టీమిండియా గెలిచేసింది! కీలక సమయంలో వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని నిలువరించడం ఎలాగో చూపుతూ... అనంతరం ఛేదనను ఎలా ముగించాలో చాటుతూ... వన్డేను ఎలా ఆడాలో ఒక పాఠంలా చెబుతూ మరో మ్యాచ్‌ను గెలిచేసింది!
న్యూజిలాండ్ ప్రతిఘటించేలా కనిపించినా... పిచ్‌పై పరుగులు సాధించడం ఒకింత కష్టమైనా... కోహ్లి సేన ఆల్‌రౌండ్ ప్రదర్శనకు, అప్రతిహత ప్రస్థానానికి అవేమీ అడ్డంకిగా మారలేకపోయాయి. ఫలితంగా రెండు మ్యాచ్‌లు ఉండగానే భారత్ సిరీస్‌నూ గెలిచేసింది!
మధ్య ఓవర్ల డ్రామా లేదు... చివరి ఓవర్ల ముగింపులు అవసరం రాలేదు... ముందుగా బ్యాటింగ్ చేసినా, బౌలింగ్‌కు దిగినా అంతా సంపూర్ణ ఆధిపత్యమే! కివీస్ గడ్డపై 2014 నాటి 4–0 పరాభవాన్ని తుడిచేస్తూ పదేళ్ల క్రితం నాటి సిరీస్ విజయాన్ని గుర్తుచేస్తూ మన జట్టు గెలిచేసింది!
మౌంట్ మాంగనీ: గత ఏడాదిగా దక్షిణాఫ్రికాను దులిపేసి... ఇంగ్లండ్‌కు దీటుగా పోటీనిచ్చి... ఆస్ట్రేలియా మెడలు వంచిన భారత్... ఇప్పుడు న్యూజిలాండ్‌నూ దాని సొంతగడ్డపైనే మట్టి కరిపించింది. రెండు జట్ల మధ్య సోమవారం ఇక్కడ జరిగిన మూడో వన్డేలో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఆడిన టీమిండియా 7 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ 49 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు ఇన్నింగ్స్‌ను నిలబెట్టిన మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ (106 బంతుల్లో 93; 9 ఫోర్లు) సెంచరీ చేజార్చుకోగా, లాథమ్ (64 బంతుల్లో 51; 1 ఫోర్, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. మరోసారి పదునైన బౌలింగ్‌తో చెలరేగిన షమీ (3/41)కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. భువనేశ్వర్, హార్దిక్ పాండ్యా, చహల్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో ఓపెనర్ రోహిత్ శర్మ (77 బంతుల్లో 62; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ విరాట్ కోహ్లి (74 బంతుల్లో 60; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలకు తోడు అంబటి రాయుడు (42 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ (38 బంతుల్లో 38 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో భారత్ 43 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. నాలుగో వన్డే గురువారం హామిల్టన్‌లో జరుగనుంది.
వారిద్దరూ నిలిచారు కానీ...
ఓపెనర్లు గప్టిల్ (13), మున్రో (7) మరోసారి విఫలమవడంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ పేలవంగా ప్రారంభమైంది. మున్రోను ముప్పుతిప్పలు పెట్టిన షమీ అతడిని స్లిప్‌లో రోహిత్ క్యాచ్ ద్వారా వెనక్కు పంపాడు. భువీ స్వింగింగ్ డెలివరీకి గప్టిల్ ఔటయ్యాడు. సౌకర్యంగానే కనిపించిన కెప్టెన్ విలియమ్సన్ (28).. చహల్ బంతిని ముందుకొచ్చి ఆడబోయి మిడ్ వికెట్‌లో ఎడమవైపు ఒరుగుతూ పాండ్యా పట్టిన అద్భుత క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. 59/3తో నిలిచిన జట్టును టేలర్, లాథమ్ ఆదుకున్నారు. ఈ జోడీ భారత స్పిన్నర్లకు ఎదురునిలిచింది. చక్కటి కట్ షాట్లతో పరుగులు రాబట్టిన టేలర్ 71 బంతుల్లో అర్ధ సెంచరీ అందుకున్నాడు. 126 బంతుల్లో 119 పరుగులు జోడించిన వీరు జట్టుకు మంచి స్కోరు అందించేలా కనిపించారు. అయితే, హాఫ్ సెంచరీ (62 బంతుల్లో) పూర్తి చేసుకున్న లాథమ్ ఆ వెంటనే భారీ షాట్ ఆడబోయి డీప్ మిడ్ వికెట్‌లో రాయుడుకు క్యాచ్ ఇచ్చాడు. దీంతో నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. నికోల్స్ (6), సాన్‌ట్నర్ (3)లను వెంటవెంటనే ఔట్ చేసిన పాండ్యా కివీస్‌ను కోలుకోకుండా చేశాడు. ఆఫ్ స్టంప్‌పై షమీ వేసిన కచ్చితమైన లెంగ్త్ బాల్‌ను ఆడబోయి టేలర్ వికెట్ ఇచ్చాడు. దీనిపై అతడు రివ్యూ కోరినా ఫలితం వ్యతిరేకంగానే వచ్చింది. స్కోరు 222 వద్ద అతడు ఏడో వికెట్‌గా ఔటయ్యాక 21 పరుగుల వ్యవధిలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆ జట్టు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ 50 ఓవర్లు ఆడలేకపోవడం గమనార్హం.
ఆడుతూ...కొడుతూ
మోస్తరు లక్ష్య ఛేదనలో రోహిత్ కుదురుకునేందుకు చూస్తుండగా మరో ఓపెనర్ ధావన్ (27 బంతుల్లో 28; 6 ఫోర్లు) చకచకా బౌండరీలు బాది భారత్‌కు శుభారంభం ఇచ్చాడు. అయితే, ఆఫ్ స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బౌల్ట్ బంతిని ఆడబోయి ఔటయ్యాడు. రోహిత్, కోహ్లిలను కివీస్ బౌలర్లు ఏమాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు. ఆడుతూ... కొడుతూ అన్నట్లు వీరు బ్యాటింగ్ చేశారు. 63 బంతుల్లో రోహిత్, 59 బంతుల్లో కోహ్లి అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. రెండో వికెట్‌కు 127 బంతుల్లో 113 పరుగులు జోడించాక రోహిత్ భారీ షాట్‌కు యత్నించి స్టంపౌటయ్యాడు. కాసేపటికే కోహ్లి ఔటైనా... అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్ దూకుడుగా ఆడుతూ నాలుగో వికెట్‌కు అజేయంగా 77 పరుగులు జోడించి భారత విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు.
6 విరాట్ కోహ్లి నాయకత్వంలో విదేశీ గడ్డపై భారత్ నెగ్గిన ఆరో వన్డే సిరీస్ ఇది. న్యూజిలాండ్‌కంటే ముందు కోహ్లి కెప్టెన్సీలో జింబాబ్వే, వెస్టిండీస్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలో భారత్ వన్డే సిరీస్‌లు గెలిచింది.
►7 ఏడేళ్ల తర్వాత న్యూజిలాండ్ జట్టు స్వదేశంలో వన్డే సిరీస్‌లోని తొలి మూడు వన్డేల్లో ఓడిపోయింది. చివరిసారి 2012లో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో కివీస్‌కు ఇలాంటి పరిస్థితి ఎదురైంది.
►2 ఇప్పటివరకు 199 వన్డేలు ఆడిన రోహిత్ శర్మ స్టంపౌట్ కావడం ఇది రెండోసారి మాత్రమే. ఈ మ్యాచ్ కంటే ముందు రోహిత్ 2010లో దంబుల్లాలో శ్రీలంకతో జరిగిన వన్డేలో స్టంపౌట్ అయ్యాడు.
►1 వన్డేల్లో భారత జట్టు తరఫున అత్యధిక సిక్స్‌లు కొట్టిన బ్యాట్స్‌మన్ జాబితాలో ధోని (215) సరసన రోహిత్ శర్మ (215) చేరాడు. ధోని వన్డే కెరీర్‌లో మొత్తం 222 సిక్స్‌లు కొట్టగా... ఇందులో ఏడు ఆసియా జట్టుకు ఆడినపుడు వచ్చాయి.
►16 వన్డేల్లో రోహిత్ శర్మ–విరాట్ కోహ్లి జోడీ నమోదు చేసిన సెంచరీ భాగస్వామ్యాలు. ఈ జాబితాలో 26 సెంచరీ భాగస్వామ్యాలతో సచిన్–గంగూలీ జంట టాప్ ర్యాంక్‌లో ఉంది. తిలకరత్నే దిల్షాన్–సంగక్కర (శ్రీలంక–20) రెండో స్థానంలో, గిల్‌క్రిస్ట్–హేడెన్ (ఆస్ట్రేలియా–16) జోడీ మూడో స్థానంలో ఉన్నాయి.
►3 మూడేళ్ల తర్వాత న్యూజిలాండ్ జట్టు వన్డే సిరీస్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఆలౌట్ కావడం ఇదే తొలిసారి. 2016లో ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్ లో కివీస్‌కు ఇలా జరిగింది.
అంబటి రాయుడు బౌలింగ్‌పై ఐసీసీ నిషేధం
అంతర్జాతీయ క్రికెట్‌లో భారత క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు బౌలింగ్ చేయకుండా ఐసీసీ నిషేధం విధించింది. ఆస్ట్రేలియాతో ఈ నెల 12న జరిగిన తొలి వన్డేలో అతని బౌలింగ్ శైలి సందేహాస్పదంగా ఉందంటూ అంపైర్లు నివేదిక ఇచ్చారు. ఐసీసీ నిబంధనల ప్రకారం రెండు వారాల్లోగా అతను తన బౌలింగ్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. రాయుడు దీనిపై ఆసక్తి చూపించకపోవడంతో నిషేధం వెంటనే అమల్లోకి వస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. అయితే ప్రధానంగా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ అయిన రాయుడు నిషేధం ప్రభావం భారత జట్టుపై ఏ మాత్రం ఉండదు. తన 50 వన్డేల కెరీర్‌లో అతను 9సార్లు మాత్రమే బౌలింగ్‌కు దిగి ఓవరాల్‌గా 20.1 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. పార్ట్‌టైమర్‌గా కూడా అతడిని ఎక్కువగా వాడింది లేదు. రాయుడు యాక్షన్‌ను తప్పు పట్టిన సిడ్నీ వన్డేలో కూడా అతను 2 ఓవర్లు మాత్రమే వేశాడు.
ఎదురుదెబ్బలతో పాండ్యా రాటుదేలుతాడు
భారత క్రికెట్‌లో అత్యున్నత ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. ఇప్పటికే పృథ్వీ షాను చూశాం. నెట్స్‌లో యువ శుబ్‌మన్ గిల్ బ్యాటింగ్‌ను పరిశీలించా. నాకు 19 ఏళ్ల వయసున్నప్పుడు గిల్ (ప్రస్తుత వయసు 19) ఇప్పుడు ఆడుతున్న ఆటలో 10 శాతం కూడా ఆడలేదు. అతడో అద్భుతం. మా క్రికెట్ ప్రమాణాలు పెంచే ఈ పరిణామాలు శుభసూచికం. అవకాశాలు ఇచ్చి వారు ఎదిగేలా చూడటం మాకు సంతోషాన్నిస్తుంది. జీవితంలో ఎదురుదెబ్బలు ఐతేగీతే పాతాళానికి తీసుకెళ్తాయి... లేదంటే పాఠాలు నేర్పి రాటు దేలుస్తాయి. క్రికెటర్లకు ఆట కంటే సన్నిహితులు ఎవరూ ఉండరు. దానిని నువ్వు గౌరవిస్తే అది నీకు గౌరవాన్నిస్తుంది. పాండ్యా పరిణతి చెందేందుకు ఇలాంటి ఎదురుదెబ్బలు ఓ పాఠం. మూడు విభాగాల్లోనూ అతడు జట్టుకు సమతూకం తెస్తాడు. ప్రపంచంలో ప్రతి జట్టు అతలాండి ఆటగాడిని కోరుకుంటుంది. 4వ స్థానంలో రాయుడి ఆట చూశాక మాకు మరింత నమ్మకం కలిగింది. దినేశ్ ఎప్పుడైనా రంగంలోకి దిగగలడు. ధోని టచ్‌లోకి వచ్చాడు. కావాలంటే ఇప్పటికిప్పుడే (ఆటో మోడ్) ప్రపంచ కప్ ఆడేంతగా మేం సంసిద్ధంగా ఉన్నాం. సిరీస్ గెలిచాక విశ్రాంతి తీసుకోనుండటం నాకు కొంత ఊరట. ఐనా ఇప్పుడు ఎవరున్నా లేకున్నా అంతా నడిచిపోయేలా ఉంది.
– విరాట్ కోహ్లి, భారత కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment