హమ్మయ్యా.. నన్ను కోచ్ను చేయలేదు!
సిడ్నీ: ఏ జట్టుకైనా కోచ్గా నియమించబడటం అంటే అది అరుదైన గౌరవం. అంతటి హై ప్రొఫైల్ జాబ్ను ఏ మాజీ ఆటగాడు కూడా వదులుకోడు. ఒక జట్టు కోచింగ్ పదవులు ఇచ్చే క్రమంలో తీవ్రమైన పోటీ కూడా ఉంటుంది. అయితే తనకు కోచింగ్ పదవి ఇవ్వకపోవడంపై ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాసన్ గిలెస్పీ భిన్నంగా స్పందించాడు. గతంలో ఇంగ్లండ్ ప్రధాన కోచ్ పదవికి గిలెస్పీ పేరు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. అయితే చివరి నిమిషంలో ఆ పదవి గిలెస్పీని వరించలేదు. ఆ కీలకమైప పదవిని ఆస్ట్రేలియాకే చెందిన ట్రెవర్ బాలిస్ అప్పగించారు. అప్పట్లో ఈ విషయంపై గిలెస్పీ ఎలా స్పందించాడు అనేది అప్రస్తుతమైతే.. ఇప్పుడు మాత్రం ఆ పదవి తనకు ఇవ్వకుండా మంచి పని చేశారని అంటున్నాడు. ఇలా ఇంగ్లండ్ క్రికెట్ తన పేరును పక్కకు పెట్టడంతో కావాల్సినంత విశ్రాంతి దొరికిందని స్పష్టం చేశాడు.
'ప్రపంచ క్రికెట్ లో కోచ్ పదవి అనేది ఒక ఉత్తమైన జాబ్. ఇంగ్లండ్ కోచ్ పదవి అన్వేషణలో నా పేరు వినిపించింది. ఒకవేళ వారు కాల్ చేసి ఉంటే సమాధానం చెప్పడానికి ఇబ్బంది పడేవాన్ని. ఆ పదవి నాకు ఇవ్వకుండా మంచి పని చేశారు. అలా జరగడం వల్ల కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే ఆస్కారం దొరికింది' అని గిలెస్పీ తెలిపాడు.
గతేడాది వెస్టిండీస్ తో జరిగిన టెస్టు సిరీస్ను ఇంగ్లండ్ డ్రా చేసుకోవడమే కాకుండా, ఈ ఏడాది టీ 20 వరల్డ్ కప్ ఫైనల్లో విండీస్ చేతిలో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. దీంతో ఇంగ్లండ్ జట్టు మార్పులు చేపట్టింది. తమ జట్టు కోచ్ పదవి నుంచి పీటర్స్ మూర్స్ ను తప్పించింది. ఆ క్రమంలోనే గిలెస్పీ పేరు ఎక్కువగా వార్తల్లో నిలిచినా, చివరకు ట్రెవర్ బాలిస్ కు కట్టబెట్టడం జరిగిపోయింది.