జకార్తా: భారత పురుషుల హాకీ జట్టు ఆసియా క్రీడల్లో చరిత్రకెక్కే విజయాన్ని సాధించింది. బుధవారం జరిగిన పూల్ ‘బి’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 26–0తో హాంకాంగ్‌పై భారీ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. దీంతో 86 ఏళ్ల క్రితం లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ (1932)లో దివంగత దిగ్గజం ధ్యాన్‌చంద్ జట్టు 24–1తో అమెరికాపై సాధించిన రికార్డు కనుమరుగైంది. ఆట మొదలైన రెండో నిమిషం నుంచి భారత్ విజృంభణ మొదలైంది. ఆకాశ్‌దీప్ సింగ్‌తో మొదలైన శుభారంభం మరో నిమిషంలో మూడింతలైంది. రూపిందర్‌పాల్ సింగ్, మన్‌ప్రీత్ సింగ్ ఇద్దరు మూడో నిమిషంలో చెరో గోల్ చేశారు. ఇక ఇక్కడి నుంచి మొదలైన గోల్స్ సునామీ ఆట ఆఖరి నిమిషం దాకా సాగిందంటే అతిశయోక్తికాదు. ఒకరో ఇద్దరో కాదు ఏకంగా 13 మంది భారత క్రీడాకారులు గోల్స్ చేశారు. వీరిలో ముగ్గురు ఆటగాళ్లు రూపిందర్‌పాల్ (3, 5, 30, 45, 59వ నిమిషాల్లో), హర్మన్‌ప్రీత్ సింగ్ (29, 52, 53, 54వ ని.), ఆకాశ్‌దీప్ సింగ్ (2, 32, 35వ ని.) హ్యాట్రిక్ గోల్స్ చేయడం విశేషం. మన్‌ప్రీత్ సింగ్ (3, 17వ ని.), లలిత్ ఉపాధ్యాయ్ (17, 19వ ని.), వరుణ్ కుమార్ (23, 30వ ని.) తలా రెండు గోల్స్ సాధించారు. సునీల్ (7వ ని.), వివేక్ సాగర్ (14వ ని.), మన్‌దీప్ సింగ్ (21వ ని.), అమిత్ రొహిదాస్ (27వ ని.), దిల్‌ప్రీత్ సింగ్ (48వ ని.), చింగ్లేసనా సింగ్ (51వ ని.), సిమ్రాన్‌జీత్ సింగ్ (53వ ని.), సురేందర్ కుమార్ (55వ ని.) తలా ఒక గోల్ చేశారు. మ్యాచ్‌లో ఏ నిమిషం కూడా ప్రపంచ ఐదో ర్యాంకర్ భారత్‌ను 45వ ర్యాంకులో ఉన్న హాంకాంగ్ నిలువరించలేకపోయింది. అయితే హాకీలో ఇదే అతిపెద్ద విజయం మాత్రం కాదు. 1994లో న్యూజిలాండ్ 36–1 గోల్స్‌తో సమోవాపై గెలిచిన రికార్డు పదిలంగా ఉంది. శుక్రవారం జరిగే తదుపరి లీగ్‌లో జపాన్‌ను భారత్ ఎదుర్కొంటుంది.
అర్ధభాగానికే నాకర్థమైంది...
ఆట అర్ధభాగానికే ఈ మ్యాచ్‌లో భారత్ రికార్డు సృష్టిస్తుందని తనకు అర్థమైందని చీఫ్ కోచ్ హరేంద్ర సింగ్ చెప్పారు. ‘నాకు కొత్త చరిత్ర కళ్లముందే కదలాడింది. విరామ సమయంలో ఘన చరిత్రకు కదంతొక్కండి అని కుర్రాళ్లకు చెప్పాను. పుటల్లో మీ పేరు ఎక్కాల్సిందేనని అన్నాను. నాకైతే ఇది గొప్ప కాకపోయినా... కుర్రాళ్లు మాత్రం గర్వపడేలా ఆడారు’ అని కోచ్ ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించాడు.
►1 భారత్ హాకీలో ఇదే అతిపెద్ద విజయం
►2 సగటున ప్రతీ రెండున్నర నిమిషాలకు ఓ గోల్ నమోదైంది.
►3 ముగ్గురు భారత ఆటగాళ్లు ‘హ్యాట్రిక్’ను మించారు. రూపిందర్ 5, హర్మన్‌ప్రీత్ 4, ఆకాశ్ దీప్ 3 గోల్స్ చేశారు.
►13 ఏకంగా 13 మంది భారత ఆటగాళ్లు స్కోరు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment