
క్వార్టర్స్ లో భారత్
అండర్-19 ప్రపంచకప్‌లో దూసుకెళుతున్న యువ భారత్ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది.
♦ అండర్-19 ప్రపంచకప్
♦ న్యూజిలాండ్‌పై విజయం
మిర్‌పూర్: అండర్-19 ప్రపంచకప్‌లో దూసుకెళుతున్న యువ భారత్ క్వార్టర్ ఫైనల్లో ప్రవేశించింది. సమష్టి కృషితో రాణించిన కుర్రాళ్లు శనివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. మొదట సర్ఫరాజ్ ఖాన్ (80 బంతుల్లో 74; 9 ఫోర్లు), రిషబ్ పంత్ (83 బంతుల్లో 57; 7 ఫోర్లు; 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగగా బౌలింగ్‌లో మహిపాల్ లొమ్రోర్ (5/47), మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవేశ్ ఖాన్ (4/32) కివీస్ ఇన్నింగ్స్‌ను పేకమేడలా కూల్చారు. దీంతో భారత్‌కు 120 పరుగుల తేడాతో భారీ విజయం దక్కింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 258 పరుగులు చేసింది.
కెప్టెన్ ఇషాన్ కిషన్ (4) మరోసారి విఫలం కావడంతో పాటు 19 పరుగులకే జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సర్ఫరాజ్ ఖాన్.. రిషబ్‌తో కలిసి మూడో వికెట్‌కు 89 పరుగులు, అర్మాన్ జాఫర్ (49 బంతుల్లో 46; 2 ఫోర్లు)తో కలిసి నాలుగో వికెట్‌కు 48 పరుగులు జోడించాడు. చివర్లో లొమ్రోర్ (42 బంతుల్లో 45; 3 ఫోర్లు; 1 సిక్స్) వేగంగా ఆడాడు. గిబ్సన్‌కు మూడు.. స్మిత్, రచిన్ రవీంద్రలకు రెండేసి వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ను భారత్ బౌలర్లు బెంబేలెత్తించడంతో 31.3 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. 16 పరుగులకే తొలి నాలుగు వికెట్లను కూల్చిన అవేశ్ కివీస్‌ను చావుదెబ్బ తీశాడు.
ఆ తర్వాత మిగతా బ్యాట్స్‌మెన్ పని లొమ్రోర్ చూసుకోడంతో కివీస్ కోలుకోలేకపోయింది. లియోపార్డ్ (40 బంతుల్లో 40; 3 ఫోర్లు; 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. వరుసగా రెండు విజయాలతో భారత్ క్వార్టర్స్‌కు చేరింది. లీగ్‌లో ఆఖరి మ్యాచ్‌లో సోమవారం నేపాల్‌తో తలపడుతుంది.
క్వార్టర్స్‌లో నేపాల్, పాక్, లంక
సంచలన ఆటతీరుతో జోరు చూపిస్తున్న నేపాల్ జట్టు అండర్-19 ప్రపంచకప్‌లో క్వార్టర్స్‌కు చేరింది. శనివారం ఐర్లాండ్‌పై ఈ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో నెగ్గింది. నేపాల్ బౌలర్ సందీప్ లమిచ్చానే టోర్నీలో తొలి హ్యాట్రిక్ నమోదు చేయడంతో పాటు మొత్తం ఐదు వికెట్లు తీశాడు. శ్రీలంక జట్టు 33 పరుగుల తేడాతో అఫ్ఘాన్‌పై.. పాక్ ఏడు వికెట్ల తేడాతో కెనడాపై గెలిచి క్వార్టర్స్‌కు చేరాయి.