సాక్షి, హైదరాబాద్: అనంత్ బజాజ్ స్మారక ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో తెలంగాణ క్రీడాకారులు చిట్టబోయిన రాహుల్ యాదవ్, సిరిల్ వర్మ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రాహుల్ యాదవ్ 21–13, 23–21తో ధ్రువ్ రావత్ (ఉత్తరాఖండ్)పై, సిరిల్ వర్మ 21–11, 21–16తో చిరాగ్ సేన్ (ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా–ఏఏఐ)పై విజయం సాధించారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో రాహుల్ యాదవ్ 21–13, 21–16తో సిద్ధార్థ్ ప్రతాప్ సింగ్ (ఛత్తీస్‌గఢ్)పై, సిరిల్ వర్మ 23–21, 21–16తో అమన్ కుమార్ (హరియాణా)పై గెలిచారు. తెలంగాణకే చెందిన పుల్లెల సాయివిష్ణు, గోపాలకృష్ణారెడ్డి, తరుణ్ రెడ్డి, ఆదిత్య గుప్తా, ఆదిత్య బాపినీడు తొలి రౌండ్‌లో ఓడిపోగా... అనికేత్ రెడ్డి, గంధం ప్రణవ్ రావు, కిరణ్‌కుమార్ రెండో రౌండ్‌లో ఓటమి పాలయ్యారు.
సెమీస్‌లో గాయత్రి
మహిళల సింగిల్స్ విభాగంలో పుల్లెల గాయత్రి (తెలంగాణ) సెమీఫైనల్లోకి ప్రవేశించింది. క్వార్టర్ ఫైనల్లో 13వ సీడ్ గాయత్రి 16–21, 21–13, 21–15తో నాలుగో సీడ్ ఆకర్షి కశ్యప్ (ఏఏఐ)పై సంచలన విజయం సాధించింది. నేడు జరిగే సెమీఫైనల్లో రీతూపర్ణ దాస్ (పెట్రోలియం)తో గాయత్రి ఆడుతుంది. ఇతర క్వార్టర్ ఫైనల్స్‌లో శిఖా గౌతమ్ 21–15, 8–5తో అష్మిత చాలిహా (అస్సోం–రిటైర్డ్ హర్ట్)పై, తన్వీ లాడ్ 21–23, 21–13, 21–11తో రియా ముఖర్జీపై, రీతూపర్ణ దాస్ 21–19, 21–6తో మోపాటి కెయూర (తెలంగాణ)పై గెలిచారు. తెలంగాణకే చెందిన ప్రాషి జోషి, సామియా ఇమాద్ ఫారూఖీ, మేఘన రెడ్డి రెండో రౌండ్‌లో ఓడిపోయారు. ఆర్‌బీఐకి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగమ్మాయి శ్రీకృష్ణప్రియ రెండో రౌండ్‌లో 17–21, 10–21తో ఆకర్షి కశ్యప్ చేతిలో ఓడిపోయింది. పురుషుల డబుల్స్‌లో సాయి రోహిత్–ఆకాశ్ (తెలంగాణ); పొదిలె శ్రీకృష్ణ సాయికుమార్–షేక్ గౌస్ (ఆంధ్రప్రదేశ్) జోడీలు క్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment