ఆధిపత్యం నీదా... నాదా? అన్నట్లు సాగింది ఆట. నీ గోల్‌కు నా గోల్ జవాబంటూ సమమైంది స్కోరు. అదనపు సమయంలోనూ ఎవరికీ దక్కలేదు గెలుపు. అటు ఇటు తిరిగి పెనాల్టీ షూటౌటే తేల్చింది ఫలితం. మరో ఉత్కంఠ పోరాటంతో ముగిసింది ప్రి క్వార్టర్స్.
మాస్కో: ప్రస్తుత ఫుట్‌బాల్ ప్రపంచకప్ ప్రిక్వార్టర్స్ దశను ‘పెనాల్టీ నాకౌట్’గా పేర్కొనవచ్చేమో! మొత్తం 8 మ్యాచ్‌ల్లో మూడింటి ఫలితం షూటౌట్‌లోనే తేలింది మరి! మంగళవారం అర్ధరాత్రి కొలంబియాతో ఇక్కడ జరిగిన పోరులో ఇంగ్లండ్ ఈ తరహాలోనే 4–3తో విజయం సాధించింది. అంతకుముందు 57వ నిమిషంలో పెనాల్టీని ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ హ్యారీ కేన్ గోల్‌గా మలచడంతో ఇంగ్లండ్‌కు ఆధిక్యం దక్కింది. కొలంబియా స్టార్ ఎరి మినా ఇంజ్యూరీ (90+3వ ని.)లో స్కోరు కొట్టి లెక్క సమం చేశాడు. అదనపు అరగంట సమయంలోనూ మరో గోల్ కాకపోవడంతో పెనాల్టీ షూటౌట్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది. నాలుగు, ఐదు కిక్‌లను కొలంబియా ఆటగాళ్లు నెట్‌లోకి కొట్టడంలో విఫలం కాగా, మూడో కిక్ మినహా మిగతా వాటిని గోల్‌పోస్ట్‌లోకి పంపిన ఇంగ్లండ్ జయకేతనం ఎగురవేసింది.
ఆసాంతం సమఉజ్జీలుగానే...
బంతిపై నియంత్రణ, పాస్‌ల కచ్చితత్వంలో మ్యాచ్ మొదటి నుంచి రెండు జట్లు సమంగానే నిలిచాయి. అయితే, ప్రత్యర్థి కంటే గేమ్ ప్లాన్‌కు కట్టుబడి ఆడిన ఇంగ్లండే ఎక్కువ దాడులు చేసింది. 16వ నిమిషంలో కేన్ కొట్టిన హెడర్ గోల్ బార్‌కు కొద్ది దూరంలో వెళ్లింది. రహీమ్ స్టెర్లింగ్, కీరన్ ట్రిప్పియర్‌ల జోరుతో తర్వాత సైతం అవకాశాలు వచ్చాయి. మరోవైపు కొలంబియా కీపర్ డేవిడ్ ఒస్పినా అప్రమత్తత, శాంటియాగో ఎరియాస్, జువాన్ క్వాడ్రాడోల ప్రతిదాడులతో ఇంగ్లండ్‌ది పైచేయి కాలేదు. క్రమంగా పుంజుకున్న కొలంబియా ప్రత్యర్థి వెనుకంజ వేసేలా చేసింది. మొదటిభాగంలో 53 శాతం బంతి ఇంగ్లండ్ పరిధిలోనే ఉంది.
పెనాల్టీ చెల్లించుకున్నారు...
రెండో భాగంలో ప్రారంభంలోనే తప్పులు చేసిన కొలంబియా మూల్యం చెల్లించుకుంది. 54వ నిమిషంలో శాంచెజ్... కేన్‌ను కూలదోయడంతో ఇంగ్లండ్‌కు పెనాల్టీ దక్కింది. కీపర్ ఒస్పినాను ఊరిస్తూ కేన్ కొట్టిన బంతి నెట్‌లోకి చేరింది. ఇక్కడినుంచి రెండు జట్లు వరుసగా సబ్‌స్టిట్యూట్లను దింపాయి. మ్యాచ్‌లో తీవ్రత పెరగడంతో 52–69వ నిమిషాల మధ్యలో ఏకంగా ఆరు ఎల్లో కార్డులు చూపించాల్సి వచ్చింది. ఇందులో కొలంబియానే నాలుగు ఎదుర్కొనడం గమనార్హం. రెండు జట్లకు రెండేసి అవకాశాలు వచ్చినా అవి గోల్‌పోస్ట్ సమీపం నుంచి పక్కకు వెళ్లాయి. ఇంజ్యూరీలో కార్నర్ కిక్‌ను డి బాక్స్ వద్ద నుంచి మినా హెడర్ గోల్‌గా మలిచాడు. అదనపు సమయం మొదటి భాగంలో కొలంబియా, రెండోభాగంలో ఇంగ్లండ్ పోరాడినా గోల్ చేయలేకపోయాయి. దీంతో ఫలితం కోసం పెనాల్టీ షూటౌట్ తప్పలేదు.
►ప్రస్తుత ప్రపంచకప్‌లో షూటౌట్‌లో తొలి షాట్ తీసుకున్న మూడు జట్లూ ఓడాయి.
►1996 ‘యూరో’ టోర్నీలో స్పెయిన్‌పై షూటౌట్‌లో గెలిచాక మరో మెగా ఈవెంట్‌లో ఇంగ్లండ్ షూటౌట్‌లో గెలుపొందడం ఇదే ప్రథమం. ఓవరాల్‌గా ఇంగ్లండ్ ఎనిమిది షూటౌట్‌లను ఎదుర్కొనగా... ఆరింటిలో ఓడిపోయి, రెండింటిలో మాత్రమే గెలిచింది.
►2006 ప్రపంచకప్ తర్వాత ఇంగ్లండ్ ఈ ఈవెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరింది.
►1939లో టామీ లాటన్ తర్వాత ఇంగ్లండ్ తరఫున ఆడిన తొలి ఆరు మ్యాచ్‌ల్లోనూ గోల్స్ కొట్టిన ప్లేయర్‌గా హ్యారీ కేన్ నిలిచాడు.
►ప్రపంచకప్ చరిత్రలో ఇంగ్లండ్ ఆడిన గత 15 నాకౌట్ మ్యాచ్‌ల్లో ఎనిమిది అదనపు సమయానికి వెళ్లడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment