
ట్రై సిరీస్ లో భారత్ జైత్రయాత్ర
కోల్ కతా: అండర్ -19 ముక్కోణపు టోర్నీలో భారత్ తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. మంగళవారం బంగ్లాదేశ్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో భారత యువ క్రికెట్ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని నమోదుచేసుకుంది. దీంతో టోర్నీలో వరుసగా మూడో విజయాన్ని భారత్ చేజిక్కించుకుంది. బంగ్లా విసిరిన 223 పరుగుల విజయలక్ష్యాన్నిభారత్ ఇంకా ఎనిమిది బంతులుండగానే ఛేదించింది. సాధారణ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్ కు ఓపెనర్లు రిషబ్ పాంట్(51), ఇషాన్ కిషాన్(21)లు శుభారంభం అందించారు. వీరిజోడి తొలి వికెట్ కు 67 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి గెలుపుకు బాటలు వేశారు. అనంతరం విరాట్ సింగ్(21) ఫర్వాలేదనిపించగా, వాషింగ్టన్ సుందర్ (50) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. చివర్లో ఎమ్ కే లామ్రోర్(19), ఎంజే దాగర్(11)లు జట్టు విజయానికి సహకరించారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిర్ణీత 50.0 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. బంగ్లా ఆటగాళ్లలో హసన్ మీరజ్(87), సైఫ్ హసన్(33), మహ్మద్ సైఫుద్దీన్(30)లు రాణించి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడానికి సహకరించారు. శుక్రవారం బంగ్లాదేశ్ తో జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించగా, శనివారం జరిగిన రెండో లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 33 పరుగుల తేడాతో అఫ్ఘానిస్తాన్‌పై గెలిచింది. వరుస మూడు విజయాలను సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత్ ఫైనల్ కు చేరింది.