
‘డ్రా’గా ముగిసిన రెండో టెస్టు
అద్భుతం, అనూహ్యమేమీ జరగలేదు. చివరి రోజు భారత్ ముందు ఊరించే లక్ష్యాన్ని ఉంచే సాహసానికి కివీస్ ప్రయత్నించలేదు. మ్యాచ్‌లో గెలుపుకన్నా సిరీస్ విజయం ముఖ్యమనుకుంది. అందుకే తాపీగా 21 ఓవర్ల పాటు ఆడి డిక్లేర్ చేసింది.
67 ఓవర్లలో 435 పరుగులు...అసాధ్యమైన విజయ లక్ష్యం. భారత్ ముందు మిగిలిన అవకాశం డ్రానే. అయితే స్కోరు 54/3...కుప్పకూలుతుందేమోననే ఆందోళన. కానీ కోహ్లి మరో సారి తన క్లాస్ రుచి చూపించాడు. ఎదురుదాడితో మ్యాచ్‌ను రక్షించాడు.
విదేశీ గడ్డపై భారత్‌కు మరోసారి రిక్తహస్తం ఎదురైంది. వన్డే, టెస్టు సిరీస్‌లలో విజయం మాట కూడా లేకుండా జట్టు వెనుదిరిగింది. గత మూడేళ్ల కాలంలో విదేశీ గడ్డపై ఆడిన 14 టెస్టుల్లో ఒక్క గెలుపు కూడా లేని రికార్డును టీమిండియా మూటగట్టుకుంది.
భారత్ విదేశాల్లో వరుసగా 4 టెస్టు సిరీస్‌లు ఓడింది.
భారత్‌కు వరుసగా 14 విదేశీ టెస్టుల్లో ఒక్క విజయం కూడా దక్కలేదు. అయితే 1986-1993 మధ్య కాలంలో భారత్ వరుసగా 26 టెస్టుల్లో ఒక్కటీ నెగ్గలేదు.
2002-03 తర్వాత భారత్‌పై న్యూజిలాండ్ సిరీస్ నెగ్గడం ఇదే తొలిసారి.
న్యూజిలాండ్ టెస్టు చరిత్రలో ఇదే (680/8 డిక్లేర్డ్) అత్యధిక స్కోరు
కోహ్లి కెరీర్‌లో ఇది ఆరో సెంచరీ. రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి సెంచరీ చేయడం ఇదే తొలిసారి.
జహీర్ రెండో ఇన్నింగ్స్‌లో 51 ఓవర్లు వేశాడు. 1991-92 (కపిల్‌దేవ్) తర్వాత ఒక భారత బౌలర్ ఇన్ని ఓవర్లు బౌలింగ్ చేయడం ఇదే తొలిసారి.
రెండో ఇన్నింగ్స్‌లో ట్రిపుల్ చేసిన రెండో ఆటగాడు మెకల్లమ్ (హనీఫ్ తర్వాత)
ఒకే ఒక్కడు...
ఓవర్‌నైట్ స్కోరు 571/6తో న్యూజిలాండ్ ఐదో రోజు ఆటను ప్రారంభించింది. నీషామ్ ఫోర్లతో దూకుడు ప్రదర్శించగా, మెకల్లమ్ జాగ్రత్తగా ఆడాడు. ట్రిపుల్‌ను చేరుకునే క్రమంలో మెకల్లమ్ కొన్ని ఉత్కంఠ భరిత క్షణాలు ఎదుర్కొన్నాడు. 293 వద్ద ఇషాంత్ బౌలింగ్‌లో ఎడ్జ్ తీసుకున్న బంతి ధోనికి కాస్త ముందు పడింది. మరో వైపు 123 బంతుల్లో నీషామ్ కెరీర్‌లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
జహీర్ వేసిన తర్వాతి ఓవర్ తొలి బంతిని థర్డ్‌మన్ వైపు ఫోర్ కొట్టి మెకల్లమ్ ట్రిపుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఆ సమయంలో ప్రేక్షకుల అభినందనలతో మైదానం హోరెత్తింది. మెకల్లమ్ తండ్రి స్టు మెకల్లమ్ కూడా అప్పుడు అక్కడే ఉన్నారు. మరో రెండు బంతులకే కీపర్ ధోనికి క్యాచ్ ఇవ్వడంతో బ్రెండన్ ఇన్నింగ్స్ ముగిసింది. తన తర్వాతి ఓవర్లో సౌతీ (11)ని కూడా జహీర్ అవుట్ చేశాడు. కొద్ది సేపటి తర్వాత న్యూజిలాండ్ తమ టెస్టు చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన తర్వాత ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోల్పోయిన భారత్ టెస్టు సిరీస్‌ను కూడా చేజార్చుకుంది. ఇరు జట్ల మధ్య ఇక్కడ జరిగిన రెండో టెస్టు మ్యాచ్ మంగళవారం ఫలితం తేలకుండా ‘డ్రా’గా ముగిసింది. ఫలితంగా తొలి టెస్టు నెగ్గిన కివీస్ 1-0తో సిరీస్ సొంతం చేసుకుంది. 435 పరుగుల అసాధ్యమైన విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ మ్యాచ్ ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (135 బంతుల్లో 105 నాటౌట్; 15 ఫోర్లు, 1 సిక్స్) కెరీర్‌లో ఆరో సెంచరీ సాధించగా... రోహిత్ శర్మ (97 బంతుల్లో 31 నాటౌట్; 4 ఫోర్లు) రాణించాడు.
అంతకు ముందు న్యూజిలాండ్ తమ రెండో ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 680 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. బ్రెండన్ మెకల్లమ్ (559 బంతుల్లో 302; 32 ఫోర్లు, 4 సిక్స్‌లు) న్యూజిలాండ్ తరఫున ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించగా... ఆడిన తొలి టెస్టులోనే జిమ్మీ నీషామ్ (154 బంతుల్లో 137 నాటౌట్; 20 ఫోర్లు) శతకం అందుకున్నాడు. జహీర్‌ఖాన్‌కు 5 వికెట్లు దక్కాయి. కివీస్ పర్యటనలో ఐదు వన్డేల సిరీస్‌ను 0-4తో కోల్పోయిన భారత్... ఈ పర్యటనలో ఒక్క గెలుపు కూడా లేకుండానే తిరుగు ముఖం పట్టింది.
కోహ్లి జోరు...
అసాధ్యమైన విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు కివీస్ బౌలర్లు షాకిచ్చారు. మూడు బంతుల వ్యవధిలో ఓపెనర్లు ధావన్ (2), విజయ్ (7) వెనుదిరగ్గా...కొద్ది సేపటికే పుజారా (17) కూడా పెవిలియన్ చేరాడు. అయితే ఈ దశలో కోహ్లి తన సత్తాను ప్రదర్శించాడు. 15 పరుగుల వద్ద బౌల్ట్ బౌలింగ్‌లో అతను ఇచ్చిన క్యాచ్‌ను కీపర్ అందున్నా అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో కోహ్లి బతికిపోయాడు. స్నికోలో బంతి బ్యాట్‌ను తాకిందని తేలింది. అయితే ఆ తర్వాత విరాట్ దూసుకుపోయాడు.
ఈ క్రమంలో 73 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో వైపు రోహిత్ శర్మ మెల్లగా ఆడినా కోహ్లికి అండగా నిలిచాడు. 9 పరుగుల వద్ద సౌతీ రిటర్న్ క్యాచ్ అందుకోకపోవడంతో రోహిత్ కూడా కుదురుకున్నాడు. వికెట్ పూర్తిగా బ్యాటింగ్ అనుకూలంగా ఉండటంతో పాటు, కివీస్ బౌలర్లు గతి తప్పడంతో కోహ్లి స్వేచ్ఛగా షాట్లు ఆడాడు. వాగ్నేర్ బౌలింగ్‌లో రెండు చక్కటి స్ట్రెయిట్ డ్రైవ్‌లతో కోహ్లి శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో 15 ఓవర్ల ముందే మ్యాచ్‌ను నిలిపేసేందుకు ఇరు జట్లు అంగీకరించాయి.
రెండో ర్యాంకులోనే భారత్
దుబాయ్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 0-1తో కోల్పోయినప్పటికీ ఐసీసీ టెస్టు జట్ల ర్యాంకింగ్స్‌లో భారత జట్టు తమ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. అయితే ఇప్పటిదాకా 117 రేటింగ్ పాయింట్లతో ఉన్న జట్టు ప్రస్తుతం 112 పాయింట్లకు దిగజారింది. ఇది ఆస్ట్రేలియాకన్నా కేవలం ఒక పాయింట్ మాత్రమే ఎక్కువ. దీంతో తుది ర్యాంకింగ్స్ ప్రకటన గడువైన ఏప్రిల్ 1 లోపు ఆసీస్ జట్టు భారత్‌ను వెనక్కినెట్టే అవకాశాలున్నాయి. మరోవైపు కివీస్ ఐదు పాయింట్లు ఎగబాకి ఏడో ర్యాంకులో ఉంది.
మేం బాగానే ఆడాం
ప్రదర్శనను సమర్ధించుకున్న ధోని
వెల్లింగ్టన్: వరుస అపజయాలతో కుదేలైన భారత జట్టుకు రెండో టెస్టులో విజయం సాధించే అవకాశం వచ్చినా బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యంతో చేజార్చుకుంది. అయినప్పటికీ తమ ఆటగాళ్ల ప్రదర్శన భేషుగ్గా ఉందనే అభిప్రాయాన్ని భారత జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోని వ్యక్తం చేస్తున్నాడు. కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో 680 పరుగులు సమర్పించుకున్నప్పటికీ తమ బౌలర్లు సరైన రీతిలోనే బౌలింగ్ చేశారని చెప్పుకొచ్చాడు. కివీస్ పర్యటనలో భారత్ ఆడిన ఐదు వన్డేల సిరీస్, రెండు టెస్టుల సిరీస్‌లో ఒక్క విజయం కూడా దక్కలేదు. వన్డే సిరీస్‌లో తమ ఆటతీరు నిరాశపరిచినా టెస్టుల్లో మాత్రం అద్భుతంగా ఆడామని ధోని అన్నాడు.
‘ఓవరాల్‌గా మా ప్రదర్శన చాలా బాగుంది. వన్డే సిరీస్‌లో మాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోనందుకు నిరాశ చెందాను. అయితే టెస్టు సిరీస్‌లో మాత్రం మేం బాగానే ఆడాం. దక్షిణాఫ్రికా సిరీస్ నుంచే మేం మెరుగవుతున్నాం. నాణ్యమైన జట్టుగా ఇప్పటికే నిరూపించుకున్నాం. రెండో టెస్టులో బౌలింగ్ కూడా సరైన రీతిలోనే సాగింది. ఫ్లాట్ వికెట్‌లపై ఇలాంటి బౌలింగ్ చాలా ముఖ్యం.
తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ మా ప్రదర్శన అద్భుతం. చివరి టెస్టులోనైతే తొలి ఇన్నింగ్స్‌లో బౌలర్లు రెచ్చిపోయి ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేశారు’ అని ధోని చెప్పుకొచ్చాడు. కివీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 192 పరుగులకే కుప్పకూలినప్పటికీ రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం మెకల్లమ్ అసామాన్య ఆటతీరుతో భారత్ ముందు 435 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో మెకల్లమ్ వచ్చేదాకా కూడా తమ బౌలర్లు ఆధిపత్యాన్ని చూపారని గుర్తుచేశాడు. తమది చెత్త బౌలింగ్ అనడానికి లేదని స్పష్టం చేశాడు. ‘రెండున్నర రోజుల పాటు మేం ఫీల్డింగ్ చేశాం.
ఈ సవాల్‌ను స్వీకరించిన విధానానికి మా బౌలర్లను అభినందిస్తున్నాను. రెండు, మూడో కొత్త బంతిని తీసుకున్నప్పటికీ వారు వికెట్ల కోసం తీవ్రంగా శ్రమించారు. మెకల్లమ్, వాట్లింగ్ మాకెలాంటి అవకాశాన్ని ఇవ్వలేదు. అలా బ్యాటింగ్ చేస్తూనే ఉండిపోయారు. 500కు పైగా బంతులను ఎదుర్కోవడమంటే మాటలు కాదు. పరుగులెన్ని వచ్చాయనే విషయం పక్కనబెడితే మేం చూసిన గొప్ప ఇన్నింగ్స్‌లో ఇదీ ఒకటి’ అని ధోని ప్రశంసించాడు. ఆసియాకప్, టి20 ప్రపంచకప్ అనంతరం జరిగే ఐపీఎల్ టోర్నీ తమకు పెద్ద రిలీఫ్ అని ధోని అన్నాడు.
జీవితాంతం గుర్తుంచుకుంటా
‘వంద పరుగుల్లోపే సగం వికెట్లు నేలకూలిన దశలో నా ఇన్నింగ్స్ ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఓడిపోకుండా సిరీస్ నెగ్గాలని భావించాం. చివరి రోజు స్టేడియంలోకి వచ్చిన అభిమానులను చూసి నేను ఒత్తిడిగా భావించలేదు. వారికి కావాల్సిన ఆనందాన్ని ఇవ్వగలిగాను. ట్రిపుల్ సాధించగానే కొద్దిసేపటి వరకు చప్పట్లు మార్మోగాయి. న్యూజిలాండ్ ఆటగాడిగా ఇది గొప్ప ఘనత. దీన్ని కచ్చితంగా జీవితాంతం గుర్తంచుకుంటాను. మార్టిన్ క్రో 299 పరుగుల ఇన్నింగ్స్ నేను చూశాను. నిజానికి ఈ ఘనత సాధించే అర్హత నాకుందో లేదో తెలీదు. ఎందుకంటే నేను క్రో స్థాయి ఆటగాడిని కాదు’
- బ్రెండన్ మెకల్లమ్ (కివీస్ కెప్టెన్)
స్కోరు వివరాలు
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 192
భారత్ తొలి ఇన్నింగ్స్: 438
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: ఫుల్టన్ (ఎల్బీ) (బి) జహీర్ 1; రూథర్‌ఫోర్డ్ (సి) ధోని (బి) జహీర్ 35; విలియమ్సన్ (సి) ధోని (బి) జహీర్ 7; లాథమ్ (సి) ధోని (బి) షమీ 29; మెకల్లమ్ (సి) ధోని (బి) జహీర్ 302; అండర్సన్ (సి) అండ్ (బి) జడేజా 2; వాట్లింగ్ (ఎల్బీ) (బి) షమీ 124; నీషామ్ (నాటౌట్) 137; సౌతీ (సి) పుజారా (బి) జహీర్ 11; వాగ్నేర్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 30; మొత్తం (210 ఓవర్లలో 8 వికెట్లకు) 680 డిక్లేర్డ్.
వికెట్ల పతనం: 1-1; 2-27; 3-52; 4-87; 5-94; 6-446; 7-625; 8-639.
బౌలింగ్: ఇషాంత్ 45-4-164-0; జహీర్ 51-13-170-5; షమీ 43-6-149-2; జడేజా 52-11-115-1; రోహిత్ శర్మ 11-0-40-0; కోహ్లి 6-1-13-0; ధోని 1-0-5-0; ధావన్ 1-0-3-0.
భారత్ రెండో ఇన్నింగ్స్: విజయ్ (సి) అండర్సన్ (బి) సౌతీ 7; ధావన్ (ఎల్బీ) (బి) బౌల్ట్ 2; పుజారా (సి) వాట్లింగ్ (బి) సౌతీ 17; కోహ్లి (నాటౌట్) 105; రోహిత్ శర్మ (నాటౌట్) 31; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (52 ఓవర్లలో 3 వికెట్లకు) 166.
వికెట్ల పతనం: 1-10; 2-10; 3-54.
బౌలింగ్: బౌల్ట్ 16-5-47-1; సౌతీ 16-3-50-2; వాగ్నేర్ 11-3-38-0; నీషామ్ 5-0-25-0; అండర్సన్ 4-1-6-0.