‘ఒక్కడు’ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడం... అనవసర షాట్లతో ప్రధాన వికెట్లు టపటపా కూలడం... అందివచ్చిన అనుకూలతలను కాలదన్నుకోవడం... కాస్తోకూస్తో పోరాటంతో రోజును ముగించి పరువు దక్కించుకోవడం...! దశాబ్దాలుగా విదేశాల్లో టీమిండియా తీరే ఇది. అదే పాత కథను ఆస్ట్రేలియాలో మరోసారి అచ్చుగుద్దినట్లు దించేసింది. కాకపోతే... ఈసారి కథానాయకుడు మారాడు. ఇటీవలి కాలంలో ఆ ‘ఒక్కడు’గా నిలుస్తున్న విరాట్ కోహ్లి స్థానంలోకి అద్వితీయ శతకంతో చతేశ్వర్ పుజారా వచ్చాడు. కఠిన పరిస్థితులకు ఎదురొడ్డి... ఆట ఆసాంతం తానే అయి అహో అనిపించాడు. 41/4తో ఉన్న జట్టును కష్టాల గట్టు దాటించాడు. తొలి టెస్టు మొదటి రోజే ప్రత్యర్థి పట్టు బిగించకుండా చూశాడు. మనది పైచేయి కాకున్నా... స్వల్ప స్కోరుకే పరిమితం అవకుండా కాపాడాడు.
అడిలైడ్: అనుకున్నంత సులువేం కాదని టీమిండియాకు అర్థమయ్యేలా ప్రారంభమైంది ఆస్ట్రేలియా పర్యటన. పరుగులు సులువుగా వచ్చే పిచ్‌పై కాసేపు ఓపిక పట్టలేక పోయిన బ్యాట్స్‌మెన్... ప్రత్యర్థి బౌలర్లకు వికెట్లు బహుమతిగా ఇచ్చేశారు. కానీ, చెక్కుచెదరని ఏకాగ్రత, సహనంతో ఆడిన చతేశ్వర్ పుజారా (246 బంతుల్లో 123; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కెరీర్‌లో 16వ సెంచరీతో ముప్పు తప్పించాడు. దీంతో గురువారం ఇక్కడ ప్రారంభమైన తొలి టెస్టులో భారత్ 250/9తో రోజును ముగించి ఫర్వాలేదనిపించింది. రోహిత్‌శర్మ (61 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), రిషభ్ పంత్ (38 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్), రవిచంద్రన్ అశ్విన్ (76 బంతుల్లో 25; 1 ఫోర్) పుజారాకు సహకారం అందించారు. ఏడో వికెట్‌కు పుజారా, అశ్విన్ జత చేసిన 62 పరుగులే భారత ఇన్నింగ్స్‌లో అత్యధిక భాగస్వామ్యం. లంచ్ విరామం అనంతరం కాసేపు సయమనం చూపిన రోహిత్... ఇన్నింగ్స్ గాడిన పడుతున్న దశలో ఔటయ్యాడు. ఉన్నంతసేపు ఇబ్బంది లేకుండా ఆడిన వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను లయన్ చక్కటి బంతితో ఔట్ చేశాడు. ఈ స్థితిలో పుజారా, అశ్విన్ ఆదుకున్నారు. అశ్విన్‌ను కమిన్స్, ఇషాంత్ (4)ను స్టార్క్ డగౌట్ చేర్చారు. షమీ (6 బ్యాటింగ్)తో పుజారా 9వ వికెట్‌కు 40 పరుగులు జోడించి గౌరవప్రదమైన స్కోరు అందించాడు.ఆసీస్ బౌలర్లలో కమిన్స్ (2/49), హాజల్‌వుడ్ (2/52), స్టార్క్ (2/63), లయన్ (2/83)లకు రెండేసి వికెట్లు దక్కాయి. మన ఇన్నింగ్స్ దాదాపు ముగిసినందున, శుక్రవారం కంగారూ బ్యాట్స్‌మెన్‌ను బౌలర్లు ఎంతమేరకు నిలువరిస్తారో చూడాలి.
టాప్–4 టపటపా
ఆసీస్ నాణ్యమైన బౌలింగ్‌ను ఎదుర్కొనేంత ఫామ్‌లో లేని ఓపెనర్లు కేఎల్ రాహుల్ (2), మురళీ విజయ్ (11) అందుకుతగ్గ స్కోరుకే ఔటయ్యారు. హాజల్‌వుడ్ బంతిని డ్రైవ్ చేయబోయి రాహుల్, స్టార్క్ బౌలింగ్‌ను కాచుకోలేక విజయ్ పెవిలియన్ చేరారు. కమిన్స్ ఓవర్లో గల్లీలో ఉస్మాన్ ఖాజా పట్టిన కళ్లుచెదిరే క్యాచ్ కెప్టెన్ కోహ్లి (3) ఇన్నింగ్స్ ముగించింది. లయన్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టడంతో పాటు కుదరుకున్నట్లు కనిపించిన వైస్ కెప్టెన్ అజింక్య రహానే (13) దూరంగా వెళ్తున్న బంతిని వేటాడి మూల్యం చెల్లించుకున్నాడు. వాస్తవానికి ఈ బంతులేవీ వికెట్ తీసేంత గొప్పవి కాకున్నా బ్యాట్స్‌మెన్ దృక్పథం లోపంతోనే ఔటయ్యారు. 41/4తో నిలిచిన జట్టు కనీసం వందైనా దాటుతుందా అనే అనుమానాలు తలెత్తిన ఈ స్థితిలో పుజారాకు జత కలిసిన రోహిత్ దూకుడే జవాబు అన్నట్లు కనిపించాడు. టీ మిండియా 56/4తో లంచ్‌కు వెళ్లింది.
రోహిత్.. మరీ ఇలానా?
క్రీజులో కుదురుకుని, కొన్ని పరుగులూ చేసి, బౌలర్లు కూడా ప్రభావవంతంగా లేని సమయంలో అనవసరంగా ఔటైన రోహిత్‌శర్మ... తన టెస్టు స్థాయిపై విమర్శలు కొనితెచ్చుకున్నాడు. ఆఫ్ స్పిన్ సైతం వేయగల యువ బ్యాట్స్‌మన్ హనుమ విహారిని కాదని మరీ స్థానం దక్కించుకున్న అతడు ఈసారి కొంత మెరుగ్గానే కనిపించాడు. హిట్టింగ్‌తో స్కోరు పెంచుతాడనే ఉద్దేశంలో తీసుకున్నందుకు తను న్యాయం చేస్తున్నట్లే కనిపించాడు. కమిన్స్ ఓవర్లో కళ్లుచెదిరే సిక్స్‌తో ఔరా అనిపించాడు. లయన్‌నూ అదే తరహాలో శిక్షించబోయి... లాంగాన్‌లో మార్కస్ హారిస్ పొరపాటుతో ఆరు పరుగులు పొందాడు. తనను తాను నియంత్రించుకోకుండా, మరుసటి బంతికే అదే తరహాలో భారీ షాట్‌కు యత్నించి హారిస్‌కే క్యాచ్ ఇచ్చాడు.
‘నా అత్యుత్తమ ఐదు ఇన్నింగ్స్‌లో ఇది ఒకటి. మా బ్యాట్స్‌మెన్ మరింత మెరుగ్గా ఆడి ఉంటే బాగుండేది. అయితే తొలి రెండు సెషన్లలో ఆస్ట్రేలియా చాలా బాగా బౌలింగ్ చేసింది. తేలికైన బంతులు పడే వరకు క్రీజ్‌లో ఓపిగ్గా నిలబడాలని నాకు తెలుసు. బయటికి కనిపిస్తున్న విధంగా పిచ్ బ్యాటింగ్‌కు మరీ అనుకూలంగా ఏమీ లేదు. 250 మంచి స్కోరే. ఎందుకంటే టర్న్ కూడా కనిపిస్తోంది కాబట్టి బ్యాటింగ్ సులభం కాదు. అశ్విన్ దీనిని ఉపయోగించుకోగలడు. సిక్సర్లు కొట్టడాన్ని కూడా సాధన చేస్తున్నా కాబట్టి నాకేమీ ఆశ్చర్యం అనిపించలేదు. కొన్ని సార్లు విదేశాల్లో నేను విఫలమైనా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఈ సిరీస్‌కు సరైన సన్నద్ధతతో వచ్చాను. రెండో ఇన్నింగ్స్‌లో అందరం బాగా ఆడతామనే నమ్మకముంది’
– పుజారా
Comments
Please login to add a commentAdd a comment