siril Varma
-
క్వార్టర్స్‌లో రాహుల్, సిరిల్ వర్మ
సాక్షి, హైదరాబాద్: అనంత్ బజాజ్ స్మారక ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారులు చిట్టబోయిన రాహుల్ యాదవ్, సిరిల్ వర్మ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రాహుల్ యాదవ్ 21–13, 23–21తో ధ్రువ్ రావత్ (ఉత్తరాఖండ్)పై, సిరిల్ వర్మ 21–11, 21–16తో చిరాగ్ సేన్ (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా–ఏఏఐ)పై విజయం సాధించారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో రాహుల్ యాదవ్ 21–13, 21–16తో సిద్ధార్థ్ ప్రతాప్ సింగ్ (ఛత్తీస్‌గఢ్)పై, సిరిల్ వర్మ 23–21, 21–16తో అమన్ కుమార్ (హరియాణా)పై గెలిచారు. తెలంగాణకే చెందిన పుల్లెల సాయివిష్ణు, గోపాలకృష్ణారెడ్డి, తరుణ్ రెడ్డి, ఆదిత్య గుప్తా, ఆదిత్య బాపినీడు తొలి రౌండ్లో ఓడిపోగా... అనికేత్ రెడ్డి, గంధం ప్రణవ్ రావు, కిరణ్‌కుమార్ రెండో రౌండ్లో ఓటమి పాలయ్యారు. సెమీస్‌లో గాయత్రి మహిళల సింగిల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి (తెలంగాణ) సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో 13వ సీడ్ గాయత్రి 16–21, 21–13, 21–15తో నాలుగో సీడ్ ఆకర్షి కశ్యప్ (ఏఏఐ)పై సంచలన విజయం సాధించింది. నేడు జరిగే సెమీఫైనల్లో రీతూపర్ణ దాస్ (పెట్రోలియం)తో గాయత్రి ఆడుతుంది. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో శిఖా గౌతమ్ 21–15, 8–5తో అష్మిత చాలిహా (అస్సోం–రిటైర్డ్ హర్ట్)పై, తన్వీ లాడ్ 21–23, 21–13, 21–11తో రియా ముఖర్జీపై, రీతూపర్ణ దాస్ 21–19, 21–6తో మోపాటి కెయూర (తెలంగాణ)పై గెలిచారు. తెలంగాణకే చెందిన ప్రాషి జోషి, సామియా ఇమాద్ ఫారూఖీ, మేఘన రెడ్డి రెండో రౌండ్లో ఓడిపోయారు. ఆర్బీఐకి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగమ్మాయి శ్రీకృష్ణప్రియ రెండో రౌండ్లో 17–21, 10–21తో ఆకర్షి కశ్యప్ చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌లో సాయి రోహిత్–ఆకాశ్ (తెలంగాణ); పొదిలె శ్రీకృష్ణ సాయికుమార్–షేక్ గౌస్ (ఆంధ్రప్రదేశ్) జోడీలు క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాయి. -
టైటిల్ పోరుకు సిరిల్ వర్మ
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ సిరిల్ వర్మ టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు. విజయవాడలో జరుగుతోన్న ఈ టోర్నీలో సిరిల్ వర్మ ఫైనల్‌కు చేరుకున్నాడు. గురువారం పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఎనిమిదో సీడ్ సిరిల్ వర్మ 21–9, 21–18తో శంకర్ ముత్తుస్వామి (తమిళనాడు)పై విజయం సాధించాడు. అంతకుముందు క్వార్టర్స్ మ్యాచ్‌లో సిరిల్ 21–19, 21–7తో రోహిత్ యాదవ్ (తెలంగాణ)ను ఓడించాడు. మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ప్రీతి పోరు క్వార్టర్స్‌లోనే ముగిసింది. క్వార్టర్స్‌లో ప్రీతి 9–21, 12–21తో మూడో సీడ్ ఆకర్షి కశ్యప్ (ఏఏఐ) చేతిలో ఓడిపోయింది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో ఆర్బీఐ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న హైదరాబాద్ అమ్మాయి మేఘన జక్కంపూడి తన భాగస్వామి ధ్రువ్ కపిలతో కలిసి ఫైనల్‌కు చేరుకుంది. మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ ధ్రువ్ కపిల (ఎయిరిండియా)–మేఘన ద్వయం 21–12, 21–12తో అరుణ్ జార్జ్ (కేరళ)–మహిమ (కర్ణాటక) జోడీపై గెలుపొందింది. పురుషుల డబుల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌లో టాప్‌సీడ్ కృష్ణ ప్రసాద్ (ఏపీ)–ధ్రువ్ (ఎయిరిండియా) ద్వయం 21–12, 14–21, 21–14తో సంజయ్ (పాండిచ్చేరి)–సిద్ధార్థ్ (తెలంగాణ) జంటపై గెలుపొందింది. -
క్వార్టర్స్‌లో సిరిల్ వర్మ, రోహిత్ యాదవ్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ క్రీడాకారులు సిరిల్ వర్మ, చిట్టబోయిన రోహిత్ యాదవ్ నిలకడగా రాణిస్తున్నారు. విజయవాడలో జరుగుతోన్న ఈ టోర్నీ పురుషుల సింగిల్స్‌లో వీరిద్దరూ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. నగరానికే చెందిన మరో ప్లేయర్ రాహుల్ యాదవ్ ప్రిక్వార్టర్లో ఓడిపోయాడు. రాహుల్ 18–21, 21–17, 10–21తో రోహన్ చేతిలో ఓడిపోయాడు. శుక్రవారం ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ సిరిల్ వర్మ (తెలంగాణ) 21–15, 19–21, 21–11తో క్వాలిఫయర్ ప్రియాన్షు రజావత్‌పై గెలుపొందాడు. అంతకుముందు రెండో రౌండ్లో సిరిల్ వర్మ 21–7, 21–13తో క్వాలిఫయర్ హిమాన్షు తివారీ (ఉత్తరాఖండ్)పై, తొలిరౌండ్లో 21–11, 21–17తో అమన్ ఫరోగ్ (మహారాష్ట్ర)పై గెలుపొందాడు. టాప్ సీడ్ రోహిత్ యాదవ్ ప్రిక్వార్టర్స్‌లో 24–22, 11–21, 21–17తో ఎం. రఘు (కర్ణాటక)పై, రెండో రౌండ్లో 21–19, 21–12తో అనంత్ శివమ్ జిందాల్ (హరియాణా)పై, తొలిరౌండ్లో 21–16, 21–16తో నవీన్ (క్వాలిఫయర్)పై నెగ్గి ముందంజ వేశాడు. మరోవైపు పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ రాహుల్ యాదవ్ (తెలంగాణ) 18–21, 21–17, 10–21తో క్వాలిఫయర్ రోహన్ గుర్బానీ (మహారాష్ట్ర) చేతిలో ఓడిపోయాడు. మహిళల విభాగంలో ప్రీతి (ఆంధ్రప్రదేశ్) క్వార్టర్స్‌కు చేరుకోగా... నిషితా వర్మ, జి. వృశాలి, (ఆంధ్రప్రదేశ్) ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రీతి 21–17, 7–21, 21–10తో త్రిషా హెగ్డే (కర్ణాటక)పై విజయం సాధించింది. ఇతర మ్యాచ్‌ల్లో నిషితా వర్మ 16–21, 8–21తో ఉన్నతి బిష్త్ (ఉత్తరాఖండ్) చేతిలో, వృశాలి 21–15, 18–21, 11–21తో వైదేహి చౌదరీ (మహారాష్ట్ర) చేతిలో ఓటమి పరాజయం పాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారుడు శ్రీకృష్ణ సాయికుమార్ తన జోడీ కావ్య గాంధీతో కలిసి క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో శ్రీకృష్ణ–కావ్య (ఢిల్లీ) ద్వయం 16–21, 21–18, 21–19తో కబీర్ (రైల్వేస్)–సోనిక సాయి (ఆంధ్రప్రదేశ్) జంటపై గెలుపొందింది. మరో పోరులో ఐదో సీడ్ గౌస్ షేక్ (ఆంధ్రప్రదేశ్)–మయూరి (గుజరాత్) జంట 21–16, 23–21తో సాంగ్రమ్ చుటియా–మనాలి బోరా (అస్సాం) జోడీపై గెలుపొంది ముందంజ వేసింది. పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో టాప్ సీడ్ కృష్ణ ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)– ధ్రువ్ కపిల (ఎయిరిండియా) జంట 21–7, 21–16తో ప్రతీక్ రనడే– అక్షయ్ రౌత్ (మహారాష్ట్ర) జోడీపై గెలుపొంది క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. మరో మ్యాచ్‌లో సంజయ్ శ్రీవత్స (పాండిచ్చేరి)–సిద్ధార్థ్ (తెలంగాణ) జంట 21–16, 13–21, 21–15తో ఆరోసీడ్ ప్రకాశ్ రాజ్–వైభవ్ (కర్ణాటక) జోడీకి షాకిచ్చింది. మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో సాహితి (తెలంగాణ)–ధ్రితి(కర్ణాటక) ద్వయం 23–21, 21–12తో రమ్య(తమిళనాడు)–మయూరి యాదవ్ (గుజరాత్) జోడీపై నెగ్గి క్వార్టర్స్‌కు చేరుకుంది. -
సెమీస్‌లో గాయత్రి, సిరిల్ వర్మ
సాక్షి, హైదరాబాద్: యోనెక్స్ సన్‌రైజ్ ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారులు పుల్లెల గాయత్రి, ఎ. సిరిల్ వర్మ సెమీస్‌కు దూసుకెళ్లారు. గచ్చిబౌలిలోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో సిరిల్ వర్మ 21–18, 21–11తో ఆలాప్ మిశ్రా (మధ్యప్రదేశ్)పై, రాహుల్ యాదవ్ (తెలంగాణ) 22–20, 21–15తో శ్రీరామ్ (కర్ణాటక)పై గెలిచారు. మహిళల సింగిల్స్ క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో గాయత్రి 23–21, 21–9తో శైలి రాణే (రైల్వేస్)పై నెగ్గగా, మూడోసీడ్ సాయి ఉత్తేజిత రావు (ఏపీ) 21–12, 21–11తో ఆషి రావత్ (ఢిల్లీ)ని ఓడించింది. డబుల్స్ విభాగాల్లో మేఘన జక్కంపూడికి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మిక్స్డ్ డబుల్స్‌లో ధ్రువ్ కపిల (ఎయిరిండియా)–మేఘన (ఆర్బీఐ) జంట 21–12, 21–11తో హేమనాగేంద్ర బాబు (రైల్వేస్)– నింగ్షి హజారికా (అస్సాం) జోడీపై నెగ్గింది. మహిళల డబుల్స్‌లో మేఘన–పూర్విషా రామ్ (ఆర్బీఐ) జంట 5–21, 19–21తో అపర్ణ బాలన్–కె. శ్రుతి జోడీ చేతిలో ఓడింది. -
సిరిల్ వర్మ ఓటమి
హనోయ్ (వియత్నాం): భారత ఆటగాడు సిరిల్ వర్మ వియత్నాం ఇంటర్నేషనల్ చాలెంజ్ కప్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ప్రిక్వార్టర్స్‌లో పరాజయం చవిచూశాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో 12వ సీడ్ సిరిల్ వర్మ 17–21, 14–21తో నాలుగో సీడ్ మౌలానా పాంజీ అహ్మద్ (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయాడు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి జోడి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్‌లో ఈ జోడి 21–17, 21–16తో యొషికి సుకమొటొ–షున్ సుకె యమముర (జపాన్) జంటపై గెలిచింది. -
ఫైనల్లో రుత్విక, సిరిల్ వర్మ
న్యూఢిల్లీ: నిలకడైన ప్రదర్శనను కొనసాగిస్తూ భారత యువ బ్యాడ్మింటన్ క్రీడాకారులు గద్దె రుత్విక శివాని, సిరిల్ వర్మ రష్యా గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో టైటిల్ పోరుకు అర్హత సాధించారు. తమ కెరీర్లో వీరిద్దరూ తొలిసారి ఓ గ్రాండ్‌ప్రి స్థాయి టోర్నీలో ఫైనల్‌కు చేరారు. రష్యాలోని వ్లాదివొస్తోక్ నగరంలో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో రుత్విక శివాని 22-20, 21-13తో రెండో సీడ్ సెనియా పొలికర్పోవా (రష్యా)ను ఓడించగా... పురుషుల సింగిల్స్ సెమీస్‌లో సిరిల్ 24-22, 21-16తో అనతోలి యార్ట్‌సెవ్ (రష్యా)పై గెలిచాడు. మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో తెలంగాణ అమ్మాయి సిక్కి రెడ్డి తన భాగస్వామి ప్రణవ్ చోప్రాతో కలిసి ఫైనల్‌కు చేరింది. సెమీఫైనల్లో సిక్కి-ప్రణవ్ ద్వయం 21-11, 21-17తో అనతోలి యార్ట్‌సెవ్-ఎవగెనియా కొసెట్స్కాయా (రష్యా) జంటపై నెగ్గింది. ఆదివారం జరిగే ఫైనల్స్‌లో ఎవగెనియా కొసెట్స్కాయాతో రుత్విక శివాని; జుల్ఫాద్లి జుల్కిఫ్లి (మలేసియా)తో సిరిల్ వర్మ; ఇవనోవ్-సొరోకినా (రష్యా)లతో సిక్కి-ప్రణవ్ తలపడతారు. -
అండర్-19 విజేత సిరిల్ వర్మ
చండీగఢ్: కృష్ణ ఖేతాన్ ఆలిండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ అండర్-19 విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సిరిల్ వర్మ విజేతగా నిలిచాడు. శుక్రవారం ముగిసిన ఈ టోర్నీ ఫైనల్లో 12వ సీడ్ సిరిల్ వర్మ 21-10, 21-13 స్కోరుతో అరింతప్ దాస్ గుప్తాపై ఘన విజయం సాధించాడు. బాలికల అండర్-19 విభాగంలో ఏపీ అమ్మాయి డి. పూజకు చుక్కెదురైంది. ఫైనల్లో టాప్ సీడ్ రేవతి దేవస్థలే 21-16, 21-15తో పూజను ఓడించింది. అండర్-17 విభాగంలో రాష్ట్ర షట్లర్లు రెండు కేటగిరీల్లోనూ విజేతలుగా నిలిచారు. హోరాహోరీగా సాగిన బాలుర విభాగం ఫైనల్లో రాహుల్ యాదవ్ 18-21, 21-8, 21-16 తేడాతో ఏపీకే చెందిన రెండో సీడ్ ఎం. కనిష్క్పై గెలుపొంది టైటిల్ నెగ్గాడు. బాలికల ఫైనల్లో ఐదో సీడ్ వృషాలి 16-21, 21-14, 21-17 స్కోరుతో నాలుగో సీడ్ మహిమా అగర్వాల్‌పై విజయం సాధించి టైటిల్ సొంతం చేసుకుంది. డబుల్స్ ఫలితాలు... అండర్-17 బాలుర డబుల్స్‌లో జి.కృష్ణ ప్రసాద్-సాత్విక్...బాలికల డబుల్స్‌లో కె.వైష్ణవి-సోనికా సాయి విజేతలుగా నిలిచారు. అండర్-19 బాలుర డబుల్స్‌లో విఘ్నేశ్ -గంగాధర రావు...బాలికల డబుల్స్‌లో పూజ-నింగ్షీ బ్లోక్ టైటిల్ నెగ్గారు. అండర్-19 మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్ కపూర్-డి. పూజ జోడి విజేతగా నిలిచింది. -
ప్రిక్వార్టర్స్‌లో సిరిల్, రాహుల్
సాక్షి, హైదరాబాద్: జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ కుర్రాళ్లు సిరిల్ వర్మ, రాహుల్ యాదవ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. చండీగఢ్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో సోమవారం జరిగిన బాలుర సింగిల్స్ అండర్-17 మూడో రౌండ్లో రెండో సీడ్ రాహుల్ 21-8, 21-16తో హర్ష్ జగ్ధనే (మహారాష్ట్ర)పై, ఐదో సీడ్ సిరిల్ 15-21, 21-10, 21-15తో సిద్ధార్థ్ ప్రతాప్ సింగ్ (చండీగఢ్)పై గెలుపొందారు. ఆరో సీడ్ కనిష్క్ 21-12, 21-11తో ధర్మశేఖరన్ (తమిళనాడు)ను కంగుతినిపించగా, చంద్రకుమార్ 21-15, 15-21, 21-10తో 11వ సీడ్ బొధిత్ జోషి (ఉత్తరాఖండ్)కి షాకిచ్చాడు. బాలికల విభాగంలో పదో సీడ్ వృశాలి, రుత్విక శివాని ప్రిక్వార్టర్స్‌కు అర్హత పొందారు. వృశాలి 21-6, 21-5తో నికిత సింగ్ (జార్ఖండ్)పై, రెండో సీడ్ రుత్విక 21-1, 21-5తో జాస్మిన్ సాహు (ఒరిస్సా)పై విజయం సాధించారు. ఇతర ఫలితాలు అండర్-19 బాలుర సింగిల్స్: కనిష్క్ 13-21, 21-18, 14-21తో హర్షిల్ డాని (ఎయిరిండియా) చేతిలో, ఉపేంద్ర 17-21, 14-21తో అన్సల్ యాదవ్ (ఉత్తరప్రదేశ్) చేతిలో ఓడారు. బాలికలు: రుత్విక శివాని 21-6, 21-8తో హర్షిత చాలిహ (అస్సాం)పై, శ్రీకృష్ణప్రియా 21-8, 21-9 స్నేహన్ క్రిస్టియన్ (గుజరాత్)పై గెలువగా, వృశాలి 15-21, 17-21తో శ్రీయాన్షి పరదేశి (ఎయిరిండియా) చేతిలో ఓడింది. -
సిరిల్ వర్మ సంచలనం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నుంచి మరో యువతార అంతర్జాతీయ బ్యాడ్మింటన్ వేదికపై తళుక్కుమన్నాడు. 14 ఏళ్ల తెలుగు కుర్రాడు అల్లూరి శ్రీసాయి (ఎ.ఎస్.ఎస్) సిరిల్ వర్మ ఆసియా జూనియర్ చాంపియన్‌గా అవతరించాడు. ఇండోనేసియాలో ఆదివారం ముగిసిన ఆసియా యూత్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సిరిల్ వర్మ అండర్-15 బాలుర సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. ఫైనల్లో సిరిల్ 21-11, 21-17తో గజపుత్ర (ఇండోనేసియా)ను ఓడించాడు. ఈ క్రమంలో అతను ఆసియా జూనియర్ సింగిల్స్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. 2012లో పి.వి.సింధు ఆసియా జూనియర్ బాలికల విభాగంలో చాంపియన్‌గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది. ఇటీవల ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) షటిల్ ఎక్స్‌ప్రెస్ టోర్నమెంట్లోనూ విజేతగా నిలిచిన సిరిల్ ఆసియా చాంపియన్‌షిప్‌లో స్థిరమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కేవలం ఒక్క గేమ్‌ను మాత్రమే తన ప్రత్యర్థులకు కోల్పోయాడు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సిరిల్ ప్రస్తుతం అండర్-15 ర్యాంకింగ్స్‌లో భారత నంబర్‌వన్‌గా ఉన్నాడు. ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లోనే భారత్‌కు మరో టైటిల్ లభించింది. అండర్-17 బాలుర డబుల్స్ విభాగం ఫైనల్లో అర్జున్ (కేరళ)-చిరాగ్ శెట్టి (మహారాష్ట్ర) జోడి 21-16, 21-15తో కాంతాపోన్ వాంగ్‌చరోయెన్-మెక్ నారోన్గ్రిత్ (థాయ్‌లాండ్) జంటపై నెగ్గి టైటిల్ సాధించింది. అండర్-17 బాలుర సింగిల్స్ సెమీఫైనల్లో ఓడిపోయిన డానియల్ ఫరీద్... అండర్-15 మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్స్‌లో ఓడిన కృష్ణ ప్రసాద్-శ్రేయా జోడిలకు కాంస్య పతకాలు లభించాయి. ఓవరాల్‌గా భారత్ నాలుగు పతకాలతో ఈ పోటీల చరిత్రలో తమ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేసింది. స్కూల్ విజయాలనుంచి.. సిరిల్ వర్మ తండ్రి వెంకట విజయరామరాజు జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ ప్లేయర్. స్పోర్ట్స్ కోటాలోనే ఆయన ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగం పొందారు. తాము నివాసం ఉంటున్న బీహెచ్ఈఎల్ ప్రాంతంలో వివిధ క్రీడా పోటీలను చూసి సిరిల్ ఆటలపై ఆసక్తి పెంచుకున్నాడు. బ్యాడ్మింటన్‌పై సిరిల్ ప్రత్యేక ఇష్టాన్ని గుర్తించిన తండ్రి గచ్చిబౌలిలోని గోపీచంద్ అకాడమీలో చేర్పించి ప్రోత్సహించారు. గత ఆరేళ్లుగా అతను అక్కడే శిక్షణ పొందుతున్నాడు. జాతీయ అండర్-17లో కాంస్యం నెగ్గి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు. గ్లెన్డేల్ అకాడమీ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇతను గత నాలుగేళ్లుగా జాతీయ స్థాయి సీబీఎస్ఈ స్కూల్స్ చాంపియన్‌గా నిలుస్తున్నాడు. ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో 2011లో ప్రి క్వార్టర్స్‌లో, 2012లో క్వార్టర్ ఫైనల్స్‌లో ఓడిపోయిన సిరిల్ ఈసారి విజేతగా నిలవడం విశేషం. ‘అంతర్జాతీయ స్థాయిలో మా అబ్బాయి తొలి టైటిల్ నెగ్గడం ఆనందంగా ఉంది. ఇది అతడి కెరీర్లో కావాల్సిన ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఆటలో తీర్చిదిద్దిన గోపీ అకాడమీకే ఆ క్రెడిట్ దక్కుతుంది. ఇప్పుడిప్పుడే బ్యాడ్మింటన్‌లో ఎదుగుతున్న సిరిల్, భవిష్యత్తులో మరిన్ని పెద్ద స్థాయి విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాం.’ -‘సాక్షి’తో సిరిల్ తల్లిదండ్రులు విజయరామరాజు, సుశీల -
సెమీస్‌లో సిరిల్ వర్మ
సాక్షి, హైదరాబాద్: ఆసియా యూత్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. అండర్-15 బాలుర సింగిల్స్ విభాగంలో సిరిల్ వర్మ సెమీఫైనల్లోకి దూసుకెళ్లగా... అండర్-17 బాలికల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ రుత్విక శివాని క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలైంది. ఇండోనేసియాలో జరుగుతున్న ఈ పోటీల్లో శుక్రవారం జరిగిన అండర్-15 సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సిరిల్ వర్మ 21-13, 21-15తో ఎంగర్ పక్సీ (ఇండోనేసియా)పై గెలుపొందాడు. మరోవైపు రుత్విక శివాని 17-21, 17-21తో ఐదో సీడ్ కటెతోంగ్ సుపనిద (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి చవిచూసింది. అండర్-15 మిక్స్డ్ డబుల్స్ విభాగంలో కృష్ణ ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)-శ్రేయా బోస్ (కేరళ) ద్వయం సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. క్వార్టర్ ఫైనల్లో భారత జంట 23-25, 23-21, 21-17తో టాప్ సీడ్ కితా చికుగో-నగీసా యురా (జపాన్) జోడిని బోల్తా కొట్టించింది. అయితే మరో క్వార్టర్ ఫైనల్లో సాయిరాజ్ సాత్విక్ (ఆంధ్రప్రదేశ్)-కల్పితా సావంత్ (మహారాష్ట్ర) జోడి 15-21, 14-21తో కస్తూరో పుత్రా-మెంతారి ఫితా (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది.