
న్యూఢిల్లీ: ఫిఫా అండర్–17 ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్‌లో అమెరికా చేతిలో ఓటమి పాలైన భారత కుర్రాళ్లు నేడు (సోమవారం) మరో పోరుకు సిద్ధమవుతున్నారు. ఈసారి కూడా తమకన్నా మెరుగైన స్థితిలో ఉన్న కొలంబియాతో భారత్ తలపడుతోంది. పటిష్ట అమెరికాతో అన్ని విభాగాల్లో వెనకబడి 0–3తో చిత్తుగా ఓడిన భారత్ ఈసారి తమ వైఫల్యాలను సరిచేసుకుని బరిలోకి దిగాలని భావిస్తోంది. తదుపరి రౌండ్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే భారత్‌కు ఓ విజయం అవసరం. అయితే ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టే కొలంబియాపై తమ శక్తికి మించిన ఆటను ప్రదర్శించాల్సి ఉంటుందని మిడ్‌ఫీల్డర్ లించ్‌పిన్ సురేశ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో తాము నైజర్ జట్టును ఆదర్శంగా తీసుకోవాలనుకుంటున్నాడు. తొలిసారిగా ప్రపంచకప్‌లో ఆడుతున్న ఆ జట్టు శనివారం రాత్రి తమకన్నా మెరుగైన స్థితిలో ఉన్న ఉత్తర కొరియాపై నెగ్గింది. అటు భారత కోచ్ లూయిస్ నార్టన్ కూడా తమ తొలి మ్యాచ్ ఫలితంపై నిరాశగా ఉన్నారు.
కొలంబియా కూడా గట్టి పోటీనివ్వడం ఖాయమని, అయితే సవాల్‌ను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. చివరి నిమిషం వరకు పోరాడతామని, ఈ మ్యాచ్‌లో నెగ్గితే చరిత్ర సృష్టించినట్టేనని అన్నారు. నిజానికి అమెరికాతో పోరులో భారత కుర్రాళ్లు అక్కడక్కడ మెరుపు ఆటను ప్రదర్శించి తమ తొలి గోల్‌కు దగ్గరగా రాగలిగారు. అయితే అన్నింటా ఆధిపత్యం చూపిన యూఎస్ జట్టు ఆ అవకాశాలను అడ్డుకోగలిగింది. ఈ మ్యాచ్‌లో సిక్కిం కుర్రాడు కోమల్ తటాల్ అందరినీ ఆకర్షించాడు. తన డ్రిబ్లింగ్ నైపుణ్యంతో జట్టుకు పలు గోల్ అవకాశాలను సృష్టించగలిగాడు. అలాగే అనికేత్ జాదవ్‌తో పాటు డిఫెన్స్ ఆటగాళ్లు అన్వర్ అలీ, జితేంద్ర సింగ్ తమ శాయశక్తులా అమెరికాకు గట్టి పోటీనివ్వగలిగారు. అన్నింటికీ మించి గోల్‌కీపర్ ధీరజ్ సింగ్ అత్యద్భుతంగా రాణించి అడ్డుగోడలా నిలవకపోయుంటే అమెరికా చేతిలో భారీ గోల్స్ తేడాతో పరాజయం ఎదురయ్యేదే. యూరోప్ జట్లతో పోలిస్తే శారీరకంగా, సాంకేతికంగా వెనుకబాటులో ఉండడం భారత కుర్రాళ్లను దెబ్బతీస్తున్న అంశం.
కసితో కొలంబియా..
మరోవైపు తమ తొలి మ్యాచ్‌లో కొలంబియా కూడా ఘనా చేతిలో 0–1తో పరాజయం పాలైంది. ఇప్పుడు తమ కన్నా బలహీన భారత్‌పై సాధ్యమైనన్ని ఎక్కువ గోల్స్‌తో విరుచుకుపడి తమ పాయింట్లను మెరుగుపరుచుకోవాలని చూస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment