షార్జా: ఆసియా కప్ జూనియర్ భారత్ ఆటగాళ్లు మెరిశారు. తన జైత్రయాత్రను కరడవరకూ కొనసాగిస్తూ ఆసియా కప్ అండర్-19 విజేతగా అవతరించింది. పాకిస్తాన్ తో శనివారమిక్కడ జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత్ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. భారత్ విసిరిన 315 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ ఆటగాళ్లు చతికిలబడ్డారు. భారత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాకిస్తానీ క్రికెటర్లు నిర్ణీత 50 ఓవర్లలో 274 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైయ్యారు.
అంతకుముందు టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ఆరంబించిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసి ప్రత్యర్థికి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ ఆటగాళ్లలో బైన్స్ (47) పరుగులతో శుభారంభానివ్వగా, విజయ్ జోల్ (100), సంజూ శ్యాంసన్ (100) పరుగులతో రాణించడంతో భారత్ మూడొందల పరుగుల మైలురాయిని దాటింది.