
ధోని సేనదే సిరీస్
మెల్బోర్న్: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో ట్వంటీ20లోనూ సమష్టిగా పోరాడిన టీమిండియా సిరీస్ ను చేజిక్కించుకుంది. తొలుత బ్యాటింగ్ లో ఆకట్టుకున్న టీమిండియా..ఆపై బౌలింగ్, ఫీల్డింగ్ లో కూడా రాణించి 27 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. టీమిండియా నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్ చేపట్టిన ఆసీస్ 157 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. దీంతో టీమిండియా 2-0 తేడాతో సిరీస్ ను సాధించింది. ఆసీస్ ఆటగాళ్లలో కెప్టెన్ ఆరోన్ ఫించ్(74;48 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు. షాన్ మార్ష్(23),లాయన్(2), మ్యాక్స్ వెల్(1) , షేన్ వాట్సన్(15), ఫాల్కనర్(10)లు నిరాశపరిచారు. తొలి వికెట్ కు 94 పరుగులు జోడించిన ఆసీస్.. ఆ తరువాత వరుసగా వికెట్లను చేజార్చుకుని ఓటమి పాలైంది. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా , బూమ్రాలకు చెరో రెండు వికెట్లు దక్కగా, అశ్విన్, పాండ్యా, యువరాజ్ సింగ్ లకు తలో వికెట్ దక్కింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ తమదైన శైలిలో ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకుపడి భారీ ఇన్నింగ్స్ ఏర్పడటానికి సహకరించారు. రోహిత్(60;47 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ధావన్(42;32 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) దాటిగా ఆడారు. ఈ జోడీ 97 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. కాగా, శిఖర్ హాఫ్ సెంచరీకి కొద్ది దూరంలో మ్యాక్స్ వెల్ బౌలింగ్ షాట్ కు యత్నించి తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు.
అనంతరం ఫస్ట్ డౌన్ లో వచ్చిన విరాట్ కోహ్లి ఆదిలో ఆచితూచి ఆడినా తరువాత రెచ్చిపోయాడు. ప్రత్యేకంగా 14 ఓవర్ లో హేస్టింగ్ బౌలింగ్ లో మూడు ఫోర్లు కొట్టిన కోహ్లి.. తరువాత బోలాండ్ వేసిన ఓవర్ లో సిక్స్ కొట్టి తన మార్కును ఆటను చూపెట్టాడు. అయితే జట్టు స్కోరు 143 పరుగుల వద్ద అనవసర పరుగు కోసం యత్నించిన రోహిత్ శర్మ రనౌట్ గా అవుటయ్యాడు. అనంతరం ధోనితో కలిసిన విరాట్(59 నాటౌట్;33 బంతుల్లో 7ఫోర్లు, 1 సిక్స్) అదే ఊపును కొనసాగించి హాఫ్ సెంచరీ చేశాడు. ఇదిలా ఉండగా, చివరి ఓవర్ లో ధోని(14) అవుట్ కావడంతో సహా 10 పరుగులు మాత్రమే రావడంతో టీమిండియా20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.
మ్యాచ్ విశేషాలు
ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై 68 బంతుల్లో 100 పరుగులు నమోదు చేసిన రెండో జట్టుగా టీమిండియా గుర్తింపు సాధించింది. 2013లో బ్రిస్బేన్ లో వెస్టిండీస్ 67 బంతుల్లో 100 పరుగులు సాధించింది.
ట్వంటీ 20లో మెల్బోర్న్ గ్రౌండ్ లో భారత్ నమోదు చేసిన 184 పరుగులే అత్యధిక స్కోరు. అంతకుముందు 2008-09లో దక్షిణాఫ్రికా 182 పరుగులు చేసింది.