ఈ సీజన్‌లో తమ అద్భుతమైన ప్రదర్శనను కొనసాగిస్తూ... 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.... భారత స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్... సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ ఆసియా క్రీడల్లో పతకాలను ఖాయం చేసుకున్నారు. న్యూఢిల్లీ వేదికగా 1982లో జరిగిన ఆసియా క్రీడల్లో చివరిసారి బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో భారత్‌కు పతకాలు లభించాయి. 1982 ఆసియా క్రీడల పురుషుల సింగిల్స్‌లో దివంగత సయ్యద్ మోడీ... పురుషుల డబుల్స్‌లో లెరాయ్ ఫ్రాన్సిస్–ప్రదీప్ గాంధె సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు గెలిచారు.
ఆ తర్వాత తొమ్మిదిసార్లు ఆసియా క్రీడలు జరిగినా పురుషుల సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో భారత క్రీడాకారులెవరూ సెమీఫైనల్ దశకు చేరుకోలేకపోయారు. చైనా గడ్డపై ఎట్టకేలకు ఈ నిరీక్షణకు ప్రణయ్, సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ముగింపు పలికారు. సింగిల్స్‌లో ప్రణయ్... డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ప్రణయ్ 21–16, 21–23, 22–20తో లీ జి జియా (మలేసియా)పై గెలుపొందాడు. 78 నిమిషాలపాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో కేరళకు చెందిన 31 ఏళ్ల ప్రణయ్ రెండో గేమ్‌లోనే గెలవాల్సింది.
తొలి గేమ్‌ను సొంతం చేసుకొని, రెండో గేమ్‌లో 20–18తో ఆధిక్యంలో నిలిచిన ప్రణయ్ రెండు మ్యాచ్ పాయింట్లను వదులుకున్నాడు. స్కోరును సమం చేసిన లీ జి జియా అదే జోరులో రెండో గేమ్‌ను నెగ్గి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్ కూడా నువ్వా నేనా అన్నట్లు సాగింది. చివరకు ప్రణయ్ 18–20తో ఓటమి అంచుల్లో నిలిచాడు.
అయితే సంయమనం కోల్పోకుండా ఆడిన ప్రపంచ ఏడో ర్యాంకర్ ప్రణయ్ వరుసగా నాలుగు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. నేడు జరిగే సెమీఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్ లీ షి ఫెంగ్ (చైనా)తో ప్రణయ్ ఆడతాడు. ముఖాముఖి రికార్డులో ప్రణయ్ 3–0తో లీ షి ఫెంగ్‌పై ఆధిక్యంలో ఉన్నాడు.
డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం 21–7, 21–9తో ఎన్జీ జూ జియి–జాన్ ప్రజోగో (సింగపూర్) జంటపై గెలిచి సెమీఫైనల్ చేరింది. నేడు జరిగే సెమీఫైనల్లో ఆరోన్ చియా–సూ వుయ్ యిక్ (మలేసియా) జంటతో సాత్విక్–చిరాగ్ ద్వయం తలపడుతుంది.
సింధుకు నిరాశ
మరోవైపు మహిళల సింగిల్స్‌లో భారత స్టార్ పీవీ సింధు పోరాటం ముగిసింది. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో ఫైనల్లో ఓడి రజత పతకం సాధించిన సింధు ఈసారి మాత్రం క్వార్టర్ ఫైనల్ దాటలేకపోయింది. క్వార్టర్ ఫైనల్లో సింధు 16–21, 12–21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ హి బింగ్జియావో (చైనా) చేతిలో ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment