కరీబియన్ పర్యటనలో టి20లు, వన్డేల్లో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించినా... టెస్టులు మాత్రం అంత సులువేం కాదని టీమిండియాకు తెలిసొచ్చేలా ప్రారంభమైంది తొలి టెస్టు. ప్రత్యర్థి పేసర్ల ప్రతాపంతో స్వల్ప వ్యవధిలోనే ప్రధాన బ్యాట్స్‌మెన్ వికెట్లు కోల్పోయిన భారత్ తర్వాత కోలుకునే ప్రయత్నం చేస్తోంది. ఫామ్ లేమితో విమర్శల్లో కూరుకుపోయిన వైస్ కెప్టెన్ అజింక్య రహానే అర్దసెంచరీతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం యువ సంచలనం రిషభ్ పంత్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలు క్రీజులో ఉన్నారు. వీరిద్దరి పోరాటం మీదనే తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా భారీ స్కోర్ ఆధారపడి ఉంది.
నార్త్‌సౌండ్ (అంటిగ్వా): పిచ్ నుంచి అందిన సహకారాన్ని సద్వినియోగం చేసుకున్న వెస్టిండీస్ పేసర్లు గురువారం ఇక్కడ ప్రారంభమైన తొలి టెస్టులో టీమిండియాను ఆత్మరక్షణలోకి నెట్టారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న తమ కెప్టెన్ హోల్డర్ నిర్ణయానికి న్యాయం చేస్తూ... భారత ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (5) సహా ప్రధాన బ్యాట్స్‌మెన్ చతేశ్వర్ పుజారా (2), కెప్టెన్ విరాట్ కోహ్లి (9)లను త్వరత్వరగా పెవిలియన్ చేర్చా రు. అయితే, రాహుల్ (97 బంతుల్లో 44; 5 ఫోర్లు), రహానే (122 బంతుల్లో 81; 10 ఫోర్లు) ఓపికతో ఆడి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.117 బంతుల్లో రహానే అర్ధసెంచరీ పూర్తయింది.
రహానేకు విహారి (56 బంతుల్లో 32; 2 ఫోర్లు) చక్కటి సహకారం అందించాడు. అయితే వీరిద్దరూ భారీ స్కోర్లు నమోదు చేయడంలో విఫలమయ్యారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 68.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ప్రస్తుతం రిషభ్ పంత్(41 బంతుల్లో 20 బ్యాటింగ్; 4ఫోర్లు), రవీంద్ర జడేజా(3 బ్యాటింగ్)లు క్రీజులో ఉన్నారు. వీరిద్దరి రాణిస్తేనే కోహ్లి సేన కనీసం 300 పరుగుల మార్క్ దాటగలుగుతుంది. మరి వీరిద్దరూ ఎంతవరకు పోరాడుతారో చూడాలి.
రోచ్ దెబ్బకొట్టాడు
సొంతగడ్డపై టెస్టుల్లో తానెంత ప్రమాదకారినో చెబుతూ కీమర్ రోచ్ (3/34) భారత ఇన్నింగ్స్‌కు ఆదిలోనే షాకిచ్చాడు. ఫుల్ లెంగ్త్‌లో ఆఫ్ స్టంప్‌పై పడిన అతడి బంతిని మయాంక్ ఫ్రంట్ ఫుట్‌పై ఆడబోగా బంతి నేరుగా కీపర్ హోప్ చేతిలో పడింది. అంపైర్ ఔట్ ఇవ్వకున్నా విండీస్ రివ్యూ కోరి ఫలితం సాధించింది. భారత్‌కు అసలైన షాక్ పుజారా ఔట్ రూపంలో నాలుగు బంతుల అనంతరం తగిలింది. రోచ్ లెంగ్త్ బాల్... పుజారా బ్యాట్ అంచును సుతారంగా తాకుతూ హోప్ గ్లోవ్స్‌లోకి చేరింది. వచ్చీ రావడంతోనే రెండు బౌండరీలు బాదిన కోహ్లి జోరుకు గాబ్రియెల్ తెరదించాడు. కవర్స్ దిశగా కట్ షాట్‌కు కోహ్లి చేసిన యత్నం విఫలమైంది.
అతడిచ్చిన క్యాచ్‌ను గల్లీలో బ్రూక్స్ ఒడిసిపట్టాడు. 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన స్థితిలో రహానే–రాహుల్ ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు వీరు 68 పరుగులు జోడించారు. విండీస్ పేసర్ల బౌలింగ్‌లో పలుసార్లు బంతి శరీరానికి తగిలినా పట్టుదలగా> నిలిచిన రాహుల్... స్పిన్నర్ చేజ్ బౌలింగ్‌లో వెనుదిరిగి భారీ స్కోరు చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. రహానే, విహారిలు క్రీజులో నిలదొక్కుకోని ఆచితూచి ఆడుతున్నారు. అయితే టీమిండియా ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న సమయంలో రోచ్ మరోసారి టీమిండియాను దెబ్బ కొట్టాడు. విహారిని బోల్తా కొట్టించాడు. మరో 14 పరుగులు వ్యవధిలోనే రహానే(81)ను గాబ్రియల్ క్లీన్‌బౌల్డ్ చేశాడు . దీంతో కనీసం రెండు వందల పరుగులు నమోదు చేయకముందే టీమిండియా ఆరు వికెట్లను చేజార్చుకుంది.
కూర్పులో అనూహ్యం
తొలి టెస్టులో టీమిండియా కూర్పు కొంత ఆశ్చర్యపర్చింది. ఓపెనింగ్‌లో రాహుల్, మయాంక్‌కే ఓటేసిన టీం మేనేజ్‌మెంట్... ఆరో నంబరు బ్యాట్స్‌మన్‌గా విహారికి చోటిచ్చింది. ఇంకా అనూహ్యంగా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను పక్కనపెట్టింది. ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా రవీంద్ర జడేజాపై భారం వేసి బరిలో దిగింది. విహారి పార్ట్‌టైమ్ ఆఫ్‌స్పిన్ ఉపయుక్తం కాగలదని అంచనా వేసింది. కీపర్‌గా సాహాను కాదని యువ రిషభ్ పంత్‌వైపే మొగ్గింది. అశ్విన్‌ను ఆడించకపోవడంపై దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గావస్కర్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment