సాక్షి, విశాఖపట్నం : భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగనుండడంతో క్రికెట్ అభిమానులతో విశాఖపట్నం హోరెత్తనుంది. ఆదివారం (ఫిబ్రవరి 24) సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 వరకు వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే 23 వేల టికెట్లు అమ్ముడు పోయినట్లు నిర్వాహకులు తెలిపారు. మ్యాచ్‌కు అదనపు భద్రతను కల్పించామని, 1400 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా తెలిపారు. బయటి నుంచి ఎలాంటి వస్తువులను స్టేడియంలోకి అనుమంతించేది లేదని స్పష్టం చేశారు.
మ్యాచ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయని స్టేడియం నిర్వాహక కమిటీ ప్రతినిధి, పోర్టు చైర్మన్ కృష్ణబాబు తెలిపారు. రేపు (శనివారం) ఇరు జట్ల మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ జరుగనుంది. కాగా, రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 బెంగుళూరులో.. రెండో టీ20 విశాఖలో జరగాల్సి ఉండగా.. కర్ణాటక క్రికెట్ అసోషియేషన్ అభ్యర్థన మేరకు వేదికల తేదీలు మారాయి. ఆదివారం రోజున బెంగుళూరులో ఏరో ఇండియా షో జరగనుండడంతో ఈ మార్పు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బెంగుళూరుకు రానుండడంతో శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. దాంతో 27,500 సీట్ల సామర్థ్యం గల విశాఖ స్టేడియం తొలి టీ20కి వేదికైంది. 27వ తేదీన బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో రెండో టీ20 జరుగనుంది. (బెంగళూరులోనే ఏరో షో)
Comments
Please login to add a commentAdd a comment