
దుబాయ్: వెస్టిండీస్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టి20 ప్రపంచకప్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నవంబర్ 9 నుంచి 24 వరకు జరిగే ఈ మెగా ఈవెంట్‌లో భారత జట్టు తమ తొలి పోరులో న్యూజిలాండ్‌తో తలపడనుంది. టోర్నీ ఆరంభరోజే ఈ మ్యాచ్ జరుగుతుంది. అదే రోజు ఆతిథ్య విండీస్... క్వాలిఫయర్–1తో, పాకిస్తాన్‌తో ఆస్ట్రేలియా తలపడనున్నాయి.
గ్రూప్ ‘బి’లో ఉన్న భారత్... 11న పాక్‌తో, 15న క్వాలిఫయర్–2తో, 17న ఆస్ట్రేలియాతో ఆడనుంది. గ్రూప్ ‘ఎ’లో వెస్టిండీస్‌తో పాటు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, క్వాలిఫయర్–1 జట్లు ఉన్నాయి. పది జట్లు తలపడే ఈ టోర్నీలో 8 శాశ్వత సభ్యదేశాలతో పాటు వచ్చే నెలలో జరిగే క్వాలిఫయింగ్ టోర్నీ ద్వారా మరో రెండు జట్లకు అవకాశమిచ్చారు. తొలిసారిగా టి20 ప్రపంచకప్‌లో అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్‌ఎస్)ని వినియోగించనున్నారు.