సిరిల్ వర్మ సంచలనం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నుంచి మరో యువతార అంతర్జాతీయ బ్యాడ్మింటన్ వేదికపై తళుక్కుమన్నాడు. 14 ఏళ్ల తెలుగు కుర్రాడు అల్లూరి శ్రీసాయి (ఎ.ఎస్.ఎస్) సిరిల్ వర్మ ఆసియా జూనియర్ చాంపియన్‌గా అవతరించాడు. ఇండోనేసియాలో ఆదివారం ముగిసిన ఆసియా యూత్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సిరిల్ వర్మ అండర్-15 బాలుర సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. ఫైనల్లో సిరిల్ 21-11, 21-17తో గజపుత్ర (ఇండోనేసియా)ను ఓడించాడు. ఈ క్రమంలో అతను ఆసియా జూనియర్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు.
2012లో పి.వి.సింధు ఆసియా జూనియర్ బాలికల విభాగంలో చాంపియన్‌గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది. ఇటీవల ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) షటిల్ ఎక్స్‌ప్రెస్ టోర్నమెంట్‌లోనూ విజేతగా నిలిచిన సిరిల్ ఆసియా చాంపియన్‌షిప్‌లో స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క గేమ్‌ను మాత్రమే తన ప్రత్యర్థులకు కోల్పోయాడు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సిరిల్ ప్రస్తుతం అండర్-15 ర్యాంకింగ్స్‌లో భారత నంబర్‌వన్‌గా ఉన్నాడు.
ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లోనే భారత్‌కు మరో టైటిల్ లభించింది. అండర్-17 బాలుర డబుల్స్ విభాగం ఫైనల్లో అర్జున్ (కేరళ)-చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర) జోడి 21-16, 21-15తో కాంతాపోన్ వాంగ్‌చరోయెన్-మెక్ నారోన్‌గ్రిత్ (థాయ్‌లాండ్) జంటపై నెగ్గి టైటిల్ సాధించింది. అండర్-17 బాలుర సింగిల్స్ సెమీఫైనల్లో ఓడిపోయిన డానియల్ ఫరీద్... అండర్-15 మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్స్‌లో ఓడిన కృష్ణ ప్రసాద్-శ్రేయా జోడిలకు కాంస్య పతకాలు లభించాయి. ఓవరాల్‌గా భారత్ నాలుగు పతకాలతో ఈ పోటీల చరిత్రలో తమ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది.
స్కూల్ విజయాలనుంచి..
సిరిల్ వర్మ తండ్రి వెంకట విజయరామరాజు జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. స్పోర్ట్స్ కోటాలోనే ఆయన ఏపీఎస్‌ఆర్‌టీసీలో ఉద్యోగం పొందారు. తాము నివాసం ఉంటున్న బీహెచ్‌ఈఎల్ ప్రాంతంలో వివిధ క్రీడా పోటీలను చూసి సిరిల్ ఆటలపై ఆసక్తి పెంచుకున్నాడు. బ్యాడ్మింటన్‌పై సిరిల్ ప్రత్యేక ఇష్టాన్ని గుర్తించిన తండ్రి గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీలో చేర్పించి ప్రోత్సహించారు.
గత ఆరేళ్లుగా అతను అక్కడే శిక్షణ పొందుతున్నాడు. జాతీయ అండర్-17లో కాంస్యం నెగ్గి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. గ్లెన్‌డేల్ అకాడమీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇతను గత నాలుగేళ్లుగా జాతీయ స్థాయి సీబీఎస్‌ఈ స్కూల్స్ చాంపియన్‌గా నిలుస్తున్నాడు. ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో 2011లో ప్రి క్వార్టర్స్‌లో, 2012లో క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిపోయిన సిరిల్ ఈసారి విజేతగా నిలవడం విశేషం.
‘అంతర్జాతీయ స్థాయిలో మా అబ్బాయి తొలి టైటిల్ నెగ్గడం ఆనందంగా ఉంది. ఇది అతడి కెరీర్‌లో కావాల్సిన ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఆటలో తీర్చిదిద్దిన గోపీ అకాడమీకే ఆ క్రెడిట్ దక్కుతుంది. ఇప్పుడిప్పుడే బ్యాడ్మింటన్‌లో ఎదుగుతున్న సిరిల్, భవిష్యత్తులో మరిన్ని పెద్ద స్థాయి విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాం.’
-‘సాక్షి’తో సిరిల్ తల్లిదండ్రులు విజయరామరాజు, సుశీల