కొరియా చేతిలో ఓడినా...
క్వార్టర్స్‌లో భారత్
► ఆసియా మిక్స్‌డ్ టీమ్ చాంపియన్ షిప్
హో చి మిన్ (వియత్నాం): ఆసియా మిక్స్‌డ్ టీమ్ చాంపియన్ షిప్‌లో భారత్ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. గురువారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 1–4తో కొరియా చేతిలో ఓడినప్పటికీ గ్రూప్ ‘డి’ విభాగంలో రెండో స్థానంలో నిలిచి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. భారత్ తరఫున పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ 24–22, 21–9తో వాన్ హో సాన్ పై గెలుపొందగా... మిగిలిన అన్ని మ్యాచ్‌లో్లనూ భారత క్రీడాకారులకు పరాజయాలే ఎదురయ్యాయి.
మిక్స్‌డ్ డబుల్స్‌లో యూ జంగ్ చై– సోల్‌గ్యు చోయ్ జోడి 21–17, 17–21, 21–17తో అశ్విని పొన్నప్ప– సుమీత్ రెడ్డి జంట పై, పురుషుల డబుల్స్‌లో జి జంగ్ కిమ్– యెన్ సియోంగ్ యూ 21–15, 28–26తో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టిపై నెగ్గగా... మహిళల డబుల్స్‌లో యె న చంగ్– సీ హీ లీ జంట 21–13, 21–19తో అశ్విని పొన్నప్ప– సిక్కిరెడ్డి జోడీపై గెలుపొందింది. మహిళల సింగిల్స్‌లోనూ తన్వి లాడ్ 8–21, 15–21తో జి హ్యూన్ సంగ్ చేతిలో ఓటమి పాలైంది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్‌లో భారత్, థాయిలాండ్‌తో తలపడుతుంది.