సౌతాఫ్రికా విధ్వంసకర ఆటగాడు, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆ జట్టు వికెట్‌కీపర్ హెన్రిచ్ క్లాసెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. తన రిటైర్మెంట్ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపాడు.
టెస్ట్‌ల నుంచి తప్పుకునే విషయమై ఆలోచిస్తూ పలు నిద్ర లేని రాత్రులు గడిపానని, తన నిర్ణయం సరైందా కాదా అని చాలా మదన పడ్డానని, అంతిమంగా టెస్ట్‌లకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకున్నానని క్లాసెన్ ఓ ప్టేట్‌మెంట్ ద్వారా వెల్లడించాడు. మొత్తానికి తాను తీసుకున్న నిర్ణయం చాలా కఠినమైందని, తన ఫేవరెట్ ఫార్మాట్ నుంచి అర్ధంతరంగా తప్పుకుంటున్నందుకు చాలా బాధగా ఉందని తెలిపాడు.
32 ఏళ్ల క్లాసెన్ సౌతాఫ్రికా తరఫున కేవలం నాలుగు టెస్ట్‌లు మాత్రమే ఆడాడు. 2019లో టెస్ట్ ఫార్మాట్‌లోకి అడుగుపెట్టినప్పటికీ.. డికాక్ అప్పటికే జట్టులో స్థిరపడిపోయినందున క్లాసెన్‌కు సరైన అవకాశాలు రాలేదు. ఇప్పుడు కూడా సౌతాఫ్రికా సెలెక్టర్లు టెస్ట్ జట్టులోకి క్లాసెన్‌ను తీసుకోవట్లేదు. విధ్వంసకర ఆటగాడు కావడంతో క్లాసెన్‌పై లిమిటెడ్ ఓవర్స్ ప్లేయర్‌గా ముద్ర పడింది. అందుకే అతనికి సరైన అవకాశాలు రాలేదు.
పైగా అతనికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 4 టెస్ట్‌ల్లో క్లాసెన్ కేవలం 104 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే 10 క్యాచ్‌లు, 2 స్టంపౌట్లు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో క్లాసెన్‌కు మంచి రికార్డే ఉంది. అతను 85 మ్యాచ్‌ల్లో 46.09 సగటున పరుగులు చేశాడు. వన్డే, టీ20ల్లో క్లాసెన్‌కు ఘనమైన రికార్డు ఉంది. 54 వన్డేల్లో 4 సెంచరీలు, 6 అర్ధసెంచరీల సాయంతో 40.1 సగటున 1723 పరుగులు చేసిన క్లాసెన్.. 43 టీ20ల్లో 4 అర్ధసెంచరీల సాయంతో 147.6 స్ట్రయిక్‌రేట్‌తో 722 పరుగులు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment