
భువనేశ్వర్: తొలి మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాను నిలువరించిన భారత్ రెండో మ్యాచ్‌లో మాత్రం నిరాశపరిచింది. ఇంగ్లండ్‌తో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నీ పూల్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 2–3 గోల్స్ తేడాతో పరాజయం పాలైంది. భారత్ తరఫున ఆకాశ్‌దీప్ సింగ్ (47వ నిమిషంలో), రూపిందర్ పాల్ సింగ్ (50వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఇంగ్లండ్ జట్టుకు స్యామ్ వార్డ్ (43వ, 57వ నిమిషాల్లో) రెండు గోల్స్ అందించగా... డేవిడ్ గుడ్‌ఫీల్డ్ (25వ నిమిషంలో) మరో గోల్ సాధించాడు. సోమవారం జరిగే తమ గ్రూప్‌లోని చివరి మ్యాచ్‌లో జర్మనీతో భారత్ తలపడుతుంది.
ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఆధిక్యంలోకి వెళ్లిన మరుసటి నిమిషంలోనే గోల్ సమర్పించుకొని ‘డ్రా’తో సరిపెట్టుకున్న భారత్... ఇంగ్లండ్ జట్టును మాత్రం చివరి మూడు నిమిషాలు నిలువరించలేక ఓటమిని ఆహ్వానించింది. ఒకదశలో 0–2తో వెనుకబడిన భారత్ మూడు నిమిషాల వ్యవధిలో రెండు పెనాల్టీ కార్నర్‌లను సంపాదించి వాటిని గోల్స్‌గా మలిచి స్కోరును 2–2తో సమం చేసింది. ఇక మ్యాచ్ మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా భారత రక్షణపంక్తిలో కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ బంతిని నిలువరించడంలో తడబడ్డాడు. బంతిని అందుకున్న ఇంగ్లండ్ ప్లేయర్ స్యామ్ వార్డ్ ముందుకు దూసుకెళ్లి గోల్‌గా మలిచి భారత్ శిబిరంలో నిరాశను నింపాడు.
Comments
Please login to add a commentAdd a comment