వారిది ‘హోం వర్క్’... మనది ‘నో వర్క్’
సాక్షి క్రీడావిభాగం : ప్రత్యర్థిని చితక్కొట్టడమే తెలిసిన జట్టుకు ప్రత్యర్థి చేతిలో చిత్తవడం కొత్తగా అనిపిస్తోంది. వందల పరుగుల ఆధిక్యం అందుకోవడం, ఆ తర్వాత స్పిన్‌తో బ్యాట్స్‌మెన్‌ను పట్టేయడం అలవాటుగా మార్చుకున్న టీమ్ అదే వలలో పడి విలవిల్లాడటం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. గింగిరాలు తిరిగే బంతిని ఎదుర్కొనేందుకు ఇక్కడికి వచ్చే ప్రతీ విదేశీ ఆటగాడు తనదైన స్థాయిలో ఎంతో కొంత సన్నద్ధమయ్యే వస్తాడు. అది ఫలితాన్నిస్తుందా లేదా తర్వాత సంగతి. కానీ స్పిన్ కోసమే తయారయ్యాను అన్నట్లుగా పుణే పిచ్ ఎదురుగా కనిపిస్తుంటే భారత బ్యాట్స్‌మెన్ ఏ రకంగా సిద్ధమయ్యారు? దిగ్గజ స్పిన్ బౌలర్ కోచ్‌గా ఉన్న జట్టు స్పిన్‌ను అసలు ఆడలేకపోవడం ఏమిటి?
మన బ్యాటింగ్ ఇంతేనా...?
‘భారత్‌లో నేను ఎన్నో టర్నింగ్ ట్రాక్‌లను చూశాను. కానీ ఇలాంటి పిచ్‌ను అసలు ఎప్పుడూ చూడలేదు’... ఈ పిచ్ వల్ల రాబోతున్న ప్రమాదాన్ని రవిశాస్త్రి ముందే ఊహించినట్లున్నాడు. తొలి రెండు రోజులు బ్యాటింగ్ చేయగలిగి ఉండి ఆ తర్వాత మూడో రోజు నుంచి పిచ్‌పై స్పిన్ ప్రభావం చూపించడం, మన బౌలర్లు చెలరేగిపోవడం భారత్‌లో సాధారణం. ఈ సీజన్‌లోనైతే అశ్విన్, జడేజాలు ఇలాంటి పిచ్‌లపై వికెట్ల మూటలు కట్టుకున్నారు. న్యూజిలాండ్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్లు ఇదే ఫార్ములా ముందు చేతులెత్తేశాయి.
కొన్నాళ్ల క్రితం నాగపూర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు తరహా నాసిరకం పిచ్‌లు కాకుండా కాస్త జీవం ఉన్న వికెట్‌లు ఉండటంతో ఈ సీజన్‌లో భారత్‌పై ఎలాంటి విమర్శలు కూడా రాలేదు. అయినా సరే మరోసారి స్పిన్ పిచ్ మంత్రాన్నే జట్టు ఎంచుకుంది. క్యురేటర్‌కు బీసీసీఐ ఏదైనా సూచనలిచ్చిందా లేదా తెలీదు కానీ స్పిన్‌తోనే ఆస్ట్రేలియా పని పట్టేయవచ్చని భారత్ ఆత్మ (అతి)విశ్వాసంతో కనిపించింది. కానీ ఇదే పిచ్‌పై మన బ్యాటింగ్ గురించి మాత్రం పెద్దగా ఆలోచించినట్లు లేదు.
ఇలాంటి పిచ్‌పై బ్యాటింగ్ చేయాలంటే కచ్చితంగా బ్యాట్స్‌మెన్‌లో అత్యుత్తమ నైపుణ్యం ఉండాలి. రెండు ఇన్నింగ్స్‌లలోనూ మనోళ్లు అవుటైన తీరు, వారి బలహీనతను బయట పెట్టింది. టర్న్ అవుతున్న బంతిని ఎదుర్కోలేక క్లోజ్ ఇన్ ఫీల్డర్లకే అంతా క్యాచ్‌లు ఇచ్చారు. రెండో ఇన్నింగ్స్‌లోనైతే ఐదు ఎల్బీడబ్ల్యూలు ఉన్నాయి. ఈ సీజన్‌లో చెప్పుకోదగ్గ స్పిన్నర్‌ను స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌ను భారత బ్యాట్స్‌మెన్ ఒక్కసారి ఎదుర్కోకపోవడం వల్ల కూడా ఈ హఠాత్ పరిణామానికి నిస్సహాయులై చూస్తుండిపోయారు.
సాన్‌ట్నర్, సోధి, మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ ఎవరిలో కూడా బంతిని పెద్దగా టర్న్ చేయగలిగే సామర్థ్యం లేదు. ఓకీఫ్ కూడా గొప్ప స్పిన్నరేమీ కాదు కానీ పిచ్ అతనికి బాగా కలిసొచ్చింది. వరుస విజయాలతో ఊపు మీద ఉండటంతో తమలో ఇంకా బయటపడని లోపాల గురించి టీమిండియా పట్టించుకోలేదు. మొదటి ఇన్నింగ్స్ వైఫల్యాన్ని రెండో ఇన్నింగ్స్‌లో కప్పిపుచ్చగలరని భావించినా, అదీ సాధ్యం కాలేదు. రెండో ఇన్నింగ్స్‌లో స్మిత్ బ్యాటింగ్ చూస్తే పిచ్‌లో మాత్రమే సమస్య లేదని, మన ఆటగాళ్లకే చేత కాలేదని స్పష్టంగా అర్థమవుతుంది.
సన్నాహకాలతో సిద్ధంగా...
నాలుగేళ్ల క్రితం 0–4తో అవమానకర రీతిలో ఓడిన సమయంలో పరాభవంతో పాటు ‘హోం వర్క్’ వివాదాన్ని కూడా వెంట తీసుకొచ్చిన ఆస్ట్రేలియా ఈసారి అసలైన ‘హోం వర్క్’తో సన్నద్ధమైంది. ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఎలాగూ స్పిన్ వికెట్ ఇవ్వరని తెలుసు కాబట్టి దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీలో తన సన్నాహాలు చేసింది. భారత్‌లో వికెట్లను రూపొందించేందుకు వాడే మట్టితో ప్రత్యేకంగా తయారు చేయించిన పిచ్‌లపై ఆ జట్టు కఠోర సాధన చేసింది. సాధారణంగా స్పిన్‌లో షార్ట్‌లెగ్, సిల్లీ పాయింట్‌లాంటి స్థానాల్లో క్యాచ్ ఇచ్చే అవకాశం ఎక్కు వగా ఉంటుంది కాబట్టి బంతి ఏ రకంగా వచ్చినా ఆ స్థానాల్లోకి ఆడకుండా బ్యాట్స్‌మెన్ ప్రాక్టీస్ చేశారు.
ఈ టెస్టులో ఆస్ట్రేలియా కోల్పోయిన 20 వికెట్లలో ఎవరూ క్లోజ్ ఇన్ ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ కాకపోవడం విశేషం. ఆ జట్టుకు స్పిన్ కన్సల్టెంట్‌గా వ్యవహరించిన భారత మాజీ ఆటగాడు శ్రీధరన్ శ్రీరామ్ జట్టుతో ఈ వికెట్లపై ప్రాక్టీస్ చేయించాడు. ఓకీఫ్ బౌలింగ్ మెరుగు పడటంతో అతనిదే కీలక పాత్ర. 2012లో ఇంగ్లండ్ తరఫున భారత్‌ను దెబ్బ తీసిన మాంటీ పనెసర్ కూడా ఆసీస్‌ను సిద్ధం చేయించడంలో ఆ జట్టుకు సహకరించాడు. భీకరమైన పుణే పిచ్‌పైనే ఆసీస్ చేసిన స్కోర్లు... స్మిత్, రెన్‌షా ఆట చూస్తే సాధారణ స్పిన్ పిచ్‌పై వారు అలవోకగా ఆడగలిగేవారేమో అనిపిస్తుంది.
బెంగళూరులో ఎలా...
ఇప్పుడు చిన్నస్వామి స్టేడియం పిచ్ రూపంలోనే భారత్ ముందు పెద్ద సవాల్ నిలిచింది. పూర్తిగా స్పిన్ పిచ్ ఉంటే ఫలితం ఎలా ఉంటుందో పుణే చూపించింది. అలా అని బ్యాటింగ్ వికెట్ చేస్తే ఆసీస్‌లో కూడా మెరుగైన బ్యాట్స్‌మెన్ ఉన్నారు. పేస్ లేదా స్వింగ్‌కు అనుకూలించే విధంగా ఉంటే మన ఉమేశ్, ఇషాంత్ కంటే కచ్చితంగా స్టార్క్, హాజల్‌వుడ్ ఎక్కువ ప్రమాదకారిగా మారగలరు. సొంతగడ్డపై తొలి టెస్టు ఓడి భారత్ సిరీస్‌లో వెనుకబడిన సందర్భాలు చాలా తక్కువ. ఇలాంటి స్థితి నుంచి కోలుకొని మనోళ్లు ఎలా రాణిస్తారనేది చూడాలి.
5 సొంతగడ్డపై ఐదేళ్ల తర్వాత టెస్టుల్లో భారత్‌కు ఓటమి ఎదురైంది. చివరిసారి భారత్ 2012లో కోల్‌కతాలో ఇంగ్లండ్ చేతిలో ఓడింది. ఆ తర్వాత భారత్‌కు వరుసగా 20 టెస్టుల్లో పరాజయమే లేదు. ఇందులో 17 టెస్టుల్లో గెలుపొందగా... మూడు టెస్టులు ‘డ్రా’ అయ్యాయి.
7 పుణేలో విజయానికి ముందు భారత గడ్డపై ఆస్ట్రేలియా వరుసగా ఏడు టెస్టుల్లో ఓడిపోయింది.
2 పరుగుల పరంగా (333) స్వదేశంలో భారత్‌కిది రెండో పెద్ద ఓటమి. 2004లో నాగ్‌పూర్‌లో ఆసీస్ చేతిలోనే భారత్ 342 పరుగులతో ఓడటం అతి పెద్ద ఓటమిగా ఉంది.
212 సొంతగడ్డపై రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 20 వికెట్లు కోల్పోయి భారత్ చేసిన అత్యల్ప స్కోరు ఇదే.
74 స్వదేశంలో భారత్ 20 వికెట్లు కోల్పో యిన మ్యాచ్‌లో ఆడిన అతి తక్కువ ఓవర్లు.
1 కెప్టెన్‌గా భారత్‌లో కోహ్లికిది తొలి ఓటమి.
2 ఇయాన్ బోథమ్ (ఇంగ్లండ్; 13/106... 1979–80 సీజన్) తర్వాత పర్యాటక జట్టు బౌలర్లలో రెండో ఉత్తమ ప్రదర్శన (12/70) చేసిన బౌలర్ ఓకీఫ్.
24 ఆసీస్ తరఫున ఇద్దరు స్పిన్నర్లు ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేయడం 24 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. చివరిసారి 1993లో ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో షేన్ వార్న్, టిమ్ మే ఐదేసి వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేశారు.
13 స్వదేశంలో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి తక్కువ పరుగులు చేయడం కోహ్లికిదే తొలిసారి. ఇంతకుమందు కోహ్లి 2012లో ఇంగ్లండ్ చేతిలో కోల్‌కతాలో ఓడిన టెస్టులో 26 పరుగులు చేశాడు.