న్యూఢిల్లీ: భారత్‌లో వెస్టిండీస్ పర్యటన వచ్చే నెలాఖరులో మొదలవనుంది. ఇక్కడ ఆడేందుకు విండీస్ బోర్డు సమ్మతించడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పర్యటనను ఖరారు చేసింది. మొత్తం మీద బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ 200వ టెస్టు స్వదేశంలోనే జరగనుందనే విషయం అధికారికంగా స్పష్టమైంది. నాలుగు వారాల పాటు జరిగే ఈ టూర్‌లో వెస్టిండీస్... ఆతిథ్య జట్టుతో రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడుతుంది.
ఒక మూడు రోజుల వార్మప్ మ్యాచ్ కూడా జరగనుంది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 27 వరకు పర్యటన సాగుతుంది. అయితే తేదీలు, వేదికల వివరాలను తర్వాత వెల్లడిస్తామని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. సచిన్ 200వ టెస్టును తన పుట్టింటిలో (వాంఖడే)లో నిర్వహించేందుకు ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) తహతహలాడుతున్నప్పటికీ... రొటేషన్ పద్ధతి ప్రకారం ఈ టెస్టు మొతేరా స్టేడియం (అహ్మదాబాద్)లో జరగాల్సివుంది. కానీ ముంబైతో పాటు కోల్‌కతా కూడా ‘మాస్టర్’ ఘనతను కొట్టేయాలనుకుంటున్నాయి.