గెలుపు రాస్‌ పెట్టాడు | New Zealand beat India by 4 wickets | Sakshi
Sakshi News home page

గెలుపు రాస్‌ పెట్టాడు

Published Thu, Feb 6 2020 4:52 AM | Last Updated on Thu, Feb 6 2020 5:22 AM

New Zealand beat India by 4 wickets - Sakshi

రాస్‌ టేలర్‌, నికోల్స్‌

ఎట్టకేలకు న్యూజిలాండ్‌ గెలుపు రుచి చూసింది. సొంతగడ్డపై వరుసగా 9 అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఓటమి తర్వాత ఆ జట్టుకు ఊరట లభించింది. అది కూడా అసాధారణ విజయంతో దక్కింది. తమ వన్డే చరిత్రలో అతి పెద్ద లక్ష్యాన్ని ఛేదించి కివీస్‌ సగర్వంగా నిలిచింది. టి20ల్లో 0–5తో క్లీన్‌స్వీప్‌కు గురైన వేదనను మరచిపోయేలా భారత్‌పై తొలి వన్డేలో అద్భుత ప్రదర్శనతో ఆ జట్టు ఆకట్టుకుంది. సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ రాస్‌ టేలర్‌ సెంచరీతో ముందుండి నడిపించగా... కెప్టెన్‌ లాథమ్, నికోల్స్‌ కీలక పాత్ర పోషించారు. టీమిండియా తరఫున శ్రేయస్‌ అయ్యర్‌ తొలి వన్డే సెంచరీ, రాహుల్‌ మెరుపు బ్యాటింగ్‌ చివరకు వృథా కాగా, పేలవ బౌలింగ్‌తో జట్టు భంగపడాల్సి వచ్చింది. మొత్తంగా భారీ స్కోర్లతో పరుగుల వరద పారిన సెడన్‌ పార్క్‌లో చివరకు ఆతిథ్య జట్టుదే పైచేయి అయింది. 
   
హామిల్టన్‌: భారత్‌తో వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్‌ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో కివీస్‌ 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 347 పరుగులు సాధించింది. శ్రేయస్‌ అయ్యర్‌ (107 బంతుల్లో 103; 11 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీతో చెలరేగగా... కేఎల్‌ రాహుల్‌ (64 బంతుల్లో 88 నాటౌట్‌; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (63 బంతుల్లో 51; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు.

లాథమ్‌

అనంతరం న్యూజిలాండ్‌ 48.1 ఓవర్లలో 6 వికెట్లకు 348 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రాస్‌ టేలర్‌ (84 బంతుల్లో 109 నాటౌట్‌; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో అదరగొట్టాడు. అతనికి కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌ (48 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), హెన్రీ నికోల్స్‌ (82 బంతుల్లో 78; 11 ఫోర్లు) అండగా నిలిచారు. టేలర్, లాథమ్‌ నాలుగో వికెట్‌కు 13.2 ఓవర్లలోనే 138 పరుగులు జోడించారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్‌ 1–0తో ముందంజ వేయగా... ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం ఆక్లాండ్‌లో జరుగుతుంది.  

కీలక భాగస్వామ్యాలు...
ఇద్దరు కొత్త ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌ (31 బంతుల్లో 32; 6 ఫోర్లు), పృథ్వీ షా (20)లతో భారత ఇన్నింగ్స్‌ ప్రారంభమైంది. తొలి ఓవర్‌ను మెయిడిన్‌గా ఆడిన షా తొమ్మిదో బంతికి వన్డేల్లో ఖాతా తెరిచాడు. ఆ తర్వాత వీరిద్దరు చకచకా పరుగులు రాబట్టారు. ఒక దశలో 17 బంతుల వ్యవధిలో 7 ఫోర్లు వచ్చాయి. అయితే ఈ భాగస్వామ్యం 50 పరుగులకు చేరాక గ్రాండ్‌హోమ్‌ బౌలింగ్‌లో షా వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్లోనే మయాంక్‌ కూడా అవుటయ్యాడు.

ఇలాంటి స్థితిలో కోహ్లి, అయ్యర్‌ కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. కోహ్లి వేగంగా ఆడగా అయ్యర్‌ మాత్రం నిలదొక్కుకునేందుకు ఎక్కువ సమయం తీసుకున్నాడు. 9 పరుగుల వద్ద కష్టసాధ్యమైన క్యాచ్‌ను టేలర్‌ వదిలేయడంతో అయ్యర్‌ బతికిపోయాడు. ఆ తర్వాత వీరిద్దరు చక్కటి సమన్వయంతో జాగ్రత్తగా ఆడారు. కోహ్లి తనదైన శైలిలో కొన్ని చూడచక్కటి షాట్లతో అలరించాడు. మూడో వికెట్‌కు వీరిద్దరు 20.1 ఓవర్లలో 102 పరుగులు జోడించారు. అయితే ఓవర్‌కు 5.07 పరుగుల చొప్పున మాత్రమే పరుగులు రాబట్టగలిగారు. ఈ దశలో లెగ్‌ స్పిన్నర్‌ సోధిని బౌలింగ్‌కు దించి కివీస్‌ మంచి ఫలితం సాధించింది.

అప్పుడే హాఫ్‌ సెంచరీ మార్క్‌ను దాటిన కోహ్లిని సోధి తన తొలి ఓవర్లోనే ‘గుగ్లీ’తో క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. ఇక భారత్‌ను నిలువరించవచ్చని ప్రత్యర్థి భావిస్తున్న తరుణంలో రాహుల్‌ సవాల్‌ విసిరాడు. మరోవైపు 66 బంతుల్లో అయ్యర్‌ అర్ధ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత వీరిద్దరు దూకుడుగా ఆడి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. సోధి ఓవర్లో రెండు వరుస సిక్సర్లు బాదిన రాహుల్‌ ఆ తర్వాత సౌతీ ఓవర్లోనూ ఇదే తరహాలో చెలరేగాడు. సౌతీ తర్వాతి ఓవర్లో అయ్యర్‌ 3 ఫోర్లు బాదడంతో 15 పరుగులు వచ్చాయి. 83 పరుగుల వద్ద గ్రాండ్‌హోమ్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన అయ్యర్‌... సాన్‌ట్నర్‌ ఓవర్లో సింగిల్‌ తీసి కెరీర్‌లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్లో రాహుల్‌ అర్ధ సెంచరీ కూడా పూర్తయింది.

ఆ మూడు ఓవర్లు...
భారత్‌ తమ చివరి 6 ఓవర్లలో 62 పరుగులు చేయగలిగింది. ఇందులో సౌతీ వేసిన 48వ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. కేదార్‌ జాదవ్‌ (15 బంతుల్లో 26 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) వరుస బంతుల్లో 4, 6, 4 బాదగా రాహుల్‌ మరో ఫోర్‌ కొట్టాడు. అయితే మిగిలిన ఐదు ఓవర్లలో 3 ఓవర్లు వేసిన బెన్నెట్‌ 6, 8, 7 చొప్పున మాత్రమే పరుగులు ఇవ్వడంతో టీమిండియా మరింత భారీ స్కోరుకు దూరమైంది.  

వీరబాదుడు...
తొలి పది ఓవర్ల పవర్‌ప్లేలో 54 పరుగులు... ఇలాంటి సాధారణ ఆరంభం తర్వాత కూడా కివీస్‌ భారీ లక్ష్యాన్ని ఛేదించగలిగింది. ఓపెనర్లు గప్టిల్‌ (41 బంతుల్లో 32; 1 ఫోర్‌), నికోల్స్‌ జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 85 పరుగులు జోడించారు. అయితే తాను ఎదుర్కొన్న 35వ బంతికి బౌండరీ కొట్టగలిగిన గప్టిల్‌ ఆ వెంటనే వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన బ్లన్‌డెల్‌ (9) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. సగం ఓవర్లు ముగిసేసరికి కివీస్‌ స్కోరు 147 పరుగులకు చేరింది. అర్ధ సెంచరీ అనంతరం కోహ్లి అద్భుత ఫీల్డింగ్‌కు నికోల్స్‌ రనౌటయ్యాడు. ఈ దశలో భారత్‌కు మ్యాచ్‌పై పట్టు చిక్కినట్లు అనిపించింది. అయితే టేలర్, లాథమ్‌ భాగస్వామ్యం ఆ ఆనందాన్ని దూరం చేసింది.

21.3 ఓవర్లలో 177 పరుగులు చేయాల్సిన దశలో జత కలిసిన వీరిద్దరు స్వేచ్ఛగా బ్యాట్‌ ఝళిపిస్తూ వేగంగా పరుగులు రాబట్టారు. ముఖ్యంగా కుల్దీప్, శార్దుల్‌పై బ్యాట్స్‌మెన్‌ విరుచుకు పడ్డారు. ఫలితంగా 4 ఓవర్లలో 44 పరుగులు వచ్చాయి. 45 బంతుల్లో టేలర్‌ హాఫ్‌ సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత జడేజా ఓవర్లో కూడా 2 ఫోర్లు, సిక్స్‌ సహా మొత్తం 15 పరుగులు వచ్చాయి. 38 బంతుల్లో లాథమ్‌ అర్ధ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. భారీ భాగస్వామ్యం తర్వాత ఎట్టకేలకు కుల్దీప్‌ బౌలింగ్‌లో లాథమ్‌ అవుట్‌ కావడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది. ఆ వెంటనే నీషమ్‌ (9), గ్రాండ్‌హోమ్‌ (1) ఒకే ఓవర్లో వెనుదిరగడంతో న్యూజిలాండ్‌ శిబిరంలో కొంత ఆందోళన పెరిగింది. అయితే శార్దుల్‌ ఓవర్లో సాన్‌ట్నర్‌ (12 నాటౌట్‌) ఫోర్, సిక్స్‌ బాది ఒత్తిడి తగ్గించాడు. చివరకు మరో 11 బంతులు మిగిలి ఉండగానే టేలర్‌ తమ జట్టును గెలిపించాడు.  

స్కోరు వివరాలు  
భారత్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) లాథమ్‌ (బి) గ్రాండ్‌హోమ్‌ 20; మయాంక్‌ (సి) బ్లన్‌డెల్‌ (బి) సౌతీ 32; కోహ్లి (బి) సోధి 51; అయ్యర్‌ (సి)  సాన్‌ట్నర్‌ (బి) సౌతీ 103; రాహుల్‌ (నాటౌట్‌) 88; కేదార్‌ జాదవ్‌ (నాటౌట్‌) 26; ఎక్స్‌ట్రాలు 27; మొత్తం (50 ఓవర్లలో 4 వికెట్లకు) 347.  

వికెట్ల పతనం: 1–50; 2–54; 3–156; 4–292.  బౌలింగ్‌: సౌతీ 10–1–85–2; బెన్నెట్‌ 10–0–77–0; గ్రాండ్‌హోమ్‌ 8–0–41–1; నీషమ్‌ 8–0–52–0; సాన్‌ట్నర్‌ 10–0–58–0; సోధి 4–0–27–1.  

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: గప్టిల్‌ (సి) జాదవ్‌ (బి) శార్దుల్‌ 32; నికోల్స్‌ (రనౌట్‌) 78; బ్లన్‌డెల్‌ (స్టంప్డ్‌) రాహుల్‌ (బి) కుల్దీప్‌ 9; టేలర్‌ (నాటౌట్‌) 109; లాథమ్‌ (సి) షమీ (బి) కుల్దీప్‌ 69; నీషమ్‌ (సి) జాదవ్‌ (బి) షమీ 9; గ్రాండ్‌హోమ్‌ (రనౌట్‌) 1; సాన్‌ట్నర్‌ (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు 29; మొత్తం (48.1 ఓవర్లలో 6 వికెట్లకు) 348.

వికెట్ల పతనం: 1–85; 2–109; 3–171; 4–309; 5–328; 6–331. బౌలింగ్‌: బుమ్రా 10–1–53–0; షమీ 9.1–0–63–1; శార్దుల్‌ 9–0–80–1; జడేజా 10–0–64–0; కుల్దీప్‌ 10–0–84–2.

22 పరుగుల ఓవర్‌...
శార్దుల్‌ ఠాకూర్‌ వేసిన ఇన్నింగ్స్‌ 40వ ఓవర్లో కివీస్‌ పండగ చేసుకుంది. లాథమ్‌ ఒక సిక్స్‌ బాదగా...టేలర్‌ చివరి మూడు బంతుల్లో 6, 4, 4 కొట్టాడు. దాంతో మొత్తం 22 పరుగులు లభించాయి.  

42 బంతుల్లోనే...
టేలర్, లాథమ్‌ చెలరేగిన వేళ కివీస్‌ దూకుడుకు ఎదురు లేకుండా పోయింది. వీరిద్దరు క్రీజ్‌లో ఉన్న సమయంలో స్కోరు 200 నుంచి 300 పరుగులకు చేరేందుకు ఆ జట్టుకు కేవలం 42 బంతులే సరిపోవడం విశేషం.

56 ఎక్స్‌ట్రాలు!
మ్యాచ్‌లో ఎక్స్‌ట్రాల రూపంలో ఏకంగా 56 పరుగులు నమోదయ్యాయి. న్యూజిలాండ్‌ 27 అదనపు  పరుగులు ఇవ్వగా, భారత్‌ 29 పరుగులు సమర్పించుకుంది. కివీస్‌ 19 వైడ్లు వేయగా...టీమిండియా బౌలర్లు ఏకంగా 24 వైడ్లు వేశారు. అత్యధికంగా బుమ్రానే 9 వైడ్లు ఇచ్చాడు!  

రాహుల్‌, అయ్యర్‌




 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement