అడిలైడ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తరహాలో మైదానంలో దూకుడుగా ఉండటం తమ ఆటగాళ్ల నైజం కాదని అంటున్నాడు ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్. ప‍్రధానంగా భారత బౌలర్లు వికెట్లు తీసినప్పుడు కోహ్లి చేసుకునే సంబరాలు చాలా అతిగా ఉంటాయంటూ విమర్శించాడు. కోహ్లి తరహాలో సెలబ్రేట్ చేసుకోవడానికి తమ ఆటగాళ్లు చాలా దూరంగా ఉంటారన్నాడు. తమ బౌలర్లు వికెట్లు తీసిన సందర్భాల్లో ఓవర్ చేస్తే తమను అంతా భిన్నంగా చూస్తారన్నాడు.
తాజాగా ఫాక్స్ క్రికెట్‌తో మాట్లాడిన లాంగర్..‘ మా జట్టు క్రికెటర్లు కోహ్లిలా మొరటోళ్లు కాదు. కోహ్లిలా మా ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటే అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కూడా కాదు. ఒకవేళ మేము వికెట్ తీసిన క్రమంలో విరాట్ కోహ్లిలా సంబరాలు చేసుకుంటే అభిమానుల మమ్మల్ని తేడాగా చూస్తారు. ఒక జట్టు కెప్టెనే కాకుండా క్రికెట్ అనే గేమ్‌లో ఒక సూపర్ స్టార్ కోహ్లి. ఇది అందరికీ తెలిసిన విషయమే. గత కొంతకాలంగా ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో కోహ్లి గురించే చర్చ. మా దేశ పర్యటనకు టీమిండియా వచ్చే సందర్భంలో కోహ్లిపై పైచేయి సాధించాలని మాత్రమే మా ఆటగాళ్లు సమాలోచనలు చేశారు. అది ఆటపై ఉన్న ప్రేమను చూపెడుతుంది. అలా కాకుండా కోహ్లి మైదానంలో ఎలా వ్యవహరిస్తాడో అలా చేస్తే మనం కూడా ప్రపంచ క్రికెట్‌లో మొరటవాళ్లగానే మిగిలిపోతాం. మైదానంలో కోహ్లిలా అతి చేయడం సరైన విధానమా’ అని లాంగర్ వ్యంగ్యంగా స్పందించాడు.
ఆసీస్‌తో తొలి టెస్టులో భాగంగా అరోన్ ఫించ్ డకౌట్‌గా నిష్క్రమించిన క్రమంలో కోహ్లి సంబరాలు చేసుకున్న తీరును లాంగర్ తప్పుబట్టాడు. కోహ్లి గాల్లోకి పంచ్‌లు విసురుతూ సెలబ్రేట్ చేసుకోవడం రుచించని లాంగర్ అసహనం వ్యక్తం చేశాడు. అదే సమయంలో తమ ఆటగాళ్లు ఈ రకమైన చర్యలకు ఎప్పుడూ పాల్పడరంటూ గొప్పలు చెప్పుకునే యత్నం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment