దిగ్గజాల వీడ్కోలు | KC Sangakkara and Mahela Jayawardene leave the pitch together for final time | Sakshi
Sakshi News home page

దిగ్గజాల వీడ్కోలు

Published Thu, Mar 19 2015 1:04 AM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

దిగ్గజాల వీడ్కోలు - Sakshi

దిగ్గజాల వీడ్కోలు

ఒకటి, రెండేళ్లు కాదు... సుమారు దశాబ్దంన్నర కాలం పాటు ఆ ఇద్దరు శ్రీలంక క్రికెట్ బాధ్యతలు మోశారు. విజయాల్లో, పరాజయాల్లో అండగా, తోడుగా నిలిచారు. రికార్డు భాగస్వామ్యాల్లో కలిసి సాగారు. సీనియర్లు తప్పుకున్న దశలో జట్టును నిలబెట్టి...ఆ తర్వాత జూనియర్లకు దిశానిర్దేశం చేశారు. గత పదిహేనేళ్ల కాలంలో సంగక్కర, జయవర్ధనే లేని లంక జట్టును ఊహించలేము.

మైదానం బయట కూడా ‘బెస్ట్ ఫ్రెండ్స్’, వ్యాపార భాగస్వాములు అయిన సంగక్కర, మహేల బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌తో అంతర్జాతీయ వన్డేలకు వీడ్కోలు పలికారు. టెస్టులనుంచి గత ఆగస్టులోనే తప్పుకున్న జయవర్ధనే కెరీర్ ఇప్పుడు పూర్తిగా ముగియగా... ఈ ఏడాది ఆగస్టులో భారత్‌తో టెస్టు సిరీస్ తర్వాత సంగక్కర కూడా పూర్తిగా గుడ్‌బై చెప్పనున్నాడు.

కళాత్మక బ్యాటింగ్ నైపుణ్యమే కాదు... పోరాటపటిమకు, పట్టుదలకు మారుపేరుగా వీరు లంక క్రికెట్ స్థాయిని పెంచారు. జట్టు కష్టాల్లో ఉన్న ప్రతీసారి తమ అద్భుత ఆటతో ఆదుకున్నారు. ఒకరితో ఒకరు పోటీ పడుతూ సమఉజ్జీలుగా నిలిచారు. ఇద్దరు దిగ్గజాలు తప్పుకోవడం లంకకే కాదు ప్రపంచ క్రికెట్‌కూ తీరని లోటు. ఇకపై ఆ స్థాయి ఆటగాళ్లు ఆ జట్టునుంచి రావడం ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. అయితే ఈ దిగ్గజాలు ఓటమితో నిరాశగా కెరీర్‌ను ముగించడం బాధాకరం. రిటైర్మెంట్ ప్రకటించిన ఈ ఇద్దరు ఆటగాళ్లకు సచిన్ టెండూల్కర్ సహా పలువురు ఆటగాళ్లు అభినందలు తెలిపారు.
 
ఇటు వన్డేలు, అటు టెస్టుల్లోనూ ఇద్దరు ఆటగాళ్లు జంటగా నెలకొల్పిన భాగస్వామ్యాలు చూస్తే సంగక్కర, జయవర్ధనేలు రెండో అత్యుత్తమ జోడీగా నిలుస్తారు. వన్డేల్లో వీరిద్దరి మధ్య 151 ఇన్నింగ్స్‌లలో 41.61 సగటుతో 5992 పరుగులు వచ్చాయి. ఇందులో 15 సెంచరీ భాగస్వామ్యాలు ఉన్నాయి. టెస్టుల్లో ఈ ఇద్దరు కలిసి 120 ఇన్నింగ్స్‌లలో 56.50 సగటుతో 6554 పరుగులు జత చేశారు. వీటిలో 19 శతక భాగస్వామ్యాలు ఉండటం విశేషం.                   - సాక్షి క్రీడావిభాగం
 
 వన్డే కెరీర్ రికార్డ్
                  వన్డేలు    పరుగులు     సగటు    అత్యధిక స్కోరు     100      50

 సంగక్కర     404      14234        41.98         169                     25      93
 జయవర్ధనే    448      12650       33.37         144                    19      77

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement