
తొలి టెస్టులో అత్యుత్సాహంతో దురుసుగా ప్రవర్తించిన టీమిండియా సీనియర్ బౌలర్ ఇషాంత్ శర్మను ఐసీసీ మందలించింది.
బర్మింగ్‌హామ్ : ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో సత్తాచాటిన టీమిండియా పేసర్ ఇషాంత్ శర్మను ఐసీసీ మందలించింది. ఎడ్జ్‌బాస్టన్ టెస్టు మూడోరోజు ఆటలో దురుసు ప్రవర్తన కారణంగా ఇషాంత్‌కు మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధించడంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చారు. శుక్రవారం ఆట తొలి సెషన్‌లో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ మలాన్ ఔటైన అనంతరం ఇషాంత్ దురుసుగా ప్రవర్తించాడని అభియోగం నమోదైంది.
ఐసీసీ ప్రవర్తనా నియామావళి ప్రకారం.. ఎవరైనా క్రికెటర్ ఔటైన తర్వాత ప్రత్యర్థి జట్టు ఆటగాడు మాటలతో కానీ, లేక చేతలతో కానీ (సంజ్ఞలు) వెటకారం చేయకూడదు. ఇలా చేస్తే ఐసీసీ రూల్స్ ప్రకారం ఆర్టికల్ 2.1.7 ను అనుసరించి ఆటగాడికి గరిష్టంగా 50శాతం ఫీజులో కోతతో పాటు 1 లేక 2 డీమెరిట్ పాయింట్లు కేటాయిస్తారు. మ్యాచ్ రిఫరీ జెఫ్ క్రో ఎదుట బౌలర్ ఇషాంత్ తన తప్పిదాన్ని అంగీకరించడంతో శిక్ష పరిమితిని తగ్గించినట్లు సమాచారం. మరోసారి ఇలాంటివి జరగకుండా జాగ్రత్తగా ఉంటానని ఇషాంత్ పేర్కొన్నాడు. కాగా, తొలి టెస్ట్‌లో టీమిండియా 162 పరుగులకే ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్ 31 పరుగుల తేడాతో అనూహ్య విజయం సాధించింది. 5 టెస్టుల సిరీస్‌లో 1-0తో ఇంగ్లండ్ ఆధిక్యంలో ఉంది.