భారత్ ప్రాక్టీస్ మొదలు...
నెట్స్‌లో చెమటోడ్చిన ఆటగాళ్లు
కొలంబో : మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం శ్రీలంకకు వచ్చిన భారత జట్టు మంగళవారం ప్రాక్టీస్ మొదలుపెట్టింది. 15 మంది ఆటగాళ్లు సహాయక సిబ్బంది సమక్షంలో నెట్స్‌లో చెమటోడ్చారు. ముందుగా ధావన్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఆ తర్వాత కోహ్లి, విజయ్ ఆడారు.
అధిక ఒత్తిడి లేదు: విజయ్
లంకతో సిరీస్‌లో కెప్టెన్ కోహ్లి ఐదుగురు బౌలర్ల వ్యూహాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో... బ్యాట్స్‌మెన్‌పై ఎలాంటి అధిక ఒత్తిడి లేదని ఓపెనర్ మురళీ విజయ్ అన్నాడు. ‘ఆరుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ ఆడాలన్న డిమాండేమీ లేదు. ఆడినా పెద్దగా భారం పడదు. వీళ్లలో ఒక్కరు కుదురుకున్నా జట్టుకు భారీ స్కోరు అందించడం ఖాయం. చాలాసార్లు ఇలా జరి గింది కూడా. అయితే బ్యాట్స్‌మెన్‌కు ఇది సవాలే. మ్యాచ్ మన భుజాలపై ఉండటం మంచి బాధ్యతే. అయితే మ్యాచ్‌లో ఆధిపత్యం చెలాయించాలంటే మాత్రం సమష్టిగా రాణించాలి. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలకు కట్టుబడి ఆడాలి’ అని విజయ్ పేర్కొన్నాడు.
ఓపెనింగ్ కోసం పోటీ ఉండటం మంచిదేనన్నాడు. లంక జట్టులో యువ ఆటగాళ్లకు కొదవలేదన్నాడు. ‘మ్యాథ్యూస్, తిరిమన్నేలాంటి యువ ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు. అయితే మా జట్టులో కూడా యువ ఆటగాళ్లు ఉన్నారు. కాబట్టి ఈ సిరీస్‌లో గట్టిపోటీ తప్పుదు. రెండో టెస్టు తర్వాత సీనియర్ ఆటగాడు సంగక్కర రిటైర్ అవుతున్నాడు. అప్పుడు లంక జట్టులో సీనియర్లు తక్కువగా ఉం టారు. కాబట్టి తర్వాతి మ్యాచ్‌లో భారత్‌దే పైచేయి అవుతుంది. హోరాహోరీగా సాగిన పాక్, లంక సిరీస్ మాదిరిగానే ఇది కూడా జరుగుతుందని భావిస్తున్నాం’ అని ఈ చెన్నై బ్యాట్స్‌మన్ వెల్లడించాడు. ప్రస్తుతం భారత టెస్టు క్రికెట్ సంధి దశలో ఉందని చెప్పిన విజయ్... కోహ్లి నేతృత్వంలోని యువ జట్టు బాగా రాణిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.