స్మృతి, జులన్‌ మెరుపులు  | India's victory in the first ODI | Sakshi
Sakshi News home page

స్మృతి, జులన్‌ మెరుపులు 

Feb 6 2018 12:56 AM | Updated on Feb 6 2018 12:56 AM

India's victory in the first ODI - Sakshi

స్మృతి మంధన, జులన్‌ గోస్వామి

కింబర్లీ: ఒకవైపు భారత పురుషుల క్రికెట్‌ జట్టు దక్షిణాఫ్రికాను వారి సొంతగడ్డపైనే ఓ ఆటాడిస్తుండగా... అదే దేశంలో మరో చోట మన మహిళల టీమ్‌ కూడా సఫారీల పని పట్టింది. భారీ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసింది. సోమవారం ఇక్కడ జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు 88 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై గెలిచింది. టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ స్మృతి మంధన (98 బంతుల్లో 84; 8 ఫోర్లు, 1 సిక్స్‌) దూకుడైన ఇన్నింగ్స్‌తో జట్టు స్కోరులో కీలక పాత్ర పోషించింది. స్మృతి, కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (70 బంతుల్లో 45; 2 ఫోర్లు) కలసి రెండో వికెట్‌కు 99 పరుగులు జోడించారు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో కాప్, ఖాకా చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం దక్షిణాఫ్రికా 43.2 ఓవర్లలో 125 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్‌ వ్యాన్‌ నీకెర్క్‌ (88 బంతుల్లో 41; 2 ఫోర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. భారత సీనియర్‌ పేసర్‌ జులన్‌ గోస్వామి (4/24) అద్భుత ప్రదర్శనతో సఫారీల వెన్ను విరిచింది. శిఖాపాండేకు 3 వికెట్లు.. పూనమ్‌ యాదవ్‌కు 2 వికెట్లు దక్కాయి. ఐసీసీ ఉమెన్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా జరుగుతోన్న ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ విజయంతో భారత్‌ ఖాతాలో 2 పాయింట్లు చేరాయి. రెండో వన్డే  బుధవారం జరుగుతుంది.

1  వన్డేల్లో 100 వికెట్లు పడగొట్టడంతో పాటు 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా జులన్‌ గోస్వామి అరుదైన ఘనత సాధించింది. ఓవరాల్‌గా ఈ ‘డబుల్‌’ చేసిన ఎనిమిదో ప్లేయర్‌ జులన్‌.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement