టీమిండియాతో మ్యాచ్ లను బహిష్కరిస్తేనే..
కరాచీ: తమతో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ లు ఆడటానికి విముఖత వ్యక్తం చేస్తున్న భారత జట్టుతో పూర్తిస్థాయి సంబంధాలను తెంచుకోవటమే ఉత్తమమైన మార్గమని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ అభిప్రాయపడ్డాడు. భారత్ తో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్వహించే మ్యాచ్ లను సైతం బాయ్ కాట్ చేయాలని ఈ మేరకు పాక్ క్రికెట్ కు సూచించాడు. అసలు తమతో ద్వైపాక్షిక సిరీస్ లు జరపడానికి భారత్ ను ఒప్పించలేని ఐసీసీ.. వారు నిర్వహించే టోర్నీల్లో భారత్ తో పాకిస్తాన్ ను ఆడించడానిక ముందుకు రావడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించాడు. భారత్ తో మ్యాచ్ లను ఆడకుండా దూరంగా ఉన్నప్పుడే ఐసీసీకి తగిన బుద్ది చెప్పినట్లు అవుతుందన్నాడు.
'మనం ఎప్పుడైతై భారత్ తో జరిగే ఐసీసీ టోర్నీలకు దూరంగా ఉంటామో.. అప్పుడు ఆ టోర్నీ ఆదరణ కూడా తగ్గుతుంది. దాంతో ఐసీసీని ఆర్ధికంగా ఇబ్బందులకు గురి చేయొచ్చు. అలా చేసిన క్రమంలో మనకు తగిన గౌరవం ఉండటమే కాదు.. మన మాటను కూడా ఐసీసీ వినడానికి ముందుకొస్తుంది. అంతేకానీ ఐసీసీపై స్ట్రైక్ చేయకుండా ఉంటే మాత్రం మనం ఏమీ సాధించలేము. ఐసీసీలో మన మాట వినేవారే లేరు. అక్కడ అంతా బీసీసీఐదే హవా. ఐసీసీలో బీసీసీఐ చాలా బలంగా ఉంది. బీసీసీఐ రూ.100 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఐసీసీని ఆశ్రయించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇక్కడ మన సమయంతో పాటు, డబ్బు కూడా వృథా ప్రయాసగానే మిగిలిపోతుంది. టీమిండియాతో మొత్తం మ్యాచ్ లను బహిష్కరించే ఐసీసీపై తిరుగుబాటు చేయండి. ఇప్పటికే చాలా నష్టపోయిన మనకు పోగొట్టుకోవడానికి ఏమీ లేదు.భారత్ తో ఐసీసీ మ్యాచ్ లను బాయ్ కాట్ ఒక్కటే సరైన మార్గం'అని మియాందాద్ పేర్కొన్నాడు.