
మరోసారి అదరగొట్టిన భారత్
కోల్ కతా: అండర్-19 ముక్కోణపు సిరీస్ లో భారత కుర్రాళ్లు మరోసారి అదరగొట్టారు. శనివారం ఆఫ్ఘానిస్థాన్ తో జరిగిన రెండో లీగ్ మ్యాచ్ లో భారత్ 33 పరుగుల తేడాతో గెలిచి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. భారత్ విసిరిన 237 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆఫ్ఘానిస్థాన్ పోరాడి ఓడింది. ఆఫ్ఘాన్ ఆటగాళ్లలో ఓపెనర్లు హజర్ తుల్లా (21), ఇస్మాతుల్లా(25) ఫర్వాలేదనించగా, చివర్లో రషిద్ ఖాన్(43), మహ్మద్ సర్దార్(33) లు ఆకట్టుకున్నారు. కాగా, మిగతా ఆటగాళ్లు ఎవరూ రాణించకపోవడంతో ఆఫ్ఘాన్ 47.3 ఓవర్లలో 203 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. భారత బౌలర్లలో ఖలీల్ అహ్మద్ నాలుగు వికెట్లు తీయగా, ప్రమాణిక్, లామ్రోర్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి.
అంతకుముందు టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 236 పరుగులు చేసింది. భారత వికెట్ కీపర్ రిషబ్ పాంట్ (87), మహిపాల్ లామ్రోర్ (43)లు బ్యాట్ ఝుళిపించి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు. శుక్రవారం బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.