క్రీడా సమాఖ్యల్లో ఆటగాళ్లు తప్పకుండా భాగస్వాములు కావాల్సిందేనని స్టార్ షూటర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ పేర్కొన్నాడు.
జైపూర్: క్రీడా సమాఖ్యల్లో ఆటగాళ్లు తప్పకుండా భాగస్వాములు కావాల్సిందేనని స్టార్ షూటర్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ పేర్కొన్నాడు. ఇటీవల భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తీర్థం పుచ్చుకున్న ఇతను జాతీయ రైఫింగ్ సంఘం (ఎన్‌ఆర్‌ఐ) ఎన్నికలపై కోర్టులో పోరాడుతున్నాడు. ‘ఆటగాళ్లు రాజకీయాలు మనకెందుకులే అని అనుకోకుండా క్రీడా సమాఖ్యల పాలకపగ్గాల బాధ్యతల్లో పాలుపంచుకోవాలి. అప్పుడే సుదీర్ఘ కాలంగా అక్కడ తిష్ట వేసిన అసమర్థ, అవినీతి రుగ్మతలపై పోరాడే అవకాశం లభిస్తుంది. తద్వారా చక్కని ఫలితాల్ని దేశానికి అందించగలుగుతాం’ అని అతను సూచించాడు.
ప్రజాస్వామ్య పద్ధతిలో పరిస్థితుల్ని చక్కదిద్దే చొరవ క్రీడాకారులు తీసుకుంటేనే క్రీడలకు న్యాయం చేయగలుగుతామన్నాడు. అసమర్థ కార్యకలాపాలకు చరమగీతం పలికే అవకాశం ఆ సమాఖ్యల్లో క్రీడాకారులు భాగమైనప్పుడే లభిస్తుందని రాథోడ్ చెప్పాడు. క్రీడా సమాఖ్యల్లో ‘అథ్లెట్స్ కమిషన్’ను ఏర్పాటు చేయాలనే తన ప్రతిపాదనకు భారత ఒలింపిక్ సంఘం ఆమోదం తెలిపిందని... అలాగే ఇతర సమాఖ్యలు, సంఘాలు కూడా ఈ కమిటీకి తమ పాలకమండలిలో చురుకైన సభ్యత్వం ఇస్తేనే పరిస్థితులు మెరుగవుతాయని చెప్పాడు. తానిప్పుడు ఎన్‌ఆర్‌ఏఐపై పోరాడుతున్నానన్నాడు. ఈ సంఘం ఎన్నికలను సవాలు చేస్తూ అతను ఢిల్లీ హైకోర్టుకెక్కాడు.