
గుహవాటి: టీమిండియా-శ్రీలంక జట్ల మధ్య ఇక్కడ జరగాల్సిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. పిచ్‌తో పాటు అవుట్ ఫీల్డ్ తడిగా ఉండటంతోమ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్ పడిన తర్వాత భారీ వర్షం పడటంతో అంతరాయం ఏర్పడింది. కాగా, వర్షం వెలిసిన తర్వాత మ్యాచ్‌ను జరపడానికి ప‍్రయత్నాలు చేసినా ఫలించలేదు. మధ్యలో మరొకసారి వర్షం పడగా పిచ్, అవుట్ ఫీల్డ్‌లు చిత్తడిగా మారిపోయాయి.
దాంతో పిచ్‌ను ఆరబెట్టడానికి గ్రౌండ్‌మెన్ కష్టపడ్డప్పటికీ చివరకు పిచ్‌ను సిద్ధం చేయడంలో విఫలమయ్యారు. కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ జరిపించాలని చూసినా అది కూడా సాధ్యం కాలేదు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే మ్యాచ్ వర్షం పడితే పిచ్‌ను త్వరితగతిన సిద్ధం చేసే సాధ్యమైనన్ని వనరులు అసోం క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) వద్ద లేవనే విషయం మరోసారి బయటపడింది. దాంతో రాత్రి గం.10.00ల సమయంలో మ్యాచ్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆపై కాసేపటికి భారీ వర్షం పడి మ్యాచ్‌కు ఆటంకం కల్గించింది. రెండో టీ20 ఇండోర్ వేదికగా మంగళవారం జరుగనుంది.