ఒక పెద్ద జట్టు... ఒక చిన్న జట్టు. మరో పెద్ద జట్టు... మరో చిన్న జట్టు! అన్నీ గ్రూప్ ‘బి’ లోనివే! వేర్వేరు వేదికలపై ఒకే రోజు ఒకే సమయానికి పరస్పరం తలపడ్డాయి...! ఓ రకంగా పెద్ద జట్లకిది పరువు పరీక్ష. ఓడిపోకుండా ఉంటేనే తదుపరి రౌండ్ చేరే పరిస్థితి వాటిది. కానీ, చిన్న జట్లు ఉడుంపట్టు పట్టాయి. ప్రత్యర్థి ఎంతదైనా లెక్కలేదంటూ చుక్కలు చూపాయి...! వాటి ధాటికి దిగ్గజాలకు దిమ్మతిరిగింది...! గెలుపు మాట దేవుడెరుగు..? బతుకుజీవుడా అంటూ ‘డ్రా’ చేసుకుని... స్పెయిన్, పోర్చుగల్ నాకౌట్ మెట్లెక్కాయి. విజయం దక్కకున్నా పోరాటంతో చిన్న జట్లు ఇరాన్, మొరాకో ఆకట్టుకున్నాయి. స్వదేశానికి తలెత్తుకుని వెళ్తున్నాయి.
సరాన్స్క్: క్రిస్టియానో రొనాల్డో స్థాయి ఆటగాడు కొట్టిన పెనాల్టీ కిక్‌కు గోల్ రాకుండా ఉంటుందని ఎవరైనా ఊహిస్తారా? కానీ, అలా ఊహించవచ్చని నిరూపించాడు ఇరాన్ కీపర్ అలీ బిరాన్‌వాండ్. ఈ అద్భుతం పోర్చుగల్‌తో మ్యాచ్‌లో చోటుచేసుకుంది. ఈ రెండు జట్ల మధ్య సోమవారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్ 1–1తో డ్రాగా ముగిసింది. పోర్చుగల్ తరఫున క్వారెస్మా (45వ నిమిషం) స్కోరు చేశాడు. ఇంజ్యూరీ సమయంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను ఇరాన్ ఆటగాడు కరీం అన్సారీఫర్ద్ (90+3 ని.) గోల్‌గా మలిచి ప్రత్యర్థికి విజయాన్ని దూరం చేశాడు.
ఇరాన్... తేలిగ్గా లొంగలేదు
మ్యాచ్‌ను దూకుడుగా ఆరంభించిన పోర్చుగల్ మొదట్లోనే ఆధిపత్యంలోకి వచ్చేందుకు ప్రయత్నించింది. దీంతో ఇరాన్ కీపర్, రక్షణ శ్రేణి తడబడింది. అయితే కొద్దిసేపటికే తేరుకుని ప్రతిఘటించింది. రొనాల్డోను ప్రత్యర్థులు నిలువరించినప్పటికీ క్వారెస్మో ప్రతిభ పోర్చుగల్‌కు గోల్ అందించింది. 45వ నిమిషంలో డి బాక్స్ వద్ద అందిన పాస్‌ను అతడు నేరుగా నెట్‌లోకి కొట్టాడు. ఆ వెంటనే మొదటి భాగం ముగిసింది. ఇందులో 71 శాతం బంతి పోర్చుగల్ ఆధీనంలోనే ఉండటం గమనార్హం. రెండోభాగం మొదలైన కాసేపటికే రొనాల్డోను ఎజతొలాహి అడ్డగించడంతో పోర్చుగల్‌కు పెనాల్టీ దక్కింది. వీఏఆర్‌ను ఆశ్రయించి ఫౌల్‌గా నిర్ధరించారు. 53వ నిమిషంలో దీనిని రొనాల్డోనే కిక్ కొట్టాడు. అయితే, బిరాన్‌వాండ్ ఎడమవైపు డైవ్ చేస్తూ అద్భుతంగా అడ్డుకున్నాడు. ఇక్కడినుంచి ఇరాన్ ఆట మారిపోయింది. పోర్చుగీస్ డిఫెన్స్‌ను ఛేదించేందుకు ప్రయత్నాలు చేసింది. అయితే, గోల్ మాత్రం రాలేదు. 83వ నిమిషంలో రొనాల్డో ఎల్లోకార్డ్‌కు గురయ్యాడు. మ్యాచ్ ఇంజ్యూరీ సమయంలో తొలి రెండు నిమిషాలు ఇరాన్‌కు వీఏఆర్ పెనాల్టీ ఇవ్వడంపైనే గడిచాయి. 90+3వ నిమిషంలో కరీం ఎలాంటి పొరపాటు చేయకుండా గోల్ కొట్టి జట్ల స్కోరు సమం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment