
సరిగ్గా రెండేళ్ల క్రితం దక్షిణాఫ్రికా జట్టు భారత్‌లోనే 3–2తో వన్డే సిరీస్ గెలుచుకుంది. ఆ తర్వాత సొంతగడ్డపై ఏ సిరీస్‌లో కూడా టీమిండియా రెండు మ్యాచ్‌లు ఓడిపోలేదు. అయితే ఇప్పుడు మూడో వన్డే ఫలితం తర్వాత మరోసారి అలాంటి సందేహం కనిపిస్తోంది. అభేద్యమైన కోహ్లి సేన అతి సునాయాసంగా సిరీస్ గెలుస్తుందని భావిస్తే వెస్టిండీస్ ఒక్క సారిగా పరిస్థితిని మార్చేసింది. ముందుగా ‘టై’తో బయటపడి ఆ తర్వాత పూర్తి స్థాయి బలగం ఉండి కూడా మ్యాచ్ ఓడిన భారత్... వెంటనే దానికి ప్రతీకారం తీర్చుకోవాలంటే రెట్టింపు శ్రమించాల్సి ఉంది. మరోవైపు సమష్టి ప్రదర్శనతో సాధించిన గెలుపు విండీస్ శిబిరంలో ఒక్కసారిగా ఆత్మవిశ్వాసం పెంచేసింది. ఈ నేపథ్యంలో నాలుగో మ్యాచ్ కీలకంగా మారింది.
ముంబై: భారత జట్టు గత ఏడాది దాదాపు ఇదే సమయంలో సొంతగడ్డపై శ్రీలంకతో ఆడుతున్నా... రాబోయే దక్షిణాఫ్రికా పర్యటన గురించే ఎక్కువగా ఆలోచించింది. ఇప్పుడూ అలాగే ఆస్ట్రేలియా సిరీస్‌కే సిద్ధమైపోవాల్సిన సమయంలో వెస్టిండీస్‌తో మ్యాచ్‌ను కూడా సీరియస్‌గా తీసుకోవాల్సి వస్తోంది! విండీస్ పోరాటపటిమ కోహ్లి సేనను అలా మార్చేసింది. తొలి వన్డేలో 322 పరుగులు చేసి... రెండో మ్యాచ్‌లో విజయానికి చేరువగా వచ్చి... మూడో మ్యాచ్‌లో ఏకంగా గెలుపు రుచి చూసిన హోల్డర్ బృందం మన జట్టుకు సవాల్ విసిరింది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు నేడు నాలుగో వన్డేలో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ప్రతిష్టాత్మక వాంఖడే మైదానంలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను కాంప్లిమెంటరీ పాస్‌ల వివాదం నేపథ్యంలో బ్రబోర్న్ స్టేడియానికి (సీసీఐ) మార్చారు.
జాదవ్‌కు చోటు...
ఒక్క మ్యాచ్‌కే మిడిలార్డర్ వైఫల్యం అని సూత్రీకరించలేం కానీ ప్రమాద ఘంటిక మాత్రం మోగినట్లే. టాప్–3లో ఒక మ్యాచ్‌లో కనీసం ఇద్దరు అద్భుతంగా ఆడుతుండటంతో భారత్‌కు ఇప్పటి వరకు ఈ సమస్య కనిపించలేదు. కానీ రోహిత్, ధావన్ విఫలం కావడం... మిడిల్, లోయర్ ఆర్డర్‌లలో ఎవరూ కోహ్లికి అండగా నిలవకపోవ డంతో భారత్ గత వన్డేలో పరాజయం పాలైంది. నాలుగో స్థానం కోసం ఇప్పటికే కోహ్లి విశ్వాసం పొందిన అంబటి రాయుడు నిలకడగా రాణించడం ఎంతో అవసరం. ఇక ఐదు, ఆరు స్థానాల్లో పంత్, ధోని సత్తా చాటితేనే జట్టుకు విజయావకాశాలు ఉంటాయి. పంత్‌కు తొలి సిరీస్ కాబట్టి ఇంకా సమయం పట్టవచ్చు కానీ ఇప్పటికే టి20ల్లో చోటు కోల్పోయిన ధోని తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు.
అతను ధనాధన్ షాట్లు ఆడి చాలా కాలం కాగా... వన్డే శైలికి తగినట్లుగా స్ట్రయిక్ రొటేట్ చేస్తూ కీలక పరుగులు సాధించాల్సి ఉంది. పుణే వన్డేలో ఐదుగురు బౌలర్లతో ఆడటంతో ఏడో స్థానంలోనే భువనేశ్వర్ బ్యాటింగ్‌కు దిగాల్సి వచ్చింది. ఈసారి ఖలీల్ స్థానంలో జడేజాకు అవకాశం దక్కితే జట్టు బ్యాటింగ్ మెరుగవుతుంది. మరోవైపు కేదార్ జాదవ్ కూడా తుది జట్టులో ఆడటం దాదాపుగా ఖాయమైంది. అతని వైవిధ్యమైన బౌలింగ్ జట్టుకు అదనపు బలం కానుంది. అయితే జాదవ్‌ను ఆడించేందుకు పంత్‌ను పక్కన పెడతారా అనేది చూడాలి. అన్నింటికి మించి తిరుగులేని ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తున్న విరాట్ కోహ్లి అత్యద్భుత ఫామ్‌తో భారత్ పైచేయిగానే కనిపిస్తోంది. అయితే అతని ఒక్కడి ఆట విజయానికి సరిపోదని గత మ్యాచ్ నిరూపించిన నేపథ్యంలో టీమిండియా సమష్టిగా చెలరేగాల్సి ఉంది.
అదే జట్టుతో...
తమ బ్యాటింగ్ ప్రదర్శనే భారత జట్టు ప్రధాన పేసర్లు బుమ్రా, భువనేశ్వర్‌లను తిరిగి జట్టులోకి తీసుకొనేలా చేసిందని వ్యాఖ్యానించిన వెస్టిండీస్ కోచ్ స్టువర్ట్ లా మూడో వన్డేలో తమ జట్టు ఆటతో కచ్చితంగా సంతోషించి ఉంటాడు. బుమ్రా నాలుగు వికెట్లు తీసినా... భువనేశ్వర్ పెద్దగా ప్రభావం చూపలేదు. ఇప్పుడు మరోసారి అదే జోరు కొనసాగించాలని విండీస్ భావిస్తోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న షై హోప్, అతనికి తోడుగా చెలరేగిపోతున్న హెట్‌మైర్‌లు మళ్లీ ఇన్నింగ్స్‌లో కీలకం కానున్నారు. కెప్టెన్ హోల్డర్ ఆల్‌రౌండ్ నైపుణ్యం పుణేలో కనిపించగా... అనూహ్యంగా నర్స్ కూడా తన బ్యాటింగ్ బలాన్ని చూపించాడు. బౌలర్లను లెక్క చేయకుండా ఎదురుదాడి చేస్తేనే ఫలితం ఉంటుందని విండీస్ గత రెండు మ్యాచ్‌ల్లోనూ చూపించింది. ఇప్పుడూ అదే విశ్వాసంతో ఆడితే మరోసారి ఆ జట్టుది పైచేయి కావచ్చు. బ్యాటింగ్‌లో మెరవకపోయినా మూడు కీలక వికెట్లు తీసిన శామ్యూల్స్ అనుభవం కూడా విండీస్‌కు పనికొస్తోంది. కోహ్లిని ఆపలేకపోయినా... ఇతర ఆట గాళ్లను కట్టడి చేయగలిగితే మ్యాచ్ గెలవొచ్చని ఆ జట్టుకు అర్థమైంది. మూడో వన్డేలో ప్రతీ ఒక్కరు తమ బాధ్యతను నెరవేర్చడంతో తుది జట్టులో మా ర్పులు చేయాల్సిన అవసరం కనిపించడం లేదు.
తుది జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాయుడు, పంత్/ జాదవ్, ధోని, జడేజా, భువనేశ్వర్, చహల్, కుల్దీప్, బుమ్రా.
వెస్టిండీస్: హోల్డర్ (కెప్టెన్), కీరన్ పావెల్, హేమ్‌రాజ్, హోప్, శామ్యూల్స్, హెట్‌మైర్, రావ్‌మన్ పావెల్, అలెన్, నర్స్, రోచ్, మెక్‌కాయ్.
పిచ్, వాతావరణం
బ్యాటింగ్‌కు అనుకూలంగా కనిపిస్తోంది. సిరీస్‌లోని గత మ్యాచ్‌లలాగే భారీ స్కోరుకు అవకాశం ఉంది. అయితే ఇక్కడ 2017 ఫిబ్రవరి తర్వాత ఒక్క ఫస్ట్‌క్లాస్ మ్యాచ్ కూడా జరగలేదు కాబట్టి అంచనా వేయడం కష్టంగా మారింది. ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ అయితే 2009లో (శ్రీలంకతో టెస్టు) అయింది.
ధోని తీవ్ర సాధన...
ఫామ్ కోల్పోయి, టి20ల్లో చోటు కోల్పోయి పరుగుల కోసం తంటాలు పడుతున్న మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అదనంగా శ్రమించేందుకు సిద్ధమయ్యాడు. మ్యాచ్ ముందు రోజు ఆదివారం ‘ఆప్షనల్ ప్రాక్టీస్’ అయినా అతను మాత్రం నెట్స్‌లో చెమటోడ్చాడు. స్థానిక బౌలర్లు బంతులు వేయగా దాదాపు 45 నిమిషాల పాటు ధోని బ్యాటింగ్ చేశాడు. ధోనితో పాటు రోహిత్, అంబటి రాయుడు, కేఎల్ రాహుల్, మనీశ్ పాండే, రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్ సాధన చేయగా మిగతా జట్టు సభ్యులు మాత్రం ప్రాక్టీస్‌కు దూరంగా ఉన్నారు. వెస్టిండీస్ ఆటగాళ్లు పూర్తిగా విశ్రాంతి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment