చీకటి చూపిన వెలుగు!
బెంగళూరు: సమస్యలొచ్చినప్పుడు పారిపోకుండా వాటిని ఎదిరించి సవాల్ స్వీకరించినవాడే అసలైన పోరాట యోధుడు. అలా తనకు ఎదురైన సమస్యలను జయించి నిలిచిన శేఖర్ నాయక్ నిజంగా ఆదర్శప్రాయుడు. ప్రస్తుతం భారత అంధుల క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న శేఖర్ నాయక్ బాల్యం ముళ్ల బాటలోనే సాగింది. పుట్టుకతోనే అంధత్వం. దానికి తోడు కటిక పేదరికం. ఈ రెండింటిని జయించి నిలిచాడు. దాంతో పాటు భారతదేశ కీర్తిని మరింత పెంచాడు.
కర్ణాటకలోని షిమోగా(శివమొగ్గ)లో 1986 లో పుట్టిన శేఖర్ పుట్టుకతోనే అం(గ)ధ వైకల్యానికి గురయ్యాడు. శేఖర్ పుట్టుకతోనే అంధుడు కావడంతో పాటు కుటుంబం పరిస్థితి కూడా అంతంత మాత్రమే. శేఖర్ కుటుంబంలో కూలి పని చేస్తే గానీ రోజు గడవని పరిస్థితి. కానీ అమ్మా-నాన్నలు శేఖర్ కు అన్నీ తామై నిలిచారు. కుమారునికి చూపు లేదన్న లోటు తెలియకుండా పెంచాలన్నది కుటుంబ సభ్యుల భావన. అయితే 1994 వ సంవత్సరం శేఖర్ జీవితాన్ని మరింత విషాదంలోకి నెట్టింది. తల్లి దండ్రులతో కలిసి పొలానికి వెళ్లిన శేఖర్ కాల్వలోకి కాలుజారి పడిపోయాడు. ఆ ప్రమాదం శేఖర్ ను మరింత కృంగదీసింది. అతని కుడి కణత దెబ్బతీంది. దీంతో చికిత్స కోసం బెంగళూరుకు వెళ్లిన శేఖర్ కు కుడి కన్నుకు కొంత మేర చూపు వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు. ఆ తరువాత ఆపరేషన్ చేయించుకున్న శేఖర్ కు 60 శాతం కంటి చూపు మెరుగైంది. తన జీవితంలో తొలిసారి సరికొత్త ప్రపంచాన్ని చూడటంతో శేఖర్ ఆనందానికి అవధుల్లేవు. ఆ సంతోషం శేఖర్ జీవితంలో ఎక్కువ కాలం నిలవలేదు. కన్న కొడుకు కంటి చూపు మెరుగుపడిందని ఇంట్లో వాళ్లు సంబరిపడే లోపే మరో చేదు వార్త తారసపడింది. శేఖర్ ఆపరేషన్ చేయించుకున్న మూడు నెలలకే తండ్రి కన్నుమూశాడు. ఆ తరువాత తల్లి చేతుల మీద శేఖర్ జీవితం సాగింది.
ఈ క్రమంలోనే 1997లో శేఖర్ 11వ ఏట ఫస్ట్ గ్రేడ్ విద్యలో భాగంగా అంధుల పాఠశాలలో చేరాడు. ఇక్కడే శేఖర్ జీవితం పూర్తిగా మారడానికి బీజం పడింది. అప్పటి వరకూ క్రికెట్ లో ఓనమాలు కూడా తెలియని శేఖర్ దాని గురించి తెలుసుకోవడం ప్రారంభించాడు. అలా క్రికెట్ పై మొక్కువ పెంచుకుంటున్న తరుణంలో మరో షాక్ తగిలింది. అతని తల్లి లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. దీంతో శేఖర్ కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఒకపక్క చదువుకుంటూనే ఖాళీ సమయాల్లో పొలం పనులు చేసుకుంటూ నెలకు రూ.1000 నుంచి 1,500 వరకూ సంపాదించేవాడు. మరోపక్క క్రికెట్ ను కూడా కొనసాగించాడు.
అలా రాష్ట్ర స్థాయి అంధ క్రికెట్ లో స్థానం సంపాదించిన శేఖర్ జీవితాన్ని 2001 వ సంవత్సరం పూర్తిగా మలుపుతిప్పింది. అండర్-18 టోర్నీలో భాగంగా హైదరాబాద్ లో జరిగిన క్రికెట్ మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలచుకున్నాడు. దీంతో జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఆ తరువాత 2002లో జరిగిన అంధుల వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా, శ్రీలంకలపై శేఖర్ రాణించి రెండు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు. ఆ తరువాత 2004 లో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లిన భారత టీమ్ లో శేఖర్ మరోసారి మెరిశాడు. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో రెండు భారత్ గెలిచింది. ఓ మ్యాచ్ లో శేఖర్ 198 పరుగులతో ఆకట్టుకున్నాడు. అదే అతని అత్యధిక అంతర్జాతీయ స్కోరు. 2005 లో పాకిస్థాన్ భారత పర్యటనకు వచ్చింది. ఆ సమయంలో శేఖర్ రాణించాడు. 2005 నుంచి 2010 వరకూ శేఖర్ ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు. 2010 లో జాతీయ టీమ్ కు కెప్టెన్ గా ఎంపికైన శేఖర్.. 2012లో జరిగిన ట్వంటీ 20 వరల్డ్ కప్ ను సాధించిపెట్టడమే కాకుండా, 2014 లో అంధుల వన్డే వరల్డ్ కప్ ను దేశానికి సాధించి పెట్టాడు. శేఖర్ నాయక్ నిజంగా ఆదర్శప్రాయుడే కదా? పుట్టుకతోనే అంధత్వం సంపాదనగా వచ్చినా.. దానికి ఎదురొడ్డి నిలబడి జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాడు. హాట్యాఫ్ టూ శేఖర్ నాయక్.