మెల్‌బోర్న్: ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. ముక్కోణపు టి20 క్రికెట్ టోర్నీలో భాగంగా శనివారం ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత ఆసీస్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 173 పరుగులు చేసింది. యాష్లే గార్డెనర్ (57 బంతుల్లో 93; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకుంది. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు తీయగా... రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, హర్లీన్ డియోల్‌లకు ఒక్కో వికెట్ లభించింది.
174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.4 ఓవర్లలో మూడు వికెట్లకు 177 పరుగులు చేసి అద్భుత విజయం సాధించింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (28 బంతుల్లో 49; 8 ఫోర్లు, సిక్స్), స్మృతి మంధాన (48 బంతుల్లో 55; 8 ఫోర్లు) తొలి వికెట్‌కు 8.2 ఓవర్లలో 85 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. అనంతరం జెమీమా రోడ్రిగ్స్ (19 బంతుల్లో 30; 5 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (20 బంతుల్లో 20 నాటౌట్; సిక్స్), దీప్తి శర్మ (4 బంతుల్లో 11 నాటౌట్; 2 ఫోర్లు) కూడా ధాటిగా ఆడటంతో భారత్ రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని దక్కించుకుంది. టి20ల్లో భారత్‌కిదే అత్యుత్తమ ఛేజింగ్ కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment