
చెలరేగిన విరాట్, రోహిత్; భారత్ ఘనవిజయం
వెస్టిండీస్తో రెండు టెస్టుల సిరీస్ను కైవసం చేసుకున్న భారత్.. మూడు వన్డేల సిరీస్లోనూ శుభారంభం చేసింది.
వెస్టిండీస్తో రెండు టెస్టుల సిరీస్ను కైవసం చేసుకున్న భారత్.. మూడు వన్డేల సిరీస్లోనూ శుభారంభం చేసింది. గురువారమిక్కడ జరిగిన తొలి డే/నైట్ మ్యాచ్లో భారత బౌలర్ల విజృంభణకు బ్యాట్స్మెన్ కృషి తోడవడంతో ధోనీసేన ఆరు వికెట్లతో ఘనవిజయం సాధించింది. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 35.2 ఓవర్లలోనే విజయాన్నందుకుంది. యువ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ (86), రోహిత్ శర్మ (72) హాఫ్ సెంచరీలతో రాణించారు. ధవన్ (5) నిరాశపరిచినా కోహ్లీ, రోహిత్ రెండో వికెట్కు 133 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి విజయానికి బాటలు వేశారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన కరీబియన్లు 48.5 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌటయ్యారు. భారత బౌలర్లలో రైనా, జడేజా చెరో మూడు, అశ్విన్ రెండు, షమీ వికెట్ తీశారు. విండీస్ జట్టులో డారెన్ బ్రావో (59) టాప్ స్కోరర్. బ్రావో, చార్లెస్ (42) మినహా ఇతర బ్యాట్స్మెన్ తక్కువ పరుగులకే వెనుదిరిగారు. విండీస్ విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ రెండో బంతికే సున్నా చుట్టేశాడు. గేల్ను భువనేశ్వర్ రనౌట్ చేశాడు. ఆ తర్వాత బ్రావో, చార్లెస్ కాసేపు వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసినా ఇతర బ్యాట్స్ మెన్ క్రీజులో నిలవలేకపోయారు. జడేజా, రైనా పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు టాపార్డర్ పనిపట్టారు. దీంతో విండీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.