వరల్డ్ కప్ లో యువ భారత్ జోరు
మిర్పూర్: అండర్-19 వరల్డ్ కప్ టోర్నీలో యువ భారత్ జోరు కొనసాగిస్తోంది. గ్రూప్-డిలో భాగంగా శనివారం న్యూజిలాండ్ తో జరిగిన వన్డేలో యువ భారత్ 120 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ లో కుమ్మేసిన యువ భారత్.. ఆ తరువాత కివీస్ ను పేక మేడలా కూల్చేసింది. దీంతో యువ భారత్ వరుసగా రెండో విజయాన్ని సాధించి క్వార్టర్స్ బెర్తును ఖాయం చేసుకుంది.
భారత్ విసిరిన 259 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 31.3 ఓవర్లలో 138 పరుగులకే పరిమితమై ఘోర ఓటమి చెందింది. కివీస్ ఆటగాళ్లలో లియోపార్డ్ (40), అలెన్(29), పారిక్(26), స్కాట్(29)లు మాత్రమే ఫర్వాలేదనిపించగా, మిగతా ఆటగాళ్లు ఘోరంగా విఫలం చెందారు. న్యూజిలాండ్ ఆటగాళ్లలో ఏడుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో ఓటమి తప్పలేదు. భారత బౌలర్లలో లామ్రోర్ ఐదు, అవిష్ ఖాన్ నాలుగు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించగా, అన్సారీకి ఒక వికెట్ దక్కింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ 50.0 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. భారత్ ఆటగాళ్లలో కెప్టెన్ ఇషాన్ కిషన్(4), రికీ భూయి(1)మరోసారి నిరాశపరిచినప్పటికీ, రిషబ్ పాంట్(57), సర్ఫరాజ్ ఖాన్(74), ఆర్మాన్ జాఫర్(46),లామ్రోర్(45) లు రాణించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది.