
టీమిండియా తొలిసారి..
గత ఎనిమిది దశాబద్దాలుగా ఆనవాయితీగా వస్తున్న ఓ సంప్రదాయానికి ప్రస్తుత టీమిండియా జట్టు చరమగీతం పాడింది.
ముంబై: గత ఎనిమిది దశాబద్దాలుగా ఆనవాయితీగా వస్తున్న ఓ సంప్రదాయానికి ప్రస్తుత టీమిండియా క్రికెట్ జట్టు చరమగీతం పాడింది. ముంబై నగరంలో జరిగే టెస్టు మ్యాచ్ల్లో ముంబైకి చెందిన ఆటగాడు లేకుండా టీమిండియా తొలిసారి బరిలోకి దిగడం గత 83 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి. 1933 నుంచి చూస్తే ఇక్కడ జరిగిన ఏ టెస్టులో కూడా ముంబై ఆటగాడు తుది జట్టులో లేకుండా పోరుకు సిద్ధమవ్వలేదు.
తాజాగా ఇంగ్లండ్తో ఇక్కడ జరుగుతున్న నాల్గో టెస్టులో ముంబై ఆటగాళ్లకి అవకాశం దక్కలేదు. ఈ మ్యాచ్ ద్వారా ముంబైకి చెందిన శార్దూల్ ఠాకూర్ అంతర్జాతీయ అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు. కాగా, అతన్ని ఈ టెస్టు మ్యాచ్లో ఎంపిక చేయకపోవడంతో ఆనాటి నుంచి వస్తున్న సంప్రదాయానికి తెరదించినట్లైంది. ఇదిలా ఉండగా, నాల్గో టెస్టులో ఇంగ్లండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా ఇంగ్లండ్ ఆటగాడు జెన్నింగ్స్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. కౌంటీ మ్యాచ్ల్లో అమోఘమైన పరుగుల రికార్డు ఉన్న జెన్నింగ్స్.. 2016లో 1548 కౌంటీ పరుగులు సాధించాడు. తద్వారా కౌంటీల్లో అత్యధిక పరుగులు సాధించిన ఏకైక ఆటగాడిగా జెన్నింగ్స్ కు అరుదైన ఘనత ఉంది. ఈ పరుగులు సాధించే క్రమంలో అత్యధిక సెంచరీలు(7) రికార్డు కూడా అతని పేరిటే లిఖించబడింది. ఇంగ్లండ్ ఓపెనర్ హషిబ్కు విశ్రాంతినివ్వడం ద్వారా అతని స్థానంలో జెన్నింగ్స్ కు అవకాశం కల్పించారు.