
న్యూఢిల్లీ: అమెరికా, కొలంబియా జట్లపై భారత కుర్రాళ్ల ఆటతీరును చూసి మాజీ చాంపియన్ ఘనాపై ఏమైనా సంచలనం సాధిస్తారా... అని ఆశపడిన అభిమానులకు నిరాశే మిగిలింది. అన్ని విభాగాల్లో అత్యంత పటిష్టంగా కనిపించిన ఆఫ్రికన్ల ముందు భారత్ ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. ఫిఫా అండర్–17 ప్రపంచకప్ నుంచి లీగ్ దశలోనే నిష్క్రమించింది. గురువారం గ్రూప్ ‘ఎ’లో భాగంగా జరిగిన ఈ చివరి మ్యాచ్‌లో భారత్ 0–4తో ఘనా చేతిలో దారుణంగా ఓడింది. ఘనా తరఫున కెప్టెన్ ఎరిక్ అయిహా (43, 52వ నిమిషాల్లో) రెండు గోల్స్ చేయగా రిచర్డ్ డాన్సో (86వ ని.లో), ఇమాన్యుయల్ టోకు (87వ ని.లో) మిగతా గోల్స్ చేశారు. మ్యాచ్ తొలి అర్ధ భాగంలో మెరుగ్గా ఆడిన భారత్ రెండో అర్ధభాగంలో చేతులెత్తేసింది, మూడు పరాజయాలతో నాలుగో స్థానంలో నిలిచిన ఆతిథ్య జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.
గ్రూప్ ‘ఎ’లోని మరో మ్యాచ్‌లో కొలంబియా 3–1తో అమెరికాను ఓడించింది. దాంతో రెండేసి విజయాలతో ఘనా, కొలంబియా, అమెరికా ఆరు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన గోల్స్ సగటు ఆధారంగా ఘనా, కొలంబియా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాయి. అమెరికా జట్టుకు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలు సజీవంగా ఉన్నాయి. గురువారమే జరిగిన గ్రూప్ ‘బి’మ్యాచ్‌ల్లో మాలి 3–1తో న్యూజిలాండ్‌ను చిత్తు చేయగా... పరాగ్వే 3–1తో టర్కీని ఓడించి ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించింది. శుక్రవారం జరిగే మ్యాచ్‌ల్లో కొస్టారికాతో ఇరాన్; గినియాతో జర్మనీ; నైజెర్‌తో బ్రెజిల్, స్పెయిన్‌తో ఉత్తర కొరియా తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment