
సిరీస్ విజయంపై గురి
మధ్యాహ్నం గం. 12.30 నుంచి
టెన్ క్రికెట్‌లో ప్రత్యక్ష ప్రసారం
నేడు జింబాబ్వేతో భారత్ రెండో వన్డే
హరారే: తొలి వన్డేలో జింబాబ్వే ఎదురుదాడి నుంచి తృటిలో తప్పించుకున్న భారత్ జట్టు ఇప్పుడు రెండు అంశాలపై దృష్టిసారించింది. వీలైనంత త్వరగా మిడిలార్డర్ వైఫల్యాన్ని అధిగమించాలని భావిస్తున్న టీమిండియా రెండో వన్డేతోనే సిరీస్‌ను గెలిచి ఒత్తిడి లేకుండా మూడో మ్యాచ్ ఆడాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు (ఆదివారం) జింబాబ్వేతో జరగనున్న రెండో వన్డేలో భారత్ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది.
తొలి వన్డేలో రాయుడు మినహా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలం కావడం మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. సింగిల్ డిజిట్‌కే పరిమితమైన మురళీ విజయ్, మనోజ్ తివారీ, ఉతప్ప, కేదార్ జాదవ్‌లు కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గాడిలో పడతారేమో చూడాలి. కెరీర్‌లో తొలిసారి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రహానే కూడా తన స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. రాయుడు, బిన్నీలు ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశమే అయినా జింబాబ్వేలాంటి ప్రత్యర్థిపై కనీసం మూడొందలకు పైగా స్కోరు చేయాలి.
లేదంటే ఊహించని పరాజయం తప్పకపోవచ్చు. ఇక బౌలింగ్‌లో అక్షర్ పటేల్, స్టువర్ట్ బిన్నీ ఫర్వాలేదనిపించినా.. పేసర్లు గాడిలో పడాల్సి ఉంది. భువనేశ్వర్ పరుగులు నియంత్రిస్తున్నా వికెట్లు తీయలేకపోతున్నాడు. ధవల్ రెండింటిలోనూ నిరాశపరుస్తున్నాడు. సీనియర్ ఆటగాడు హర్భజన్ ఫామ్‌లోకి రావడం జట్టుకు అత్యంత అవసరం.
మరోవైపు జింబాబ్వే స్ఫూర్తిదాయకమైన ఆటతీరుతో చెలరేగుతోంది. భారీ లక్ష్యం కళ్లముందున్నా... కెప్టెన్ చిగుంబురా చూపిన తెగువ అమోఘం. సహచరుల నుంచి అతనికి ఇంకాస్త సహకారం అందితే ఈ సిరీస్‌లో భారత్ పరాజయం తప్పకపోవచ్చేమో. తొలి మ్యాచ్‌ను తృటిలో చేజార్చుకున్నా... రెండో వన్డేలో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని జింబాబ్వే కృతనిశ్చయంతో ఉంది. మసకద్జా, సికిందర్ రజా, సీన్ విలియమ్స్, సిబండా, చిబాబా కుదురుకుంటే భారీ స్కోరు ఖాయం. బౌలర్లు ఓ మోస్తరుగా రాణిస్తున్నా... మంచి భాగస్వామ్యాలను విడగొట్టలేకపోవడం నిరాశ కలిగించే అంశం.