
విండీస్ 48/4.. విజయానికి వర్షం అడ్డంకి
► చేతులేత్తేసిన వెస్టిండీస్ టాప్ ఆర్డర్
► ఇంకా 256 పరుగుల ఆధిక్యంలో కోహ్లి సేన
► కీలకంగా మారిన ఐదో రోజు మ్యాచ్
కింగ్‌స్టన్: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం దిశగా పయనిస్తోంది. మంగళవారం కూడా వర్షం కారణంగా రెండు గంటలు ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమైంది. దీంతో నాలుగో రోజు కేవలం 15.5 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. లంచ్ విరామానికి వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 15.5 ఓవర్లలో 4 వికెట్లకు 48 పరుగులు చేసింది. బ్లాక్‌వుడ్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. భారత్ 256 పరుగుల ఆధిక్యంలో ఉంది.
తీవ్ర వర్షం కారణంగా లంచ్ తర్వాత మ్యాచ్ జరగలేదు. నిరంతరాయంగా వర్షం కురుస్తుండడంతో అంపెర్లు నాలుగో రోజు ఆట నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వెస్టిండీస్‌కు భారీ ఊరట లభించింది. ఈ మ్యాచ్ ఫలితానికి ఐదో రోజు ఆట కీలకంగా మారనుంది. వరుణుడు శాంతిస్తే తప్ప భారత్‌కు విజయం ఖాయమని చెప్పాలి. గత రెండు రోజులుగా తీవ్ర వర్షం కురుస్తుండడంతో బుధవారం కూడా వర్షం పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
మంగళవారం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన వెస్టిండీస్ టాప్ ఆర్డర్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఓపెనర్లు బ్రాత్‌వైట్, చంద్రిక ఇన్నింగ్స్‌ను ఆరంభించగా... మూడో ఓవర్‌లోనే ఇషాంత్ శర్మ వెస్టిండీస్‌కు షాకిచ్చాడు. అద్భుత బౌలింగ్‌తో చంద్రికను క్లీన్‌బౌల్డ్ చేశాడు. అనంతరం బ్యాటింగ్ దిగిన బ్రావో, బ్రాత్‌వైట్ లు రెండో వికెట్‌కు 36 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినప్పటికీ భారత బౌలింగ్ ధాటికి వారి ప్రయత్నం ఫలించలేదు. మిశ్రా బౌలింగ్‌లో బ్రాత్‌వైట్(23) ఔటయ్యాడు. వెంటనే శామ్యూల్స్(0)ను షమి ఔట్ చేశాడు. దీంతో విండీస్ 41 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆదుకుంటాడనుకున్న బ్రావో(20) కూడా వెనువెంటనే షమి బౌలింగ్‌లో ఔటయ్యాడు. దీంతో 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో షమీ రెండు వికెట్లు, మిశ్రా, ఇషాంత్ శర్మ చెరో వికెట్ తీశారు. మంగళవారం వర్షం అంతరాయం లేకపోతే మ్యాచ్ విజయం భారత్ ఖాతాలో చేరేది. ఇప్పటికే నాలుగు టెస్టులు సిరీస్‌లో భారత్ తొలి మ్యాచ్‌లో విజయం సాధించి 1/0 ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 304 పరుగుల ఆధిక్యం లభించింది. భారత్ ఇన్నింగ్స్ ముగిశాక వర్షం అంతరాయం కలిగించడంతో సోమవారం వెస్టిండీస్ తమ రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించని విషయం తెలిసిందే.
స్కోరు వివరాలు
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్: 196
భారత్ తొలి ఇన్నింగ్స్: రాహుల్ (సి) డౌరిచ్ (బి) గాబ్రియల్ 158; ధావన్ (సి) బ్రావో (బి) చేజ్ 27; పుజారా (రనౌట్) 46; కోహ్లి (సి) చంద్రిక (బి) చేజ్ 44; రహానే నాటౌట్ 108; అశ్విన్ ఎల్బీడబ్ల్యు (బి) బిషూ 3; సాహా ఎల్బీడబ్ల్యు (బి) హోల్డర్ 47; మిశ్రా (సి) చంద్రిక (బి) చేజ్ 21; షమీ (బి) చేజ్ 0; ఉమేశ్‌యాదవ్ (సి) హోల్డర్ (బి) చేజ్ 19; ఎక్స్‌ట్రాలు 27; మొత్తం (171.1 ఓవర్లలో 9 వికెట్లకు) 500 డిక్లేర్డ్.
వికెట్ల పతనం: 187, 2-208, 3-277, 4-310, 5-327, 6-425, 7-458, 8-458, 9-500.
బౌలింగ్: గాబ్రియల్ 28-8-62-1; కమిన్స్ 26.4-4-87-0; హోల్డర్ 34.2-12-72-1; చేజ్ 36.1-4-121-5; బిషూ 35-5-107-1; బ్రాత్‌వైట్ 11-0-40-0.
వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్: బ్రాత్‌వైట్ (సి) రాహుల్ (బి) మిశ్రా 23; చంద్రిక (బి) ఇషాంత్ 1; బ్రేవో (సి) రాహుల్ (బి) షమీ 20; శామ్యూల్స్ (బి) షమీ 0; బ్లాక్‌వుడ్ బ్యాటింగ్ 3; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (15.5 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 48.
వికెట్ల పతనం: 1-5, 2-41, 3-41; 4-48.
బౌలింగ్: ఇషాంత్ 6-0-19-1; షమీ 7.5-2-25-2; మిశ్రా 2-1-4-1.