టీమిండియా ‘సూపర్‌’ విజయం | IND VS NZ 3rd T20: Team India Win In Super Over Thriller | Sakshi
Sakshi News home page

టీమిండియా ‘సూపర్‌’ విజయం

Published Wed, Jan 29 2020 4:34 PM | Last Updated on Wed, Jan 29 2020 5:11 PM

IND VS NZ 3rd T20: Team India Win In Super Over Thriller - Sakshi

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా ‘సూపర్‌’ విజయాన్ని అందుకుంది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి విజయం కోహ్లి సేననే వరించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అనంతరం 180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 179 పరుగల వద్దే నిలిచింది. దీంతో ఇరుజట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్‌ టై అయింది. దీంతో మ్యాచ్‌ విజేత సూపర్‌ ఓవర్‌తో తేలింది.

సూపర్‌ ఓవర్‌లో భాగంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 17 పరుగులు చేసింది. బుమ్రా బౌలింగ్‌ చేయగా, విలియమ్సన్‌, గప్టిల్‌లు బ్యాటింగ్‌ చేశారు. ఇక అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు రోహిత్‌, రాహుల్‌లు జట్టుకు విజయాన్ని అందించారు. టిమ్‌ సౌతీ వేసిన ఈ ఓవర్‌లో రోహిత్‌ రెండు సిక్సర్లు కొట్టగా, రాహుల్‌ ఓ ఫోర్‌ కొట్టి జట్టుకు విజయాన్ని అందించారు. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను 3-0తో టీమిండియా కైవసం చేసుకుంది. సూపర్‌ ఓవర్‌లో టీమిండియాకు సూపర్‌ విజయాన్ని అందించిన రోహిత్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. 

సూపర్‌ ఓవర్‌:
న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ (బుమ్రా బౌలింగ్‌; విలియమ్సన్‌, గప్టిల్‌ బ్యాటింగ్‌)
తొలి బంతి - ఒక్క పరుగు తీసిన విలియమ్సన్‌
2వ బంతి - ఒక్క పరుగు తీసిన గప్టిల్‌
3వ బంతి - సిక్స్‌ కొట్టిన విలియమ్సన్‌
4వ బంతి - ఫోర్‌ కొట్టిన విలియమ్సన్‌
5వ బంతి - సింగిల్‌ తీసిన విలియమ్సన్‌
6వ బంతి - ఫోర్‌ కొట్టిన గప్టిల్‌
ఓవరాల్‌గా సూపర్‌ ఓవర్‌లో 17 పరుగులు



టీమిండియా ఇన్నింగ్స్‌ (టిమ్‌ సౌతీ బౌలింగ్‌; రోహిత్‌, రాహుల్‌ బ్యాటింగ్‌)
తొలి బంతి - రెండు పరుగుల సాధించిన రోహిత్‌ 
2వ బంతి - సింగిల్‌ తీసిన రోహిత్‌
3వ బంతి - ఫోర్‌ కొట్టిన రాహుల్‌
4వ బంతి - సింగిల్‌ తీసిన రాహుల్‌
5వ బంతి -  సిక్స్‌ కొట్టిన రోహిత్‌
6వ బంతి - సిక్స్‌ కొట్టిన రోహిత్‌
ఓవరాల్‌గా సూపర్‌ ఓవర్‌లో 18 పరుగులు

విలియమ్సన్‌ వీరవిహారం
అంతకుముందు టీమిండియా నిర్దేశించిన 180 పరుగలు లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌కు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా గప్టిల్‌ (21 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగిపోయాడు. గప్టిల్‌ నిష్క్రమణ తర్వాత క్రీజులోకి వచ్చిన సారథి విలియమ్సన్‌ అన్నీ తానై పోరాడాడు. ఓ వైపు సహచర ఆటగాళ్ల నుంచి సహకారం అందకున్నా, వరుసగా వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేశాడు. తన శైలికి భిన్నంగా, ఆకాశమే హద్దుగా చెలరేగిని విలియమ్సన్‌ రెండు వందలకు పైగా స్ట్రైక్‌ రేట్‌తో 6 సిక్సర్లు, 8 ఫోర్లతో 95 పరుగులతో వీరవిహారం చేశాడు.

ఓ దశలో విలియమ్సన్‌ దూకుడుతో టీమిండియా ఓడిపోవడం ఖాయమనుకున్నారు. అయితే చివరి ఓవర్లో కివీస్‌ విజయానికి 9 పరుగులు అవసరం. ఈ క్రమంలో బంతి అందుకున్న మహ్మద్‌ షమీ తన అనుభవంతో అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. తొలుత విలియమ్సన్‌ను ఔట్‌ చేసిన షమీ.. ఆ తర్వాత మూడు బంతుల్లో కివీస్‌కు రెండు పరుగులు అవసరమున్న నేపథ్యంలో షమీ మ్యాజిక్‌ చేశాడు. ముఖ్యంగా చివరి బంతికి కివీస్‌ విజయానికి ఒక్క పరుగు కావాల్సిన నేపథ్యంలో రాస్‌ టేలర్‌ను ఔట్‌ చేసి మ్యాచ్‌ ‘టై’ కావడంలో కీలక పాత్ర పోషించాడు. 

రోహిత్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌
టాస్‌ గెలిచిన కివీస్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ టీమిండియాను బ్యాటింగ్‌కు అహ్వానించాడు. దీంతో ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్‌, రాహుల్‌లు చక్కటి శుభారంభాన్ని అందించారు. ముఖ్యంగా కివీస్‌పై పేలవ రికార్డులు కలిగి ఉన్న రోహిత్‌ ఈ మ్యాచ్‌లో రెచ్చిపోయాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ముఖ్యంగా బెన్నెట్‌ వేసిన ఆరో ఓవర్‌లో తాను ఎదుర్కొన్న ఐదు బంతులను మూడు సిక్సర్లు, రెండు ఫోర్లుగా మలిచాడు. ఈ ఓవర్‌లో ఏకంగా 27 పరుగులు లభించడం విశేషం. దీంతో కేవలం 23 బంతుల్లోనే (5 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్‌ సెంచరీ సాధించాడు. మరో వైపు కేఎల్‌ రాహుల్‌ నిదానంగా ఆడుతూ.. వీలుచిక్కినప్పుడలా బౌండరీలు బాదుతూ ఆకట్టుకున్నాడు. అయితే గ్రాండ్‌హోమ్‌ వేసిన 9వ ఓవర్‌ చివరి బంతిని భారీ షాట్‌కు యత్నించి రాహుల్‌(27) వెనుదిరిగాడు. అనంతరం బెన్నెట్‌ బౌలింగ్‌లో రోహిత్‌(40 బంతుల్లో 65; 6ఫోర్లు, 3 సిక్సర్లు), శివమ్‌ దుబె(3)లు వెంటవెంటనే ఔటు కావడంతో 96 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. 

దీంతో టీమిండియాపై ఒక్కసారిగా ఒత్తిడి పెరిగిపోయింది. ఇదే క్రమంలో కివీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తూ పరుగులు రాకుండా అడ్డుకున్నారు. అయితే అయ్యర్‌తో కలిసి కోహ్లి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. పరుగుల వేగం తగ్గడం, కివీస్‌ ఎటాకింగ్‌ బౌలింగ్‌కు అయ్యర్‌, కోహ్లిలు ఇబ్బందులకు గురయ్యారు. అయితే స్కోర్‌ను పెంచే క్రమంలో సాంట్నర్‌ బౌలింగ్‌లో అయ్యర్‌(17) కూడా నిష్క్రమించాడు. దీంతో నాలుగో వికెట్‌కు 46 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. స్కోర్‌ బోర్డు 160 పరుగుల వద్ద ఉన్న సమయంలో టీమిండియాను బెన్నెట్‌ మరోసారి దెబ్బతీశాడు. కోహ్లి(38)ని ఔట్‌ చేసి కివీస్‌ శిబిరంలో ఆనందం నింపాడు. ఇక చివర్లో మనీశ్‌ పాండే (16 నాటౌట్‌), జడేజా(10 నాటౌట్‌)లు దూకుడుగా ఆడటంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. దీంతో అనుకున్నంత కాకపోయినా ఓ మోస్తారు స్కోర్‌నైనా సాధించింది టీమిండియా. 

చదవండి:
సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా

‘ధోని సీటును అలానే ఉంచాం’

ధోనిని దాటేసిన ‘కెప్టెన్‌’.. కోహ్లి సరసన రోహిత్‌

థాంక్యూ తాప్సీ: మిథాలీ రాజ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement