కోహ్లీ సేన దూకుడు తగ్గదు : కుంబ్లే
రాంచీ: ఎట్టి పరిస్థితుల్లోనూ విరాట్ కోహ్లీసేన వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని టీమిండియా ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే అన్నాడు. రాంచీలో జరగనున్న మూడో టెస్టులోనూ కోహ్లీసేన దూకుడు తగ్గించకూడదని, తమ ఆటగాళ్లు ఎందుకు వెనకడుగు వేయాలంటూ ప్రశ్నించాడు. ఆటగాళ్లు హద్దుల్లో ఉన్నంత వరకు వారి విషయంలో తాను జోక్యం చేసుకోవాలనుకోవడం లేదన్నాడు. మా ఆటగాళ్లకు వారి పరిమితులు తెలుసునని, వారికి దూకుడే అత్యధిక విజయాలు తెచ్చిపెట్టిందని కోచ్ అభిప్రాయపడ్డాడు. బెంగళూరు టెస్టులో కోహ్లీ, స్టీవ్ స్మిత్ మధ్య తలెత్తిన వివాదంపై బీసీసీఐ, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు రాజీకి రావడం శుభపరిణామమని చెప్పాడు.
'పుణే టెస్టులో దారుణవైఫల్యం తర్వాత బెంగళూరు టెస్టులోనూ తొలి ఇన్నింగ్స్‌లో త్వరగా వికెట్లు కోల్పోయిన జట్టు రెండో ఇన్నింగ్స్‌లో అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించింది. ముఖ్యంగా స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు రాణించడం మ్యాచ్ గమనాన్నే మార్చివేశారు. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఓపెనర్ కెఎల్ రాహుల్ సరైన సమమాల్లో రాణించి మంచి భాగస్వామ్యాలు అందించడంతో విజయం సాధ్యమైంది. కోహ్లీ నాలుగు వరస సిరీస్‌లలో డబుల్ సెంచరీలతో చెలరేగడం, అశ్విన్ ఫాస్టెస్ట్ 250 వికెట్ల వీరుడిగా నిలవడం ఎంతో తృప్తినిచ్చింది' అని రాంచీ టెస్టుకు ముందు కోచ్ అనిల్ కుంబ్లే అన్నాడు. సిరీస్‌లో 1-1తో సమంగా ఉన్న టీమిండియా, ఆసీస్ జట్లకు రాంచీలో ఈ 16న ప్రారంభం కానున్న మూడో టెస్ట్ కీలకం కానుంది.