
గెలిస్తేనే... నిలుస్తాం!
చావో... రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో భారత జట్టు నేడు (ఆదివారం) ఇంగ్లండ్‌తో జరిగే రెండో టి20 మ్యాచ్‌లో బరిలోకి దిగబోతోంది.
ఒత్తిడిలో భారత్
• ఇంగ్లండ్‌తో నేడు రెండో టి20
• అమిత్ మిశ్రాకు చాన్స్!
ఇంగ్లండ్ జట్టుపై టెస్టులు.. వన్డేల్లో ఘనవిజయాలు సాధించి ఊపుమీదున్న భారత్‌కు పొట్టి ఫార్మాట్‌లో మాత్రం తొలిసారిగా ఝలక్ తగిలింది. తొలి టి20లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలో విఫలమై ప్రత్యర్థి ముందు తేలిపోయింది. దీంతో 15 నెలల అనంతరం భారత జట్టు తొలిసారిగా ఓ సిరీస్‌ను కోల్పోయే ప్రమాదంలో పడింది. ఏ ఫార్మాట్‌లోనైనా సొంత గడ్డపై కోహ్లి ఇప్పటిదాకా సిరీస్ కోల్పోలేదు. ఈ నేపథ్యంలో రెండో మ్యాచ్‌లో గెలిచి పోటీలో నిలుస్తారా..? లేక నాగ్‌పూర్‌లోనే సిరీస్ అప్పగిస్తారా అనేది వేచి చూడాల్సిందే!
నాగ్‌పూర్: చావో... రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో భారత జట్టు నేడు (ఆదివారం) ఇంగ్లండ్‌తో జరిగే రెండో టి20 మ్యాచ్‌లో బరిలోకి దిగబోతోంది. కాన్పూర్ మ్యాచ్‌లో పేలవ ప్రదర్శనతో పరాజయం పాలైన కోహ్లి సేన... ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పోటీలో ఉండాలంటే మాత్రం కచ్చితంగా ఈ మ్యాచ్‌ను నెగ్గాల్సిందే. లేకుంటే సిరీస్ కోల్పోతుంది. భారత్ చివరిసారిగా సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో 2–3 తేడాతో వన్డే సిరీస్ కోల్పోయింది. దీంతో కీలకమైన నాగ్‌పూర్ టి20కి కెప్టెన్ కోహ్లి, కోచ్ అనిల్ కుంబ్లే ఓసారి తమ జట్టు కూర్పును పునఃపరిశీలించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
మామూలుగా డెత్ ఓవర్లలో తమ బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చే పరిస్థితి ఉండగా గత మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ కూడా ఇబ్బంది పడ్డారు. ఇంగ్లండ్ చాలా తెలివైన బౌలింగ్‌తో 147 పరుగులకే కట్టడి చేయగలిగింది. ఇక ఈ మైదానంలో భారత్ ఆడిన రెండు టి20ల్లోనూ ఓడిపోవడం కలవరపరిచే అంశం. మరోవైపు ఇంగ్లండ్ జట్టు తమ భారత పర్యటనలో తొలిసారిగా ఆధిపత్యం చూపిస్తోంది. ఐదు టెస్టులు.. ఐదు వన్డేల్లో ఫలితాలు తీవ్రంగా నిరాశపరిచినా టి20లో మాత్రం కొత్త లుక్‌తో బరిలోకి దిగి ఫలితాన్ని రాబట్టింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో వారి పేసర్లు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. ఇదే జోష్‌తో సిరీస్ కొట్టేయాలని మోర్గాన్ సేన భావిస్తోంది.
ఓపెనింగ్ సమస్య
ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులు, వన్డేలతో పాటు ఇప్పుడు టి20ల్లోనూ భారత జట్టును పీడిస్తున్న సమస్య ఓపెనింగ్. ఏ ఫార్మాట్‌లోనూ జట్టుకు ఓపెనర్ల నుంచి శుభారంభం అందలేదు. కేఎల్ రాహుల్ దారుణ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. అతడి స్థానంలో యువ ఆటగాడు రిషభ్ పంత్‌ను తీసుకున్నా ఆశ్చర్యం లేదు. కోహ్లి, ధోని, రైనా రాణించినా మిగిలిన వారి నుంచి సహకారం కరువైంది. బౌలింగ్‌లో పర్వేజ్ రసూల్ స్థానంలో స్పిన్నర్ అమిత్ మిశ్రాను, బుమ్రా స్థానంలో డెత్ ఓవర్లలో చెలరేగే పేసర్ భువనేశ్వర్ పేర్లను కూడా పరిశీలించే అవకాశం లేకపోలేదు. చాహల్ ఒక్కడే తొలి టి20లో రాణించాడు.
ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్
తొలి మ్యాచ్‌లో అన్ని విభాగాల్లో రాణించడం ఇంగ్లండ్‌లో ఫుల్ జోష్‌ను నింపింది. రాయ్, బిల్లింగ్, రూట్, మోర్గాన్, స్టోక్స్ అంతా ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసొచ్చే అంశం. వచ్చీ రాగానే పేసర్ జోర్డాన్ సత్తా చూపించాడు. ఈనేపథ్యంలో ఈ జట్టు ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగనుంది.
జట్లు: (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), రాహుల్/పంత్, రైనా, యువరాజ్, ధోని, పాండే, పాండ్యా, రసూల్/మిశ్రా, చాహల్, భువనేశ్వర్/నెహ్రా/బుమ్రా.
ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), రాయ్, బిల్లింగ్స్, రూట్, స్టోక్స్, బట్లర్, అలీ, జోర్డాన్, ప్లంకెట్, రషీద్, మిల్స్.
• స్టార్ స్పోర్ట్స్–1లో రాత్రి 7.00 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం