కివీస్... కాచుకో! | Kane Williamson hopes middle-order fires in India vs New Zealand | Sakshi
Sakshi News home page

కివీస్... కాచుకో!

Published Sun, Oct 22 2017 2:31 AM | Last Updated on Wed, Oct 17 2018 4:43 PM

Kane Williamson hopes middle-order fires in India vs New Zealand - Sakshi

తమ జైత్రయాత్రను నిరాటంకంగా కొనసాగించేందుకు భారత క్రికెట్‌ జట్టు మరోసారి సిద్ధమవుతోంది. ఇటీవలే ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకున్న టీమిండియా... న్యూజిలాండ్‌తో నేడు మొదలయ్యే మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. అన్ని విభాగాల్లో అత్యంత పటిష్టంగా కనిపిస్తూ దూకుడు మీదున్న కోహ్లి సేన... కివీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలనే పట్టుదలతో ఉంది. ఏడాది క్రితం జరిగిన ఐదు వన్డేల సిరీస్‌లో కివీస్‌ గట్టి పోటీనే ఇచ్చింది. అయితే ఈసారి తమ భీకర ఫామ్‌తో కివీస్‌ను కుమ్మేసేందుకు టీమిండియా ప్రణాళిక రచిస్తోంది. ఇదే జరిగితే ఇప్పటికే వరుసగా ఆరు వన్డే సిరీస్‌లను తమ ఖాతాలో వేసుకున్న భారత జట్టుకు ఏడో సిరీస్‌ కూడా దక్కడం అంత కష్టమేమీ కాబోదు.


ముంబై: నిలకడైన విజయాలతో ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తున్న భారత జట్టు ఇక తమ సత్తాను న్యూజిలాండ్‌కు రుచి చూపించనుంది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు వాంఖడే మైదానంలో తొలి డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌ జరగనుంది. ప్రపంచ చాంపియన్‌ ఆస్ట్రేలియాను మట్టి కరిపించిన ఊపులో ఉన్న కోహ్లి సేనకు కివీస్‌ కూడా గట్టి పోటీనివ్వాలనే ఆలోచనతో బరిలోకి దిగబోతోంది. చివరిసారిగా ఈ మైదానంలో ఆడిన భారత్‌కు దక్షిణాఫ్రికా చేతిలో దారుణ పరాజయం ఎదురైంది.

అయితే ఆ తర్వాత జట్టు మూడు సిరీస్‌లను గెలవగలిగింది. వాస్తవానికి 2009–10లో ఆసీస్‌ చేతిలో ఓడిన అనంతరం టీమిండియా స్వదేశంలో పాక్‌ (2012)పై, దక్షిణాఫ్రికా (2015)పై మాత్రమే సిరీస్‌లను కోల్పోయింది. దీన్నిబట్టి చూస్తే సొంతగడ్డపై భారత్‌ ఏస్థాయిలో చెలరేగుతోందో అర్థమవుతోంది.

ఆసీస్‌తో జరిగిన చివరి సిరీస్‌లో కెప్టెన్‌ కోహ్లి పూర్తి ఫామ్‌లో లేకపోవడంతో పాటు ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ఆడకపోయినా 4–1తో సిరీస్‌ను దక్కించుకోగలిగింది. ఇది భారత జట్టు ఆల్‌రౌండ్‌ షోను ప్రతిబింబిస్తోంది. ఇదే ముప్పేట దాడి కివీస్‌పైనా కొనసాగిస్తే ఆ జట్టు కోలుకోవడం కష్టమే. మరోవైపు ఐసీసీ ఇటీవల సవరించిన నిబంధనల ప్రకారం భారత్‌ తొలిసారిగా వన్డే సిరీస్‌ ఆడబోతోంది.

అన్ని విభాగాల్లో పటిష్టంగా...
భారత జట్టులో ప్రస్తుతం ఎలాంటి లోపాలు కనిపించడం లేదు. ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ సెంచరీ, రెండు అర్ధ సెంచరీలతో దాదాపు 60 సగటుతో 296 పరుగులు సాధించాడు. ఇక రహానే నాలుగు అర్ధ సెంచరీలతో 244 పరుగులు చేశాడు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా 222 పరుగులతో సత్తా చాటుకున్నాడు. అయితే ధావన్‌ తిరిగి జట్టులో చేరడంతో రహానే మరోసారి బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది.

మనీష్‌ పాండే, దినేశ్‌ కార్తీక్‌లలో ఎవరిని మిడిలార్డర్‌లో పంపిస్తారో ఆసక్తికరం. కోహ్లి ఈ సిరీస్‌లో తన ఫామ్‌ను దొరకబుచ్చుకుంటే మాత్రం భారత విజయాలకు ఢోకా లేనట్టే. అటు స్పిన్‌ ద్వయం కుల్దీప్‌ యాదవ్, యజువేంద్ర చహల్‌ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను చుట్టేయడంలో పోటీ పడుతున్నారు. పేస్‌ బౌలింగ్‌లో భువనేశ్వర్, బుమ్రా ఎప్పటిలాగే ఆరంభంలో, చివర్లో కివీస్‌ను దెబ్బతీసేందుకు ఎదురుచూస్తున్నారు.

ఎదుర్కొనే సత్తా ఉందా?
కివీస్‌ ప్రధానంగా ఓపెనర్‌ మార్టిన్‌ గప్టిల్, కెప్టెన్‌ విలియమ్సన్, రాస్‌ టేలర్‌ బ్యాటింగ్‌పై ఎక్కువగా ఆధారపడి ఉంది. రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో టేలర్‌తో కలిసి టామ్‌ లాథమ్‌ సెంచరీతో రాణించడం ఆ జట్టుకు లాభమే. మున్రో, గప్టిల్‌ ఓపెనర్లుగా దిగనుండగా... లాథమ్‌ మిడిలార్డర్‌లో వస్తాడని విలియమ్సన్‌ చెప్పాడు. అయితే ఉపఖండ పరిస్థితుల్లో భారత జట్టుతో పోలిస్తే వీరి బ్యాటింగ్‌ ఆర్డర్‌ ఏమేరకు రాణిస్తుందో ప్రశ్నార్థకమే. బౌలింగ్‌ విభాగంలో సీనియర్‌ పేసర్లు బౌల్ట్, సౌతీ ప్రారంభంలో వికెట్లను తీసే బాధ్యత తీసుకోనున్నారు. మధ్య ఓవర్లలో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ సాన్‌ట్నర్, లెగ్‌ స్పిన్నర్‌ సోధిలకు భారత బ్యాట్స్‌మెన్‌ నుంచి సవాల్‌ ఎదురుకానుంది.

జట్టులో మూడో ఓపెనర్‌గా రహానే తనకు లభించిన అవకాశాలను చక్కగా వినియోగించుకున్నాడు. అటు లోకేశ్‌ రాహుల్‌ కూడా ఓపెనింగ్‌ స్థానం కోసం పోటీలో ఉన్నా రహానే ఆకట్టుకున్నాడు. ఓపెనింగ్‌ కోసం నలుగురు సమర్థ ఆటగాళ్లు సిద్ధంగా ఉండడం జట్టులో పోటీ వాతావరణాన్ని సూచిస్తోంది. కానీ చివరికి ఇద్దరికి మాత్రమే అవకాశం ఉంటుంది. అయితే రహానేను మిడిలార్డర్‌లో ఆడించి అతడిని అయోమయానికి గురి చేయడం ఇష్టం లేదు. వన్డేల్లో అతను టాప్‌ ఆర్డర్‌లో అద్భుత ఆటగాడు. నిజానికి మేం ఇద్దరు స్పిన్నర్లతో ఆడొద్దనే అనుకుంటాం.

కానీ కుల్దీప్, చహల్‌ మమ్మల్ని ప్రతీ మ్యాచ్‌లో ఆడించేలా చేస్తున్నారు. అశ్విన్, జడేజా ఆరేడేళ్లు నిరంతరంగా పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో ఆడుతున్నారు. ఇప్పుడు ఈ యువ స్పిన్నర్లు ప్రపంచకప్‌ కోసం గట్టి పోటీదారులుగా ఉన్నారు. అలాగే వన్డేల్లో కొత్త నిబంధనలు చాలా ఆసక్తిగా ఉండబోతున్నాయి. వీటిపై ఆటగాళ్లు తొందరగా అవగాహన తెచ్చుకోవాల్సి ఉంది. – విరాట్‌ కోహ్లి, భారత కెప్టెన్‌


సొంతగడ్డపై భారత జట్టును ఓడించడం చాలా కష్టం. ఇక్కడ వారికి అద్భుత రికార్డు ఉంది. కచ్చితంగా మేం అత్యుత్తమ స్థాయి క్రికెట్‌ ఆడాల్సిందే. గతేడాది భారత్‌పై వన్డే సిరీస్‌ను చివరి వరకు తేగలిగాం. ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావీయకుండా ఆడతాం. – విలియమ్సన్, న్యూజిలాండ్‌ కెప్టెన్‌


200 భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికిది 200వ వన్డే మ్యాచ్‌.

వన్డేల్లో వేగంగా 50 వికెట్ల మైలురాయిని అందుకున్న రెండో బౌలర్‌గా నిలిచేందుకు బుమ్రాకు కావాల్సిన వికెట్ల సంఖ్య.

1 వాంఖడే మైదానంలో భారత్‌ను ఎదుర్కోవడం కివీస్‌కు ఇదే తొలిసారి.

జట్లు: (అంచనా) భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రహానే, ధావన్, మనీష్‌ పాండే/దినేశ్‌ కార్తీక్, కేదార్‌ జాదవ్, ధోని, పాండ్యా, భువనేశ్వర్, కుల్దీప్, చహల్, బుమ్రా.
కివీస్‌: విలియమ్సన్‌ (కెప్టెన్‌), గప్టిల్, మున్రో, టేలర్, లాథమ్, గ్రాండ్‌హోమ్, నికోల్స్‌/వర్కర్, సాన్‌ట్నర్, సౌతీ, బౌల్ట్, సోధి.


పిచ్, వాతావరణం
ముంబైలో 31 డిగ్రీల ఉష్ణోగ్రతతో కాస్త వేడి వాతావరణమే ఉండనుండటంతో మ్యాచ్‌కు వర్షం నుంచి ఎలాంటి ఆటంకం లేదు. బ్యాట్స్‌మెన్‌ భారీ షాట్లు ఆడేందుకు పిచ్‌ అనుకూలించనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement