
ఆత్మవిశ్వాసం పెరిగిందా!
ఒక లాంఛనం ముగిసింది...సచిన్ వీడ్కోలు సాకుతో ఒక బలహీన జట్టును ఆహ్వానించి నిర్వహించిన బలవంతపు పర్యటనలో భారత్ ప్రత్యర్థిని చిత్తు చేసింది.
సాక్షి క్రీడా విభాగం
ఒక లాంఛనం ముగిసింది...సచిన్ వీడ్కోలు సాకుతో ఒక బలహీన జట్టును ఆహ్వానించి నిర్వహించిన బలవంతపు పర్యటనలో భారత్ ప్రత్యర్థిని చిత్తు చేసింది. క్రికెటేతర కారణాలతో దక్షిణాఫ్రికా సవాల్‌ను సగానికి కుదించి నిర్వహించిన ఈ టెస్టు, వన్డే సిరీస్‌లతో టీమిండియా సాధించింది ఏమైనా ఉందా...ఈ విజయాల ద్వారా జట్టుకు కొత్తగా లభించిన ప్రయోజనం ఏమిటి...ఇవి జట్టు ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాయా!
మెరిసిన రోహిత్, షమీ...
ఏడాది వ్యవధిలో టెస్టు క్రికెట్‌లో ముగ్గురు దిగ్గజాలు రిటైరైన నేపథ్యంలో ఆయా స్థానాలు భర్తీ చేయగలిగే బ్యాట్స్‌మెన్ కోసం అందరూ ఎదురు చూశారు. పుజారా, కోహ్లిల తర్వాత ఇప్పుడు రోహిత్ శర్మ మూడోవాడిగా నిలిచాడు. వన్డేల్లో అద్భుతమైన ఫామ్‌తో టెస్టుల్లో స్థానం దక్కించుకున్న అతను వరుస సెంచరీలతో చెలరేగాడు.
టెక్నిక్ పరంగా దక్షిణాఫ్రికా వికెట్లపై ఎంత వరకు నిలబడగలడో అప్పుడే చెప్పలేకపోయినా...ఆకాశం తాకేలా ఆత్మవిశ్వాసంతో ఉన్న అతని నుంచి మెరుగైన ఇన్నింగ్స్‌లు ఆశించవచ్చు. ఈ సిరీస్‌లో మరో ప్రధాన ప్రయోజనం మొహమ్మద్ షమీ రూపంలో జట్టుకు లభించింది. భారత్‌లాంటి వికెట్లపైనే రివర్స్ స్వింగ్‌తో ఫలితం రాబట్టిన అతను దక్షిణాఫ్రికా బౌన్సీ వికెట్లపై ఖచ్చితంగా ప్రభావం చూపించగలడు. అసలైన సఫారీ పర్యటనకు ముందు షమీ వెలుగులోకి రావడం భారత జట్టు అదృష్టం.
జహీర్‌లాంటి సీనియర్ మార్గదర్శకత్వం అతడితో పాటు జట్టుకు ప్రయోజనం చేకూర్చగలదు. ముంబై టెస్టులో సెంచరీ పుజారా సామర్థ్యాన్ని చూపించింది. వచ్చే సిరీస్‌లో అందరికంటే ఎక్కువగా ఆధారపడదగ్గ బ్యాట్స్‌మన్ అయిన ఈ సౌరాష్ట్ర ఆటగాడు చక్కటి ఫామ్‌లో ఉన్నాడు. వన్డేల్లో రారాజుగా ఉన్నా, టెస్టుల్లో కోహ్లి మరింత మెరుగు పడాల్సి ఉందని ఈ సిరీస్ చూపించింది. గంభీర్‌ను కాదని ఓపెనర్‌గా అవకాశం నిలబెట్టుకున్న విజయ్ మాత్రం ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. విండీస్‌లాంటి జట్టుపై సొంతగడ్డపై ఇలా ఆడితే దక్షిణాఫ్రికా అరివీర పేస్‌ను ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. లేదంటే అజింక్య రహానే అవకాశం అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
విరాట్‌దే జోరు...
వన్డేల్లో నంబర్‌వన్‌గా ఉన్న భారత జట్టు ఊహించినట్లుగానే సిరీస్ గెల్చుకుంది. అయితే విశాఖలో వెస్టిండీస్ గెలవడం భారత్ వంద శాతం అజేయమైందేమీ కాదని నిరూపించింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆకట్టుకోకపోయినా ధావన్ చివరకు సెంచరీతో మెరిశాడు. రోహిత్ మాత్రం మొదటి మ్యాచ్ బాగా ఆడి, ఆ తర్వాత విఫలమయ్యాడు. కోహ్లి ఎప్పటిలాగే తనదైన శైలిలో నిలకడగా ఆడి ఆకట్టుకున్నాడు.
కెప్టెన్ ధోని మూడు మ్యాచ్‌ల్లోనూ నాటౌట్‌గా నిలిచి తన స్థాయిని ప్రదర్శించాడు. అయితే రైనా వరుసగా విఫలం కావడం, జడేజా బ్యాటింగ్ చేయడం పూర్తిగా మరచిపోవడం భారత్‌కు సమస్యే. విండీస్‌లాంటి బలహీన జట్టుపై కూడా ఇలా ఆడితే షార్ట్ పిచ్ బంతులను రైనా ఎదుర్కోగలడా! ఎట్టకేలకు యువరాజ్ సింగ్ అర్ధ సెంచరీ సాధించడం కీలక సిరీస్‌కు ముందు శుభవార్తగా చెప్పవచ్చు.
అయితే ఆసీస్‌తో విఫలమైన ఇషాంత్, రంజీల్లో రాణించలేకపోయిన ఉమేశ్ ఏ మాత్రం ప్రభావం చూపిస్తారన్నది చెప్పలేం. వాస్తవానికి భారత వన్డే జట్టు ఫామ్, బలం చూస్తే దక్షిణాఫ్రికాలో కూడా పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రస్తుతం అక్కడే ఉన్న పాకిస్థాన్ కూడా మ్యాచ్ నెగ్గి ఓ రకంగా భారత్‌కు దారి చూపించింది. భారత్‌లో విండీస్ పర్యటన అద్భుతమైన సన్నాహకంగా చెప్పలేకపోయినా...ఏదైనా టూర్‌కు ముందు విజేతగా నిలవడం ఆత్మ విశ్వాసాన్ని పెంచేదే. ఆ రకంగా చూస్తేనే ఈ సిరీస్ మనకు పనికొచ్చింది.