6 పరుగులు చేశాడు. ఆ తర్వాత మాంచెస్టర్‌లో భారత్ మూడు మార్పులు చేసింది. ధావన్, రోహిత్, షమీ స్థానాల్లో గంభీర్, అశ్విన్, ఆరోన్ వచ్చారు. వీరిలో ఆరోన్ ఆకట్టుకున్నాడు. అశ్విన్ బ్యాటింగ్‌లో నిలబడినా...తన అసలు బాధ్యత బౌలింగ్‌లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఇక చాలా కాలం తర్వాత టెస్టు ఆడిన గంభీర్ అయితే ఘోరంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో చివరి టెస్టు కోసం తుది జట్టును ఎంపిక చేసే ముందు ధోని మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది.
ఎవరి స్థానంలో ఎవరు?
జడేజా, అశ్విన్‌లలో ఎవరిని తీసుకోవాలనేదే ఇప్పుడు టీమ్ మేనేజ్‌మెంట్ ముందున్న ప్రధాన సమస్య. ఓవల్‌లో పేస్‌కు అనుకూలమైన వికెట్ ఉండవచ్చని వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఇద్దరిలో ఒకరికే అవకాశం దక్కడం ఖాయం. బౌలింగ్‌లో ఇద్దరూ అంతంత మాత్రంగానే రాణించారు. గత టెస్టులోనైతే అశ్విన్‌కు ఒక్క వికెట్టూ దక్కలేదు. ఇక లార్డ్స్‌లో జడేజా కీలక ఇన్నింగ్స్ భారత్ విజయానికి బాటలు వేసినా ఆ తర్వాత రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. నాలుగో టెస్టులో అశ్విన్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కాబట్టి ఎవరి స్థానమూ ఖాయం కాదు. ఐదుగురు బౌలర్లతో ఆడాలనుకుంటేనే ఈ ఇద్దరూ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది.
ఈ ఇద్దరిదే సమస్య!
రెండు చెత్త ప్రదర్శనల్లో మెరుగైంది ఎంచుకోమంటే ఏది ఎంచుకుంటాం! ఇప్పుడు జట్టు ఓపెనర్ స్థానం కూడా సరిగ్గా అలాగే ఉంది. ధావన్ వరుసగా విఫలమైన చోట గంభీర్‌కు అవకాశం ఇస్తే అతనూ అలాగే ఆడాడు. కాబట్టి వీరిలో ఎవరికి చాన్స్ అనేది తేల్చుకోవాల్సి ఉంది. విఫలమవుతున్నా... యువ ఆటగాడు కాబట్టి ధావన్ వైపే కొంత మొగ్గు ఉంది. ఇదే జరిగితే గంభీర్ కెరీర్ ముగిసినట్లే! అయితే వన్డే ఓపెనర్‌గా రోహిత్‌తో మరో ప్రయోగం చేయడమా...ఒకప్పుడు ఓపెనింగ్ చేసిన రహానేను ముందు పంపడమా...ఇలా వేర్వేరు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మొత్తానికి మ్యాచ్‌లో వ్యూహ ప్రతివ్యూహాలకు ముందే జట్టును ఎంపిక చేసేందుకు ధోని తీవ్ర కసరత్తు చేయాలి.
- సాక్షి క్రీడా విభాగం
ఓవల్‌లో ఒక విజయం...
ఐదో టెస్టు జరిగే లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో భారత రికార్డు చెత్తగా ఏమీ లేదు. ఇక్కడ 11 టెస్టులు ఆడిన ఇండియా ఒక మ్యాచ్‌లో గెలిచి 3 ఓడింది. మరో 7 మ్యాచ్‌లు ‘డ్రా’ చేసుకోగలిగింది. 1971 సిరీస్‌లో భాగంగా అజిత్ వాడేకర్ నాయకత్వంలోని టీమిండియా 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించి మూడు టెస్టుల సిరీస్‌ను 1-0తో సొంతం చేసుకుంది. 2011 పర్యటనలో ధోని సేన ఇదే గ్రౌండ్‌లో ఇన్నింగ్స్ 8 పరుగుల తేడాతో చిత్తయింది.
ఇషాంత్ ఫిట్‌గా ఉన్నాడా?
లార్డ్స్ టెస్టు హీరో ఇషాంత్ శర్మ గత రెండు మ్యాచుల్లోనూ ఆడకపోవడం భారత్‌ను దెబ్బ తీసింది. అతను ఈ మ్యాచ్ బరిలోకి దిగడంపై ఇంకా స్పష్టత రాలేదు. బుధవారం అతను ప్రాక్టీస్‌లో మాత్రం చురుగ్గా కనిపించాడు. ఇషాంత్ జట్టులోకి వస్తే మరో సందేహం లేకుండా నేరుగా పంకజ్‌పై వేటు పడుతుంది. ఒక వేళ ఇషాంత్ లేడంటే సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. ఎందుకంటే పంకజ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో కెప్టెన్ మళ్లీ షమీనే నమ్ముకోవచ్చు. ఈ టూర్‌లో ఇప్పటి వరకు మ్యాచ్ ఆడని ఆటగాడు ఈశ్వర్ పాండే మాత్రమే. పోయేదేముంది... ఒక ప్రయత్నం చేసి చూద్దామనుకుంటే తన చెన్నై సూపర్ కింగ్స్ సహచరుడిని ధోని ఎంపిక చేసే అవకాశం ఉంది.