'వారితో ఫైనల్ ఈజీ కాదు'
డెర్బీ: అద్భుత ప్రదర్శనతో మహిళా వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరి ఆనందంలో ఉన్న భారత జట్టు సభ్యులను కెప్టెన్ మిథాలీ రాజ్ హెచ్చరించింది. ఫైనల్ ప్రత్యర్థి ఇంగ్లండ్ ను అంత తేలికగ్గా తీసుకోవద్దని ముందుగానే జట్టు సభ్యులకు స్పష్టం చేసింది. ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జాగ్రత్తగా ఉండాలని.. ఆచితూచి ఆడాలని సహచరులకు సూచించింది. ఆదివారం లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లాండ్‌ల మధ్య ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే. భారత మహిళా జట్టు ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరడం ఇది రోండోసారి. గతంలోనూ మిథాలీ రాజ్ నేతృత్వంలో ఫైనల్‌కు చేరిన భారత జట్టు.. ఈ సారి ఎలాగైన కప్పు గెలవాలనే కృత నిశ్చయంతో ఉంది.
రెండో సెమీఫైనల్‌లో హర్మన్ ప్రీత్‌కౌర్ అద్వితీయ ఇన్నింగ్స్‌తో పటిష్ట ఆస్ట్రేలియాను మట్టి కరిపించిన అనంతరం మిథాలీ రాజ్ మీడియాతోమాట్లాడింది. ‘ప్రపంచకప్ ఫైనల్లో భాగమవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్ కోసం జట్టు సభ్యులందరు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. గతంలో(2005) నా నాయకత్వంలో తొలిసారి భారత జట్టు ఫైనల్‌కి చేరింది. మళ్లీ ఇప్పుడు నా సారథ్యంలోనే ఫైనల్‌కు చేరుకోవడం చాలా ఆనందంగా ఉంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌పై 35 పరుగుల తేడాతో విజయం సాధించాం. ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు అనూహ్యరీతిలో పుంజుకొని ఫైనల్‌కు చేరింది. అలాంటి జట్టుతో ఫైనల్‌లో తలపడటం సులభం కాదు. అది సొంతగడ్డపై మరీ కష్టం. ఫైనల్‌లో ఇరుజట్ల మధ్య పోటీ ఆసక్తికరంగా ఉంటుంది. ఫైనల్లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని’ మిథాలీ తెలిపారు.